పేరులో’నేముంది?!

What's in the name?!”పేరులో ఏముంది? గులాబీని ఏ పేరుతో పిలిచినా దాని సువాసన మారదు” అంటారు షేక్‌స్పియర్‌ ఒక నాటకంలో. అంతే కదా మరి! పుట్టినప్పుడు అమ్మానాన్నలో, వారి తల్లిదండ్రులో ఒక పేరు పెడతారు. గొప్ప నాయకుల పేరో, తమ పెద్దవాళ్ల పేరో పెట్టి, వాళ్లంత గొప్పగా బతకాలని దీవిస్తుంటారు. తర్వాత ఆ పిల్లలు ఏ కొంటెపనో, చిలిపి పనో చేసి చీవాట్లు తింటుంటే… ‘నీకు ఆ పేరు పెట్టింది వాళ్ల పేరు నిలబెడతావని గానీ ఇలాంటి వెధవ వేషాలు వేస్తావని కాదు అని నానా చీవాట్లు పెడుతుంటారు.
చాలా ఇళ్లల్లో పుట్టినప్పుడు పెట్టిన పేరును పక్కన పెట్టి బుజ్జి, చిన్నా, కన్నా, పండు, గన్ను, రస్నా… ఇలా ముద్దుగా ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు. స్కూలు రిజిస్టర్‌లో ఓ పేరు, ఇంటి దగ్గర పిలిచే పేరు మరొకటి, ఫ్రెండ్స్‌ ఇంకేదో పేరుతో పిలుస్తుంటారు. పరిచయమున్న వారు ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికేది మాత్రం మనమే. ఎలా పిలిచినా మనల్నే పిలస్తున్నారన్న గ్రహింపు వుంటుంది. పేరులో ఏముంది… ఆప్యాయంగా పిలిచే పిలుపులో వుంది గానీ! పెట్టిన పేరు నిలబెట్టకోవడంలో కూడా వుంటుంది గొప్పదనం.
కొన్నేళ్ల క్రితం ఎవరికీ లేని పేరు తమ పిల్లలకే వుండాలన్న తలంపుతో కొత్తగా, వింతగా ఆలోచించి స్కైలాబ్‌, జీఎస్‌టీ, కరోనా, నిర్ఘాంత్‌… ఇలా కొత్తగా విన్నవాళ్లు నిర్ఘాంత పోయే పేర్లు కూడా పెట్టారు. ఇక అమ్మాయిలకైతే పెళ్లప్పుడు జాతకాలు కలవలేదనో, మరోటనో పేరు మారుస్తుంటారు. ఇలా ఇంటి పేరుతో పాటు ఒంటిపేరు కూడా మారుతుంది కొంతమంది అమ్మాయిలకి. అయితే ఆ మార్చిన పేరుతో పిలుస్తున్నారా లేదా అనేది వేరే విషయమనుకోండి.
స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ పాత్ర ఎంతటిదో అందరికీ తెలిసిందే. అలాంటి గాంధీ పేరును వీధులతో పాటు, బ్రాందీ షాపులకు కూడా పెట్టడం చూస్తున్నాం. దీన్ని దేశభక్తి అనుకోవాలా? గాంధీ మీది గౌరవం అనుకోవాలా?
మన ఊర్ల పేర్లకు, భౌతిక పరిస్థితులకు సంబంధం వుంది. చెరువులు, నదులు, కొండలు, గుట్టలు, పరిసరాలలో వున్న వాటిని బట్టి ఊళ్ల పేర్లు ఏర్పడతాయి.
సినిమాల కోసం పేర్లు మార్చుకున్న హీరో హీరోయిన్లు వున్నారు. ఓ దశాబ్దం క్రితం అనుకుంటాను… ఊళ్లో యువకులకు పెళ్లి కావడం లేదని రాజస్తాన్‌లోని ఓ ఊరి పేరును కూడా మార్చారట గ్రామస్తులు.
అంతవరకెందుకు? మన దేశంలో ఎన్నో నగరాలకు ఎన్ని సార్లు పేర్లు మార్చలేదు? మద్రాస్‌ను చెన్నై అని, బాంబే ముంబయి అని, ఉత్తరాంచల్‌ను ఉత్తరాఖండ్‌గా, హోలెండ్‌ను నెదర్లాండ్‌గా, బర్మాను మయన్మార్‌గా, హస్తినాపురాన్ని వారణాసిగా, సిలోన్‌ను శ్రీలంకగా, సియామ్‌ను థారులాండ్‌గా… ఇలా చెప్పుకుంటూ పోతే దేశాల పేర్లు కూడా బోలెడున్నాయి. పేరు మార్చినంత మాత్రాన ఆ నగరానికి గానీ, దేశానికి గానీ, అక్కడి ప్రజలకు గానీ కొత్తగా ఏమైనా మేలు జరిగిందా? ఏ తేడా లేనప్పుడు మార్చడంలో ఉపయోగమూ లేదు.
మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నారట ఎనకటికి ఎవరో! వెనుకటి చరిత్రలు, పురాణాలు వల్లించడం మానేసి ముందున్న సమస్యలకు మార్గాలు వెతుక్కుంటే ఇప్పుడున్న పేరు నిలబెట్టుకోవచ్చేమో! ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుంది కదా!!

Spread the love