సహనం

సహనంసహనం ఒక నిగ్రహ శక్తి. మానసిక పరిపక్వతగల స్థితి. ఈ గుణం కలిగినవారు ఎల్లవేళలా నిశ్చలంగా ఉండగలరు. వారు జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటినీ సులభంగా పరిష్కరించగలుగుతారు. సహనం మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆవేశ పడకుండా ఆపుతుంది. మనిషిని ఉన్నత మార్గంలో నడిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సహనం ఒక అమూల్య సంపద. అందుకే ఈ సుగుణాన్ని మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ విడవ కూడదు. అయితే ప్రతి ఒక్కరికీ తమ దైనందిన వ్యవహారాల్లో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అటువంటి సమయంలోనే సహనం చాలా అవసరం.
మనిషైపుట్టిన వానికి సహనం, శాంతం అవసరమని మన పెద్దలు చెబుతుంటారు. జీవితంలో ఏం సాధించాలన్నా సహనం తప్పనిసరి. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవాలి. నిరంతరం అంకిత భావంతో చేసే కృషి, అవాంతరాలెదురైన సందర్భాల్లో సైతం పక్కకు తప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కోవడం, పొగడ్తలకు లొంగకుండా ఉండాలంటే సహనం ఒక్కటే మార్గం. కార్యక్షేత్రం ఏదైనా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే, శిఖరాలను అధిరోహించాలంటే సహనం తప్పనిసరి. ప్రపంచ మనుగడే సహనంతో ముడివడి ఉంది.
సహనం జ్ఞానాన్ని పెంచేందుకు సహకరిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే సహనాన్ని కీలకమైన సమయంలో కోల్పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పెద్దలు అంటుంటారు. అందుకే సహనంతో ఉండాలని మన పెద్దలు హితబోధ చేస్తుంటారు. అయితే ఈ సహనాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఒకవేళ సహనం తక్కువగా ఉంటే ఏ విధంగా అలవర్చుకోవాలన్న దానికి కొన్ని సాధారణ నియమాలను పాటిస్తే సరిపోతుంది.
సహనాన్ని కోల్పోతున్నట్టు అనిపిస్తే శారీరక వ్యాయామం ద్వారా సమస్యను అధిగమించటానికి ప్రయత్నించాలి. ఒక విషయంలో సహనం కోల్పోతున్నట్టు భావిస్తే మనలో మనమే నిగ్రహించుకునేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా కీలక సమయాల్లో మన మాటకు ఎవరన్నా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే విషయం అర్థమైనప్పటికీ దాన్ని పెద్దగా తీసుకోకుండా ఉండటం ఎంతో మంచిది. తామరాకు మీద నీటిబొట్టులా భావోద్వేగాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. సహనం హద్దులు దాటుతున్నట్టు లేదా నోరు అదుపు జారుతుందని అనిపించినా వెంటనే పది నుంచి ఒకటి వరకు అంకెలు లెక్కిస్తే కచ్చితంగా ఫలితం కనిపిస్తుంది.
అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మన సహనాన్ని చేతగాని తనంగా భావించే వారు కూడా మన చుట్టూ ఉంటారు. మనల్ని అణచివేసేవారి పట్ల, వివక్ష చూపుతున్న వారి పట్ల సహనం అస్సలు పనికి రాదు. అందుకే గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులైతుంది అంటారు. బాధను భరించలేనపుడు సహనం కోల్పోవడం సహజం. దాని స్థానంలో తిరుగుబాటు పుట్టక తప్పదు. బ్రిటిష్‌ వారి బానిసత్వాన్ని ఎదిరించిన స్వాతంత్రోద్యమం, రజాకార్ల ఆగడాలను ప్రశ్నించిన తెలంగాణ సాయుథ పోరాటం, మద్యపానానికి వ్యతిరేకంగా మహిళలందరినీ ఐక్యం చేసిన సారా ఉద్యమం అలా ఉద్భవించినవే.
కాబట్టి మనిషి మనుగడకు సహనం ఎంత ముఖ్యమో తిరుగుబాటుకు కూడా అంతే ముఖ్యం. అనవసర విషయాల్లో తొందర పడకుండా సహనంగా ఉండడం ఎంత అవసరమో అవసరమైనప్పుడు ఆ సహనాన్ని పక్కన పెట్టడం కూడా అంతే అవసరం.

Spread the love