రజత్‌కు మరో చాన్స్‌?

– పాటిదార్‌పై జట్టు మేనేజ్‌మెంట్‌ విశ్వాసం
– మంచి టెస్టు బ్యాటర్‌ కాగలడనే దీమా
– గురువారం నుంచి ధర్మశాల టెస్టు
సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌, రజత్‌ పాటిదార్‌.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అరంగ్రేటం చేసిన భారత క్రికెటర్లు. సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌లతో మెప్పించారు. ధ్రువ్‌ జురెల్‌ రాంచి టెస్టులో అసమాన ప్రదర్శనతో అభిమానులు, మాజీ ప్రశంసలు పొందాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగ్రేట ఇన్నింగ్స్‌లోనే అదరగొట్టి వార్తల్లో నిలిచాడు. కానీ రజత్‌ పాటిదార్‌ విశాఖపట్నంలో తొలి అవకాశం దక్కినా.. రాంచి వరకు ఓ మంచి ఇన్నింగ్స్‌ ఆడలేదు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 10.5 సగటుతో 36 పరుగులే చేశాడు. అయినా, ధర్మశాల టెస్టుకు రజత్‌ పాటిదార్‌కు మరో అవకాశం ఇచ్చేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ సిద్ధమవుతుంది. అందుకు కారణం లేకపోలేదు!!.
నవతెలంగాణ క్రీడావిభాగం
32, 9, 5, 0, 17, 0… ఇవీ రజత్‌ పాటిదార్‌ టెస్టు కెరీర్‌లో తొలి ఇన్నింగ్స్‌ల్లో చేసిన పరుగులు. 10.5 సగటుతో 36 పరుగులు. గణాంకాలు చూడగానే పాటిదార్‌ ఏమాత్రం మెప్పించలేదనే అంశం స్పష్టమవుతుంది. కానీ, క్రికెట్‌లో గణాంకాలతో ఓ ఆటగాడి సత్తా, సామర్థ్యంపై నిర్ధారణకు రాలేం. అటువంటి కోవలోకి రజత్‌ పాటిదార్‌ వస్తాడు. గణాంకాల పరంగా పాటిదర్‌ వైఫల్యం కనిపిస్తున్నా.. స్వల్ప స్కోర్ల ఇన్నింగ్స్‌ల వెనుక ఓ నాణ్యమైన టెస్టు బ్యాటర్‌ దాగి ఉన్నాడు. భారత జట్టు మేనేజ్‌మెంట్‌ ఈ విషయాన్ని పసిగట్టింది. అందుకే, రజత్‌ పాటిదార్‌కు వరుస మ్యాచుల్లో అవకాశాలు కల్పించింది. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 3-1తో భారత్‌ సొంతం చేసుకోగా.. చివరి టెస్టు గురువారం నుంచి ధర్మశాలలో ఆరంభం కానుంది. చివరి టెస్టు తుది జట్టులో సైతం రజత్‌ పాటిదార్‌ చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. సత్తా ఉంది, లక్‌ లేదు! : రాజ్‌కోట్‌ టెస్టు ఉదయం సెషన్‌. మార్క్‌వుడ్‌ ఐదో స్టంప్‌ లైన్‌లో సంధించిన బంతిని రజత్‌ పాటిదార్‌ కండ్లుచెదిరే కవర్‌డ్రైవ్‌తో బౌండరీగా బాదాడు. మార్క్‌వుడ్‌ వేసిన ఓ మంచి బంతిని సైతం పాటిదార్‌ శిక్షించాడు. ఓ నాణ్యమైన బ్యాటర్‌ లక్షణాలు అతడు ఆడిన కొన్ని షాట్లలోనే తెలుస్తాయి. బంతిపై నియంత్రణ, షాట్ల ఎంపికలో నేర్పు, పర్‌ఫెక్ట్‌ షాట్‌ ఆడటంలో నైపుణ్యం పాటిదార్‌ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. మార్క్‌వుడ్‌పై కవర్‌డ్రైవ్‌తో మెప్పించినా.. టామ్‌ హర్ట్‌లీ వేసిన బంతికి పాటిదార్‌ వికెట్‌ కోల్పోయాడు. ఇదే కథ విశాఖపట్నం టెస్టు నుంచి సాగుతూనే ఉంది. క్రీజులో కుదురుకున్నట్టు కనిపించినా.. ఓ చెత్త షాట్‌ పాటిదార్‌ ఇన్నింగ్స్‌కు తెరదించుతుంది. మూడు టెస్టుల్లో అవకాశాలు దక్కినా.. పాటిదార్‌ ఓ అర్థ సెంచరీ కొట్టలేదు. అయినా, క్రికెట్‌ విమర్శకులు రజత్‌ను ఏమీ అనలేదు. పాటిదార్‌ టెక్నిక్‌, టెంపర్‌మెంట్‌, బాడీ లాంగ్వేజ్‌ ఇలా అది బాలేదు, ఇది బాలేదు అంటూ విమర్శలు వినిపించటం లేదు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 40కి పైగా బ్యాటింగ్‌ సగటుతో టెస్టు అరంగ్రేటం చేసిన పాటిదార్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో అదృష్టం కలిసి రావటం లేదు!.
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కనీసం 100 బంతులు ఎదుర్కొన్న బ్యాటర్లలో బంతిపై మెరుగైన నియంత్రణ సాధించిన వారిలో రజత్‌ పాటిదార్‌ టాప్‌-4లో ఉన్నాడు. ధ్రువ్‌ జురెల్‌, శుభ్‌మన్‌ గిల్‌, అక్షర్‌ పటేల్‌ మాత్రమే రజత్‌ కంటే ముందున్నారు. 89.02 శాతం నియంత్రణతో పాటిదార్‌ ఆడాడు. కానీ అతడు ప్రతి మూడు చెత్త షాట్లకు వికెట్‌ కోల్పోయాడు. మూడు టెస్టుల్లో పాటిదార్‌ కేవలం 18 చెత్త షాట్లు మాత్రమే ఆడాడు. కె.ఎస్‌ భరత్‌, శ్రేయస్‌ అయ్యర్‌లపై జట్టు మేనేజ్‌మెంట్‌ విశ్వాసం కోల్పోయింది. ఎందుకంటే అయ్యర్‌ పదేసి చొప్పున చెత్త షాట్లతో వికెట్‌ కోల్పోయారు. రజత్‌ది బ్యాటింగ్‌ వైఫల్యం కాదని, అదృష్టం కలిసి రావటం లేదని జట్టు మేనేజ్‌మెంట్‌ నమ్ముతుంది.
పడిక్కల్‌ నుంచి పోటీ : చివరి టెస్టు ముంగిట రజత్‌ పాటిదార్‌ను రంజీ సెమీఫైనల్స్‌ కోసం వదిలేస్తారని అనుకున్నారు. మధ్యప్రదేశ్‌ తరఫున రంజీ ఆడేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ అంగీకారం తెలుపలేదు. కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి చివరి టెస్టుకూ అందుబాటులో లేరు. దీంతో నం.4 బ్యాటర్‌ రేసులో రజత్‌ పాటిదార్‌కు యువ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ నుంచి పోటీ ఉంది. గత 14 ఫస్ట్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ల్లో ఆరు సెంచరీలు సహా ఓ అజేయ 93 పరుగుల ఇన్నింగ్స్‌తో మెరిసిన పడిక్కల్‌ ధర్మశాలలో ఆడేందుకు ఎదురుచూస్తున్నాడు. ప్రాక్టీస్‌లోనూ పడిక్కల్‌ చెమటోడ్చుతున్నాడు. చివరి టెస్టులో పడిక్కల్‌కు ఆడించినా.. మళ్లీ పాటిదార్‌కు అవకాశం దక్వినా.. రజత్‌ స్వల్ప స్కోర్ల ప్రభావం తుది జట్టు ఎంపికపై ఉండకపోవచ్చు. అదృష్టం కలిసిరాని ఆరు ఇన్నింగ్స్‌ల వెనుక ఓ నాణ్యమైన బ్యాటర్‌ దాగి ఉన్నాడనే సంగతి జట్టు మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే గ్రహించింది.

Spread the love