పోస్టాఫీసుల్లో మహిళా సమ్మాన్‌ సర్టిఫికెట్లు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహిళల చిన్న మొత్తాల పొదుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌’ రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయని ఇండియాపోస్ట్‌ హైదరాబాద్‌ సిటీ డివిజన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఏ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు బుధవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ పథకంలో మహిళలు తమ కోసం లేదా మైనర్‌ బాలికల తరఫున ఖాతాను తెరవవచ్చని తెలిపారు. కనిష్టంగా వెయ్యిరూపాయలు, గరిష్టంగా రెండు లక్షల వరకు డిపాజిట్‌ చేయోచ్చు. ఖాతా మెచ్యూరిటీ వ్యవధి రెండేండ్లు, గరిష్ట పరిమితికి లోబడి ఒక్కరు ఎన్ని ఖాతాలైనా మూడు నెలల తర్వాత తెరవవచ్చు. ఈ పథకం కింద డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేటు సంవత్సరానికి 7.5 శాతం ఉంటుంది. ప్రతి మూడునెలలకు ఒకసారి వడ్డీని లెక్కించి ఖాతాలో జమచేస్తారు. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఏడాది గడువు ముగిసిన తర్వాత, ఆ సొమ్ములో గరిష్టంగా 40 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. ఇతర వివరాలకు సమీపంలోని పోస్టాఫీసుల్లో సంప్రదించాలని ఆయన కోరారు.

Spread the love