పెట్టుబడులు పెట్టండి

Davos– దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్‌ బృందం
– అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో భేటీ
– ‘ఇన్వెస్ట్‌ ఇన్‌ తెలంగాణ’ పేరుతో పెట్టుబడుల ఆకర్షణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
‘ఇన్వెస్ట్‌ ఇన్‌ తెలంగాణ’ పేరుతో రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి బృందం దావోస్‌లో పర్యటిస్తున్నది. తొలిరోజు సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పలు అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగంలో పెట్టుబడులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వారు తెలిపారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షులు బోర్గ్‌ బ్రెండెతో పాలు ఆ సంస్థ నిర్వాహకులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చర్చించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను వారికి వివరించారు. ప్రభుత్వాలతో పారిశ్రామికవేత్తలు, వ్యాపార, వాణిజ్య వాటాదారులు కలిసి పని చేస్తే ప్రజలు సంపన్నులు అవుతారనీ, సుస్థిరమైన అభివృద్ధితో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. అనంతరం ఇథియోఫియా ఉప ప్రధాని డెమెక్‌ హసెంటోతో సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్‌మ్యాప్‌ను వారికి వివరించారు. నేషనల్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్‌కాం) అధ్యక్షులు శ్రీమతి దేబ్జానీ ఘోష్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నైపుణ్య శిక్షణా రంగంలో ఉన్న అవకాశా లను వారికి వివరించారు. ఇంజినీరింగ్‌, డిగ్రీ కోర్సులు చదువుతున్న యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాలు, ఉపాధి వంటి అంశాలపై ఈ చర్చలు జరిగాయి.
ఘన స్వాగతం
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ 54వ వార్షిక సదస్సు మూడురోజుల పాటు జరుగనుంది. దీనిలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుకు పలువురు ప్రవాసీ భారత ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. జ్యూరిచ్‌ ఎయిర్‌పోర్ట్‌లో వారితో భేటీ అయ్యారు. నవ తెలంగాణ నిర్మాణం కోసం మొదలైన తమ ప్రభుత్వ ప్రయత్నంలో వారంతా భాగస్వాములు కావటంపై ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు.
దావోస్‌లో ఆకట్టుకుంటున్న తెలంగాణ పెవిలియన్‌
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ ఆహూతులను విశేషంగా ఆకర్షిస్తున్నది. తెలంగాణ సంస్కతీ సంప్రదాయాలను చాటేలా ఈ వేదికను రూపొందించారు. బతుకమ్మ, బోనాలు పండుగలు, చారిత్రక వారసత్వ సంపద చిహ్నం చార్మినార్‌, చేర్యాల పెయింటింగ్‌, పోచంపల్లి ఇక్కత్‌, ఐటీ, టీ హబ్‌, స్కైరూట్‌ ఏరోస్పేస్‌ వంటి భిన్నరంగాల మేళవింపుతో ఈ పెవిలియన్‌ను తీర్చిదిద్దారు. ‘ఇన్వెస్‌ ఇన్‌ తెలంగాణ’ పేరుతో తమ వద్ద వివిధ రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలుపుతూ నినాదాలు రాసారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక హౌర్డింగ్‌ను ఇక్కడ నెలకొల్పారు.

హైదరాబాద్‌లో సీ4ఐఆర్‌ కార్యాలయం
– దావోస్‌లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌తో ఒప్పందం
– ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం
– ఫోరమ్‌ చీఫ్‌ బొర్గె బ్రెండే, సీఎం రేవంత్‌రెడ్డి సంయుక్త ప్రకటన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండిస్టియల్‌ రెవల్యూషన్‌ (సీ4ఐఆర్‌) కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. ఫోరం అధ్యక్షులు బోర్గే బ్రెండే, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం సంయుక్త ప్రకటన చేశారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో టెక్నాలజీ కలయికతో అత్యాధునిక సాంకేతికతను వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ రాష్ట్రానికి విశిష్ట సహకారం అందించనుందని ఆయన తెలిపారు. బయో ఏషియా సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్‌ ప్రారంభించనున్నట్టు సీఎం వెల్లడించారు. ”వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయి. జీవన విధానాలు, నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిస్తే ప్రజల జీవితాలు బాగుపడుతాయనే ఆలోచనల సారూప్యతకు కట్టుబడి ఉన్నాం. ఫోరమ్‌ ప్రపంచ స్థాయిలో పని చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తున్నది. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజల ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చు” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయిలో ఆరోగ్య సంరక్షణ విధానాలను సరికొత్తగా పునర్నిర్వచించే ఆలోచనల నేపథ్యంలో చిన్న పట్టణాలు, గ్రామాలకు ఈ సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ఆయన చెప్పారు. దీంతో రోగులకు మెరుగైన సేవలు అందడంతో పాటు ఆరోగ్య సంరక్షణలో కొత్త సాంకేతిక విధానాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. కొత్త ఆవిష్కరణలకు స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు.

Spread the love