వినదగు నెవ్వరు చెప్పిన…

మాటా మాటా పెరిగిపోయినప్పుడు మధ్యలో ‘చూడూ…’ అంటాం. అంటే దాని అర్థం చూడమని కాదు. బాగా వినమని. వినడమే కాదు, పాటించమని. మామూలుగా వినడానికి(హియరింగ్‌).. వినిపించుకోవడానికి(లిజనింగ్‌) మధ్య చాలా తేడా ఉంటుంది. వట్టినే ఆలకించడం మొదటిది. విని, జీర్ణించుకొని, వీలైనంతగా ఆచరణలో పెట్టడం రెండోది. ఆ మాటకొస్తే, అలా వినడం గొప్ప కళ. ఆ విద్య ఓ పట్టాన పట్టుబడదు. కేవలం చెవి ఒగ్గడం కాక మనసును సిద్ధపరచి విషయాన్ని గ్రహించాలి. మనసులో ఇంకించుకోవడాన్ని ఆకళించుకోవడం(ఆర్ట్‌ ఆఫ్‌ లిజనింగ్‌) అంటారు. ఇతరులు చెప్పేది వినడం నాయకత్వ లక్షణం. చాలామంది వింటున్నట్టు కన్పిస్తారు. కానీ వారి మనస్సు ఎక్కడో విహారిస్తూ వుంటుంది. ఇది తరగతి గదుల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చాలామంది ఇలా కన్పిస్తూ వుంటారు. సగం విని సగం వినకపోవడం వల్ల మరీ ప్రమాదం. ఏకాగ్రతతో విన్న విషయాలు జ్ఞానాన్ని ఇస్తాయి. ఎదుటి వ్యక్తులు చెబుతున్న మాటలని వినడం వల్ల ఆ వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం వుంటుంది. కొంతమంది చాలా శ్రద్ధగా వింటారు. ఆ చెప్పిన విషయంలోని లోటుపాట్లని చెప్పగలుగుతారు. వినే పద్ధతి అలవర్చుకుంటే చాలా విషయాల్లో అవగాహన ఏర్పడుతుంది. వినడం వేరు. విన్నదాంట్లో మంచిని గ్రహించడం వేరు. అలా చక్కగా విని ఆకళించుకోవలసినవిషయాలెన్నో ఉంటాయి.
ఉరుములు, వాహనాల మోతలు, కేకలు, బాజాభజంత్రీలు, మైకుల్లో పాటలు.. ఇలా ఎన్నో మన ప్రమేయం లేకుండా, మనకు వినాలన్న శ్రద్ధ లేకపోయినా వినిపించే శబ్దాలు. ఇలాంటివి వినపడలేదని సందేహమొస్తే మాత్రం వినికిడి లోపమేమోనని సందేహించాలి. అయితే ఏం విన్నావో వివరించమని అడిగినపుడు పాఠమైనా, ప్రసంగపాఠమైనా నాకు సరిగా వినపడలేదు అని చెప్తే మాత్రం వినపడక కాదు వినిపించుకోలేదని సందేహించాల్సి వస్తుంది. వారికి వినాలన్న ఆసక్తికన్నా విషయంపై అనాసక్తతే విశదమవుతుంది. యథాలాపంగా వినడం కాక చెవులు రిక్కించి వినడంలోనే అవగాహన మెరుగుపడుతుంది. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అని పదే పదే మనం వింటున్న నేటి రోజుల్లో ఆకళింపు చేసుకోవాలనే తపనతో వినడం ఈ నైపుణ్యానికి తొలిమెట్టు. కుటుంబ సభ్యులతోనైనా, కళాశాలలోనైనా, ఉద్యోగంలోనైనా వినేటపుడు మెళకువలు పాటించకపోతే మీతో మాట్లాడుతున్న వ్యక్తులకు మీ పట్ల ఉదాసీసనత కలిగి వారి అనుభవాలు, అనుభూతులు మీతో పంచుకోడానికి ఇష్టపడరు. విలువలు, విజ్ఞానం, విశేషాలతో నిండినది జీవనవేదం. దీనిని సరియైన మానసిక పరిణతితో అర్థం చేసుకోవాలంటే వినడం కాదు వినిపించుకోవడం ముఖ్యం. విశ్వరూపాన్ని సూక్ష్మరూపంలో దర్శించే దార్శనికత పెంపొందాలంటే చిన్న చిన్న విషయాలనైనా శ్రద్ధగా వింటే ప్రోది చేసుకున్న విషయ వివరణంతా విజ్ఞానరాశిగా మారుతుంది. ఇతరుల మాటలకు అడ్డుపడకుండా, ఒకేసారి అందరు మాట్లాడకుండా ఉంటే వినాలనున్నవారి ఉత్సుకత పెంపొంది విషయం శ్రవణ మకరందమవుతుంది.
‘వినడాన్ని విస్మరించిన సమాజం మాట్లాడుతోంది… మాట్లాడుతోంది… వినడం మానేసి, తనదే పైమాట కావాలని ఆరాటపడుతూనే ఉంది. ఇలా అయితే సమాజం బాగుపడేదెలా?’ అని ప్రశ్నిస్తున్నారు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌. ప్రస్తుత సమాజంలో వినికిడి కళకు క్షీణదశ నడుస్తోంది. చెప్పేవారే తప్ప వినేవారు లేరిప్పుడు. చెప్పిన మాట వినకపోవడం- పసిపిల్లల పెంకితనం. దాంతో పెద్ద పేచీ లేదు. చెప్పినా మాట వినకపోవడం పెద్దల్లో దుర్గుణం. అది సమాజానికి చేటు. నిజమే! కేవలం చెవులతోనే కాదు, ఒక్కోసారి హదయంతోనూ వినవలసి ఉంటుంది. అప్పుడే మాటల్లో బయటపడని గుండె ఊసులను, వాటి మూగ బాసలను గ్రహించే వీలుంటుంది. వినికిడి కళ పరమార్థం నెరవేరుతుంది!

Spread the love