కక్ష సాధింపులుండవ్‌

Cm Revanth Reddy– బీఆర్‌ఎస్‌ 24 గంటల విద్యుత్‌ ఇవ్వలేదు
– కొత్త భవనాలు నిర్మించం..పాతవే వాడుకుంటాం
– జర్నలిస్టులకు ఇండ్లస్థలాలపై మంత్రులతో మాట్లాడతా
– కమిట్‌ అయ్యాం..ఇస్తాం
– ఎంసీఆర్‌హెచ్‌ఆర్టీలోనే క్యాంపు ఆఫీసు
– పొదుపు చర్యల దిశగా అడుగులు : మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ సర్కారు వ్యవసాయం సాగు కోసం ఎప్పుడూ 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు ఉచితం పేర ఇచ్చింది కేవలం 12 నుంచి 14 గంటల కరంటేనని గుర్తు చేశారు. అందరితో చర్చించిన తర్వాతే సమయానుకూలంగా శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గానీ, ఆ సర్కారులోని మంత్రులపైగాని కక్షసాధింపు చర్యలుండవని అభిప్రాయపడ్డారు. ‘ మేము చేయాల్సిన పని చాలా ఉంది..అనవసర విషయాలపై దృష్టిపెట్టం’ అని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం దిశగా పనిచేస్తుందని చెప్పారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్‌ ఎన్నిక, క్యాబినెట్‌ సమావేశం అనంతరం సీఎం, సీనియర్‌ జర్నలిస్టులతో ‘చిట్‌చాట్‌’ చేశారు. ఈసందర్భంగా అనేక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో ఉంటుందన్నారు. అక్కడి ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకుంటామన్నారు. జూబ్లీహిల్స్‌లోని నా సొంత ఇంటికి దగ్గరగా ఉందనీ, అందుకే ఆ ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నట్టు చెప్పారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌ తరహాలో కొత్తగా శాసనమండలి నిర్మాణం చేస్తామన్నారు. అయితే తమ ప్రభుత్వం పొదుపు చర్యలు చేపడుతుందన్నారు. ‘నా ఖర్చు నేనే భరీస్తున్నా..నా భోజనం నేనే చేస్తున్నా..మంత్రులు సైతం ఇందులో భాగస్వాములవుతారు’ అని చెప్పారు. జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో మరో మంత్రికి అవకాశం ఇస్తామనీ, అలాగే మరో ప్రభుత్వ కార్యాలయానికి వాడుకుంటామని వివరణ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం కొత్త గా ఎలాంటి భవనాలు నిర్మించబోమనీ, పాతవే సమర్థవంతంగా వాడుకుంటామని చెప్పారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో ఉపయోగకరంగా ఉండదనీ, మరో రూట్‌లో ప్లాన్‌ చేస్తామని చెప్పుకొచ్చారు. ‘పాత అసెంబ్లీ భవనంలోనే కౌన్సిల్‌ సమావేశాలు జరుగుతాయి. ఇప్పుడు ఉన్న అసెంబ్లీ భవనంలోనే శాసనసభ సమావేశాలు నిర్వహిస్తాం..పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ఉండబోతున్నదని’ సీఎం చెప్పారు. ప్రభుత్వ ధనాన్ని దుబారా చేయకుండా పొదుపు చర్యలు తీసుకుంటామని అన్నారు. జర్నలిస్టుల ఇండ్లస్థలాల విషయంలో సీఎం రేవంత్‌ స్పందిస్తూ ‘ నా మంత్రులతో మాట్లాడకుండా..ఏమీ చెప్పలేను..కమిట్‌ అయ్యాం..కచ్చితంగా న్యాయం చేస్తాం..ఎవరికీ అన్యాయం జరగదు’ అని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగంగా ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సీఎం, మంత్రులకు పెద్ద పెద్ద కాన్వారులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరతామని అన్నారు

Spread the love