కొంతమందికి ఎక్కువగా…కొంత మందికి తక్కువగా…

– తప్పుల తడకగా టి-సాక్స్‌ ఉద్యోగుల ఏప్రిల్‌ జీతాలు
– ఆందోళనలో ఉద్యోగస్తులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ స్టేట్‌ ఎయిట్స్‌ కంట్రోల్‌ సొసైటీ (టీసాక్స్‌) ఉద్యోగుల ఖాతాల్లో గందరగోళం చోటు చేసుకుంది. వీరిలో అత్యధిక మంది ఉద్యోగులు కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదినక పని చేసే వారు. ఒకవైపు పని భారం పెరుగుతున్న వారికొస్తున్న జీతాలు చాలీచాలక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సొసైటీ ప్రధాన కార్యాలయం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం మరింత కుంగదీస్తున్నది. ఏప్రిల్‌ నెల జీతాలు కొంత మందికి ఎక్కువగా, కొంత మందికి తక్కువగా ఖాతాల్లో జమ అయ్యాయి. ఒకే క్యాడర్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో కొంత మందికి ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ మినహాయించి, మరికొంత మందికి మినహాయించకుండా వేయడంపై ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీశాక్స్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా కె.హైమావతి నియమితులయ్యాక ఉద్యోగుల పని, ప్రయోజనాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలకు వారి నుంచి మన్ననలు అందుకున్నారు. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలచ్చే విధంగా చర్యలు తీసుకుని అమలు చేస్తుండటం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీశాక్స్‌లో అధికారులు బాధ్యాతరహితంగా వ్యవహరిస్తుండటం ఆందోళనకరంగా మారింది. జీతాల ఫైల్‌ తయారు చేయడమే ఈ అయోమయానికి కారణంగా తెలుస్తున్నది. ఈ ఫైలు బేసిక్‌ సర్వీసెస్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో తయారైనట్టు సమాచారం. ప్రాజెక్టును ప్రయోజనకరంగా మారుస్తున్న సమయంలో జీతాల్లో కోతలవంటి తప్పులు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ను కోరుతున్నారు.

Spread the love