వైద్యానికి సుస్తీ..

– వైద్యవిధాన పరిషత్‌లో నాలుగు వేల ఖాళీలు
– కొత్త సర్కారులోనైనా భర్తీ అయ్యేనా?
–  నామ్‌కేవాస్తేగా సేవలు
–  ప్రయివేటుకు వెళ్లక తప్పని పరిస్థితి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అక్కడ ఆస్పత్రి ఉంటుంది. అదీ ప్రభుత్వాస్పత్రి ఉంటుంది. నర్సు ఉంటే డాక్టరు ఉండరు. డాక్టర్‌ ఉంటే నర్సు ఉండరు. వారిద్దరు ఉంటే ఫార్మాసిస్టు ఉండరు. ల్యాబ్‌ టెక్నీషియన్లు కనిపించరు. బయట మాత్రం బోర్డు బ్రహ్మాండంగా కనిపిస్తుంటది. డిస్పెన్సరీలు మొదలు జిల్లా ఆస్పత్రుల వరకు సిబ్బంది కొరత వెక్కిరిస్తుంటది. ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక సమాచారంలో మాత్రం తాము ఎన్ని ఆస్పత్రుల ద్వారా ప్రజలకు ప్రజావైద్యాన్ని అందిస్తున్నామనే విషయాలను వివరిస్తుంటారు. క్షేత్రస్తాయిలోనేమో ఆయా ఆస్పత్రులు అందించాల్సిన సేవలు పూర్తి స్థాయిలో అందించలేక నామమాత్రంగా మిగిలాయి. రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ పరిధిలో రాష్ట్రంలో 179 ఆస్పత్రులు డిస్పెన్సరీ మొదలు జిల్లా ఆస్పత్రుల వరకున్నాయి. ఇందులో 10,470 బెడ్లున్నాయి. వీటిలో జిల్లా ఆస్పత్రుల్లో 2,490, ఏరియా ఆస్పత్రుల్లో 2,940, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో (50 పడకలవి) 1,100, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు (30 పడకలవి) 2,430, మెటర్నిటీ చైల్డ్‌ హెల్త్‌ హాస్పిటల్స్‌ లో 1,250, అర్బన్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో 260 ఉన్నాయి.
వస్తున్న రోగుల సంఖ్యకు తగినట్టుగా ఈ ఆస్పత్రులు పూర్తి స్థాయిలో సేవలందించాలంటే 12,588 మంది సిబ్బంది అవసరం. అయితే కేవలం 5,197 మంది మాత్రమే రెగ్యులర్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 7,400 పోస్టులు భర్తీ చేయాల్సినవి ఉండగా, ఇందులో అత్యవసర సేవలందించేందుకు 1,014 మంది కాంట్రాక్టు, 1,582 మంది అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన సేవలందించే వారు ఉన్నారు. మరో నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉండటంతో క్షేత్రస్థాయిలో సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు ముందు నిర్వహించిన నర్సుల పరీక్షా ఫలితాలు వెల్లడైతే 757 మంది వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో సేవలందించేందుకు అందుబాటులోకి వస్తారు. పరీక్షలు పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వాటి ఫలితాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. వాటిని వేగంగా భర్తీ చేస్తే కొంత మేరకు సిబ్బంది కొరత తగ్గే అవకాశముంది.
ఎందుకిలా?
ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే డిమాండ్లతో ఆస్పత్రులనైతే పెంచారు. ఆస్పత్రుల అప్‌ గ్రేడేషన్‌కు అనుమతించారు. ఒక వైపు కొత్త ఆస్పత్రుల మంజూరు, పాత ఆస్పత్రుల అప్‌గ్రెడేషన్‌తో బెడ్ల సంఖ్య పెరిగింది. అందుబాటులోకి సేవలొచ్చాయనే ప్రచారంతో వచ్చే రోగుల సంఖ్యా పెరిగింది. ఒక వైపు జిల్లాకో మెడికల్‌ కాలేజీతో, వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని జిల్లా ఆస్పత్రులు బోధనాస్పత్రులుగా ఉన్నతీకరించడంతో వైద్య విధాన పరిషత్‌లోని సిబ్బంది డీఎంఈ పరిధి ఆస్పత్రుల్లోనే సేవలందిస్తున్నారు. అదే సమయంలో పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఉన్నతీకరించడంతో ఆ ఆస్పత్రులు వైద్య విధాన పరిషత్‌ పరిధిలోకి వచ్చాయి. అదే సమయంలో ఆ ఆస్పత్రులకు తగినంత సిబ్బందిని సమకూర్చడం మాత్రం జరగలేదు. ఉన్నతాధికారులు తాత్కాలికంగా సిబ్బందిని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సర్దుబాటు చేస్తూ సేవలకు మరీ విఘాతం కలగకుండా ప్రయత్నిస్తున్నప్పటికీ, సిబ్బంది పూర్తి స్థాయిలో వస్తే తప్ప సామాన్యులకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందే పరిస్థితి లేదు. కొత్త సర్కారు వీటికి పరిష్కారం చూపిస్తుందని ఆశిద్దాం.

Spread the love