ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా అమలు చేయాలి

– ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉండాలి
– సీఎంకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లేఅవుట్‌ రెగ్యులేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌ రెడ్డికి అయన బహిరంగ లేఖ రాశారు. మీతో సహా ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తామనీ, ప్రజల దగ్గర ఎలాంటి చార్జీలు వసూలు చేయమని ఎన్నికల ముందిచ్చిన హామీకి కట్టుబడి ప్లాట్లను క్రమబద్ధీకరించాలని కోరారు. ఎల్‌ఆర్‌ఎస్‌ అంటే ప్రజల సొమ్ము దోచుకోవడమే నన్న కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు అదే ప్రజల నుంచి ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై కోర్టులో కేసు వేసిన మంత్రి కోమటిరెడ్డి ప్రజలకు సమా ధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగేలా ఎలాంటి చార్జీలు లేకుండా రెగ్యులరైజ్‌ చేయా లనే డిమాండ్‌తో ఈనెల 6న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజక వర్గ కేంద్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిరసన చేపట్టి వినతి పత్రాలు అందించామని గుర్తు చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని లేఖలో కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు

Spread the love