లక్ష్యం

          లక్ష్యం లేని జీవితం గమ్యం లేని ప్రయాణం వంటిది అంటారు. అందుకే ప్రతి పనికి ఒక లక్ష్యం వుండాలి. అది చిన్న పని, పెద్ద పని, మహా కార్యం ఇలా ఏదైనా దానికి ఒక లక్ష్యముంటుంది. అదే విధంగా మంచి పనికి గాని, చెడు పనికి గాని, దుర్మార్గపు పనికి గాని ఒక లక్ష్యం కచ్చితంగా ఉంటుంది. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించు కుంటాడు. నిరుద్యోగి ఉద్యోగ సాధనకై ఓ లక్ష్యాన్ని రూపొందించుకుంటాడు. ఆ మార్గంలో పాటు పడుతుంటాడు. చేరాల్సిన లక్ష్యం ఎలాంటిదైనా కార్యాచరణ చాలా ముఖ్యం. ఎవరైనా సరే తాము కోరుకున్న ఫలితాన్ని సాధించడానికి ఓ ప్రణాళికను తయారు చేసుకొని అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. క్రమపద్ధతిలో అభివృద్ధిని సాధిస్తూ లక్ష్యం చేరేందుకు కృషి చేస్తారు. అయితే ఈ లక్ష్యం జంతువు, వ్యక్తి, వ్యవస్థ ఇలా ఎవరికైనా ఉండొచ్చు. ఎవరి లక్ష్యాలు వారికి ఉంటాయి. సాధారణంగా మనలో చాలా మంది నిర్ణీత సమయానికి తమ లక్ష్యాన్ని చేరుకోవాలనే దృఢనిశ్చయంతో కృషి చేస్తుంటారు. అయితే ఫలితాన్ని సాధించడానికి ఏర్పరచుకున్న మార్గంలో అనుకూల విషయాలతో పాటు కొన్ని ప్రతికూలాలు కూడా ఎదురవుతాయి. ఆ ప్రతికూల అంశాలను దాటుకుని ముందుకు పోయే వారే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. దీనికి నిబద్ధత చాలా అవసరం.
మనమందరం మన జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కోరుకుంటాం. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే అనవసరపు విషయాలపై దృష్టి పెట్టి లక్ష్యాలను మరచిపోతుంటారు. సాధించాలనే కోరిక ఉన్నంత మాత్రానా లక్ష్యం చేరలేరని గుర్తుంచుకోవాలి. బరువు తగ్గాలని చాలా మంది అనుకుంటారు. దాని కోసం పక్కా ప్రణాళిక కూడా రూపొందించుకుంటారు. బయటి ఆహారాన్ని తీసుకోకూడదని నిర్ణయించుకుంటారు. కానీ మూడో రోజే నిబంధనలను ఉల్లంఘిస్తారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ నిజంగా సాధించాలి అనే దృఢ నిశ్చయం ఉంటే మన దృష్టి మొత్తం లక్ష్యంపైనే ఉంటుంది.  ఇప్పటి వరకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని అనుసరించకపోతే దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. మళ్ళీ ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. అలా అని దాని కోసం అవిశ్రాంతంగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. నిర్ణయించుకున్న ప్రణాళికను ఆచరణలో పెడితే సరిపోతుంది. అప్పుడు ఆ లక్ష్యం ఎంత పెద్దదైనా, చిన్నదైనా సాధించవచ్చు.  ప్రతి వ్యక్తి, సమూహాం, వ్యవస్థ, సంస్థ ఎవరైనా తాము చేయబోయే పనికి ఒక లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించుకునే ముందుకు సాగుతారు. ఈ లక్ష్యాన్ని నిర్ణయించు కోవడమన్నది ఊహాజనితం కావచ్చు, ప్రణాళికా బద్ధంగా రాత పూర్వకంగా ఏర్పాటు చేసుకున్నది కావచ్చు. కానీ తప్పనిసరిగా లక్ష్యం, దాన్ని చేరుకునేందుకు ఓ ప్లాన్‌ అంటూ తప్పక ఉంటాయి. అయితే ఊహాజనితం కన్నా ప్రణాళిక ప్రకారం పని చేస్తే లక్ష్యాన్ని సునాయాసంగా సాధించవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనుషులుగా పుట్టాం కాబట్టి మనకు వ్యక్తిగత లక్ష్యాలతో పాటు సమాజిక లక్ష్యాలు కూడా ఉండాలి. మన చుట్టూ ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాకపోతే అవన్నీ మన వ్యక్తిగత లక్ష్యాలను చేరకుండా మనల్ని అడ్డుకుంటాయి. ఆ అడ్డంకులను తొలగించాలంటే సమాజ పరంగా మనం సాధించాల్సిన లక్ష్యాలపై కూడా దృష్టి పెట్టాల్సిందే.

Spread the love