Sunday, June 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిదీర్ఘకాలిక .. స్వల్పకాలిక..

దీర్ఘకాలిక .. స్వల్పకాలిక..

- Advertisement -

దీర్ఘకాలిక స్వల్పకాలిక అంటే అవేవో రుణాలగురించి అనుకోవద్దు. ఇది రుణానుబంధాల గురించి, అందులోనూ రాజకీయ మిత్రుత్వాల గురించి. ఈ మధ్యే ఒక పెద్దాయన చెప్పిన మాటలు, మాకు దీర్ఘకాలిక మిత్రులుంటారు, స్వల్పకాలిక మిత్రులుంటారు, స్వల్పకాలిక మిత్రులకోసమని దీర్ఘకాలిక మిత్రులను కోల్పోలేము అని. లెక్కల్లో తెలీని విలువను ఎక్స్ అనుకొనుము అని లెక్క మొదలుపెట్టి ఏవేవో జిమ్మిక్కులు చేసి చివరికి ఎక్స్ విలువ ఇంత అని లెక్కల టీచర్లు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. ఇంకో తెలియని విలువ ఉంటే దాన్ని వై అనుకొనుము అని చెబితే అనుకునేవాళ్ళం. అటు తిప్పి ఇటు తిప్పి దాన్నీ కనుక్కొని ఎక్స్ ఇంత, వై ఇంత అని లెక్కకట్టాలి. నేటి రాజకీయాలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. కొన్నిరోజులు రెండింటినీ వాడుకొని, ఎక్స్ విలువ తక్కువైనప్పుడు వైని, వై విలువ తక్కువైనప్పుడు ఎక్స్ ను వాడుకుంటున్నారు. స్వల్పకాలిక మిత్ర పార్టీని ఎక్స్ అనుకొనుము, దీర్భకాలిక మిత్ర పార్టీని వై అనుకొనుము అనేలాగుంది పరిస్థితి.
మూడు చేపల కథ మనకు తెలుసు.

అందులో దూరదర్శి, ప్రతీపన్నమతి, మందబుద్ది అనే మూడు చేపలుంటాయి. ఇంకా ఎండాకాలం వస్తే ఈ చెరువు ఎండిపోతుంది అని ముందే ఒక చేప దాటుకుంటే, చివరి క్షణంలో రెండోది దాటుకుంటుంది. ఇక మూడోది అక్కడే ఉంటుంది. ఇంతవరకే మనకు తెలుసు, కట్ చేస్తే …. అదే రోజు క్లౌడ్ బరస్టింగ్ వల్ల విపరీతమైన వర్షం పడి మూడో చేప బతికిపోతుంది, చెరువు దాటిన చేపల పరిస్థితి? అక్కడ ఓ వేటగాడి వలకు చిక్కుకొని అవి ప్రాణాలొదులుతాయి. ఇది లేటెస్టు రాజకీయ డ్రామా ఫినిషింగు టచ్చు. కాబట్టి ఓపికగా నమ్ముకొని ఒకే పార్టీలో ఉన్నవాళ్ళు పాత కథలోని మూడో చేపలా కావడం కాదు సింహాసనమే ఎక్కవచ్చు. ఏ ఈవియంలు వాడనక్కరలేదు, నామినేషన్ పత్రాలు తప్పని చెప్పనక్కరలేదు, సభ్యులను కొనేపని లేదు. నిబద్దబ గెలుస్తుంది అని నిరూపిస్తారు. ఎప్పుడూ అన్యాయమే పాలన చేయడు, సినిమాలో చివరిలో శుభం కార్డు పడినట్లు జరుగుతుంది కూడా.

సొంతగూడు కట్టుకొని ఎగిరిపోయిన పక్షులు ఇప్పుడు మమతలేని రాజకీయాలు మాకొద్దు, పవరులేని పాలిటిక్సు మాకొద్దు అని సొంతగూటికి చేరే సూచనలు నైరుతి రుతుపవనాల్లా దూసుకొస్తున్నాయని చెబుతున్నారు. అదెంత నిజమో కాని పూర్తిగా తీసెయ్యడానికి లేదు. రోజులు లెక్కపెట్టు కుంటున్నవాళ్ళు ఒకపక్క పెట్టుకుంటూనే ఉన్నారు. ప్రజలు కూడా రోజులు లెక్కపెడుతున్నారని లోలోపల నివేదికలొస్తున్నాయట. అందుకే రైతుల్ని అష్టకష్టాలు పెట్టి పొట్టనపెట్టుకున్నవాళ్ళు బొద్దింకలమీద ఈగకూడా వాలకుండా జాగ్రత్తపడ్డారంటే రాజకీయం చేయడమన్నది ఎంతటి కళ! కొత్త పార్టీ అధికారంలోకి రాకుండా బాబా నీకు మొక్కుతా అని బాబాని పంపిస్తే కూడా పనికాలేదు. అంకుల్ కూల్‌గా ప్రజలిచ్చిన తీర్పును గౌరవిద్దామని చెప్పి మొదటి చేపలా తాను దూకలేదు, రెండో చేపని దూకనివ్వలేదు. దీర్ఘకాల శత్రువును స్వల్పకాలిక మిత్రునిగా స్వీకరించలేదు. ఎంత రాజకీయామైనా నీతి నిజాయితీ ముఖ్యం. అవి లేకుండా అధికారంలో ఎన్నిరోజులున్నామని లెక్కలేసుకోవడం ఎంతటి వృధానో చరిత్రలో నిలబడిపోతుంది. అందుకే అంకుల్ స్టాలిన్ గౌరవం పొందాడు.

అధికార మన్నది స్వల్పకాలికం, విలువలన్నవి దీర్ఘకాలికం. కొన్ని రాష్ట్రాల్లో దీర్ఘకాలం, విలువలతోపాటు పాలించినోళ్ళు మీడియాకు కనిపించరు. స్వల్పకాలికంగా ఒక్కోసారి ఒక్కొక్కరిని ఎన్నుకునే రాష్ట్రాల ప్రజల తెలివితేటల్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోరు. ఇక రాజకీయాలకు స్వల్పకాలికమైన, దీర్ఘకాలికమైన ఎత్తుగడలు ఉండొచ్చు కాని నీతికి, నిజాయితీకి అలా ఉండదు. అవి అన్నికాలాలకు వర్తిస్తాయి, పాటించినవాళ్ళు ప్రజల హృదయాల్లో నిలబడిపోతారు. నీకు కావలసింది అలాంటి స్థానమా లేక గణాంకాల్లో స్థానమా అని నీవే నిర్ణయించుకోవాలి. ఒకరాష్ట్రంలోని విద్యామంత్రిని విమర్శించినంత సులభంగా ఎందరో పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా కేంద్రంలోని విద్యామంత్రిని విమర్శించడు ఒక నేత, విమర్శించడు కాదు, విమర్శించలేడు. ఎందుకంటే ఇక్కడా అదే సూత్రం ఒకరు తనకు దీర్ఘకాలిక శతృవు, పైనోళ్ళకు స్వల్పకాలిక మిత్రుడు. అది తేడా మిగతాదంతా సేం టు సేం. అధికారం సుఖీభవ.

జంధ్యాల రఘుబాబు 9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -