– తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-వైరాటౌన్
ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ నేటికి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రైతులను గందరగోళం చేస్తున్నారని, 60 శాతం రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. శనివారం వైరా మండలం రెబ్బవరం గ్రామీణ వికాస్ బ్యాంకు ఎదుట రుణమాఫీలో జాప్యం నివారించి సకాలంలో పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ డిసెంబర్ 11, 2018 నాటికి ఉన్న రైతుల లక్ష రూపాయలు రుణమాఫీ ఎలాంటి మినహాయింపు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు రుణమాఫీ ఆశ చూపి ఓట్లు లబ్ది పొంది అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాల పూర్తి అవుతున్నా రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయకుండా రైతులను గందరగోళం చేస్తున్నారని అన్నారు, మొదటి విడతలో ఇరవై ఐదు వేలు, రెండోవ విడత ఏభై వేల ప్రకటించిన రైతులకు కూడా రుణమాఫీ కాలేదని, సెప్టెంబర్ 14 నాటికి సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఆచరణలో అక్టోబర్ మొదటి వారం గడిచిన రుణమాఫీ కాక ప్రతి రోజు రైతులు బ్యాంకులు చూట్టూ తిరిగి విసిగిపోయిన పరిస్థితి దాపురించిందని అన్నారు. వైరా రెబ్బవరం బ్యాంకులో 12 వందల మంది అర్హత పొందిన రైతులు ఉంటే నేటికీ నాలుగు వందల మంది రైతులకే రుణమాఫీ జరిగిందని అన్నారు. అప్పు చెల్లించిన రైతులకు రుణమాఫీ కావడం లేదని, బ్యాంకు ఎకౌంటు, ఆధార కార్డు పేర్లలో ఉన్న అక్షర దోషాలను సాకుగా చూపి రైతు రుణమాఫీ డబ్బులు జమ చేయడం లేదని, రుణమాఫీలో ఉన్న గందరగోళ పరిస్థితులకు వెంటనే తొలగించి సంపూర్ణంగా అమలు చేయాలని, లేనిచో రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా మండల కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు, సిపిఐ(ఎం) మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, సినీయర్ నాయకులు కురుగుంట్ల శ్రీనివాసరావు, రైతు సంఘం మండల నాయకులు అమరనేని వెంకటేశ్వరరావు, వెంపటి రాజా, వేణు, సైదా ఉస్సేన్, నాగేశ్వరరావు, రామకృష్ణ, తూము సుధాకర్, రైతులు పాల్గొన్నారు.
ఆయకట్టు చివర భూములకు సాగునీరు అందించాలి
రైతుల రాస్తారోకో…ఇరిగేషన్ డిఇకి వినతి
వైరా రిజర్వాయర్ చివరి ఆయకట్టులో సాగు చేసిన పంటలు రక్షించేందుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ వైరా మండలం పాలడుగు గ్రామంలో రాపల్లి, పాలడుగు రైతులు రాస్తారోకో చేశారు. వైరా ఎస్‌ఐ మెడా ప్రసాద్ జోక్యంతో రైతులు రాస్తారోకో విరమించిన అనంతరం వైరా ఇరిగేషన్ డిఇ శ్రీనివాసరావు వైరా రిజర్వాయర్ కుడి కాల్వలు పైన ఉన్న విషయం తెలుసుకున్న రైతులు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఆధ్వర్యంలో అక్కడకి వెళ్ళి తమ పంటలు పరిస్థితి వివరించారు. స్పందించిన ఇరిగేషన్ డిఇ శ్రీనివాసరావు గత రెండు రోజులుగా వైరా రిజర్వాయర్ పైభాగంలో తూములు నిలుపుదల చేసి విద్యుత్ మోటార్లు కూడా ఆపి దిగువ భాగంలో ఉన్న పంటలు రక్షించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. రైతులు కూడా సహకారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు నల్లమల నాగేశ్వరరావు, హనుమంతరావు, చావా నరేష్, లింగయ్య వెంకటకృష్ణ, రైతులు పాల్గొన్నారు.