అధ్య‌క్షా…

President...– శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక
– రాష్ట్ర మంత్రివర్గ భేటి.. నేటి గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదముద్ర
– సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, కేటీఆర్‌, కూనంనేని సహా పలువురి శుభాకాంక్షలు
– స్పీకర్‌ స్థానం వరకూ తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టిన సభ్యులు
– అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి పదవికి ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయటం, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తోపాటు మిగతా పక్షాలన్నీ మద్దుతు తెలపటంతో ప్రసాద్‌కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయనకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీఆర్‌ఎస్‌ సభ్యుడు కేటీఆర్‌, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు సహా మిగతా సభ్యులందరూ అభినందనలు తెలిపారు. నాలుగు రోజుల విరామం అనంతరం గురువారం ఉదయం 10.30 గంటలకు శాసనసభ ఆరంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ… సభాపతిగా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తోపాటు మిగతా పక్షాలకు చెందిన సభ్యులందరూ ప్రసాద్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సభ్యుల ఆత్మీయ ఆలింగనాలు, అభినందనల వెల్లువ నడుమ సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు, కేటీఆర్‌, కూనంనేని తదితరులు ఆయన్ను స్పీకర్‌ స్థానం వరకూ తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ… స్పీకర్‌గా ప్రసాద్‌కుమార్‌ సభ హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడాలనీ, సత్సాంప్రదాయాలను నెలకొల్పాలని ఆకాంక్షించారు. సభ్యుల ప్రసంగాల అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం అసెంబ్లీ కమిటీహాల్‌లో సీఎం రేవంత్‌ అధ్యక్షతన భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం… శుక్రవారం సభలో గవర్నర్‌ చేయబోయే ప్రసంగానికి ఆమోదం తెలిపింది. సభా వ్యవహారాల సంఘం (బీఏసీ) శుక్రవారమే సమావేశమై…అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయిస్తుందనే వార్తలొచ్చాయి. అయితే బీఏసీ రూపుదాల్చాలంటే వివిధ పార్టీల నుంచి ఎవరెవరు ఆ సంఘంలో సభ్యులుగా ఉంటారనే దానిపై స్పష్టత రావాలి. దానికి అనుగుణంగా ఆయా పార్టీలు అసెంబ్లీ కార్యదర్శికి లేఖలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తికానుందున బీఏసీ సమావేశం శుక్రవారం ఉండే అవకాశం లేదని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. అందువల్ల శనివారం వరకే సమావేశాలు కొనసాగుతాయనీ, ఆ తర్వాత సభను నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై స్పీకర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
సందడే సందడి…
గురువారం అసెంబ్లీ ప్రాంగణమంతా సందడి నెలకొంది. సీఎం, మంత్రులు, సభ్యులు సభకు వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు కార్యకర్తలు, అభిమానుల హడావుడి, మీడియా హంగామా కనిపించింది. ప్రసాద్‌కుమార్‌ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఛాంబర్‌ వద్ద రద్దీ నెలకొంది. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వికారాబాద్‌కు చెందిన నాయకులు, పాత్రికేయులు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం సంతోషకరం : భట్టి విక్రమార్క
ప్రజాస్వామ్య అత్యున్నత దేవాలయంగా భావించే అసెంబ్లీలో స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కావడం సంతోషకరమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దీనికి సహకరించిన స్వపక్ష, విపక్ష, మిత్రపక్ష సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కలిసి పనిచేద్దామని సభ్యులకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అర్ధవంతంగా చర్చలు జరిగేలా..ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే దిశగా స్పీకర్‌ సలహాలు, సూచనలు ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. ప్రజా సమస్యలపై లోతుగా చర్చిండానికి సభలో గౌరవ సభ్యులకు అధిక సమయం ఇవ్వాలని కోరారు. గౌరవసభ్యులందరూ సభామర్యాదలను పాటిస్తూ వారి హక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సభ అందరిదీ..హక్కులను కాపాడే బాధ్యత స్పీకర్‌ది : కేటీఆర్‌
సభ అందరిదనీ, ప్రతి సభ్యుడి హక్కులను కాపాడేలా, ప్రజల తరఫున మాట్లాడేవారి గొంతును వినిపించేలా బాధ్యతను సమర్ధవంతంగా స్పీకర్‌ నిర్వర్తించాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు ఆకాంక్షించారు. ఎంపీటీసీ నుంచి శాసనసభాధిపతి వరకు ఎదిగిన స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో మంత్రిగా ఆయన సిరిసిల్లకు వచ్చారని, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేశారని కొనియాడారు. మాజీ స్పీకర్లు మధుసూదనా చారి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నెలకొల్పిన సాంప్రదాయా లను, కాపాడిన విలువలను పరిరక్షించాలని కోరారు.

Spread the love