రాజన్న ఆలయంలో నకి’లీలలు’

రాజన్న ఆలయంలో నకి'లీలలు'– నకిలీ ధృవపత్రాలతో ఆలయ ఏఈఓ హరికిషన్‌ పదోన్నతి?
– ప్రవేశం తీసుకుంది సేలంలో.. పట్టా పొందింది బీహార్‌లో..
– ఆలయ రిటైర్డ్‌ ఉద్యోగి నామాల రాజేందర్‌ ఫిర్యాదుతో..
– అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
– ఇదే వరసలో మరికొందరూ…?
నవతెలంగాణ – వేములవాడ
దక్షిణాకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ ధృవపత్రాల భాగోతం కలకలం సృష్టించేట్టు తెలుస్తోంది. ఇప్పటికవరకు కేవలం భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, లడ్డు తయారీలో నాణ్యతా లోపం, శానిటేషన్‌ విభాగం నిర్లక్ష్యం, బ్లాక్‌లో టికెట్ల విక్రయం, సిబ్బంది చేతివాటం వంటి పలు విషయాల్లో వార్తలో్లకక్కిన రాజన్న ఆలయం.. ఇప్పుడు ఏకంగా నకిలీ ధృవపత్రాలతో పదోన్నతి పొందిన ఉద్యోగుల వ్యవహార శైలితో మరోమారు సంచలనం సృష్టించనుంది. రాజన్న ఆలయంలో ఏఈవోగా విధులు నిర్వహిస్తున్న ఎస్‌.హరికిషన్‌ నకిలీ ధృవపత్రాలు సమర్పించి పదోన్నతి పొందినట్టు సమాచారం. దీనికి తోడు ఆలయాధికారులు సైతం సీనియర్లను కాదని, హరికిషన్‌కు పదోన్నతి కల్పించి, కీలక బాధ్యతలు అప్పగించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై గతంలోనే కొంతమంది ఉద్యోగులు దేవాదాయ శాఖ కమిషనర్‌కు, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా సదరు ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే వాదనలు వినిపించాయి.
ప్రవేశం తీసుకుంది సేలంలో.. పట్టా పొందింది బీహార్‌లో..
హరికిషన్‌ నకిలీ ధృవపత్రాల విషయంలో ఆయన చేసిన తప్పును ఆయనే బయటకు తీసుకొచ్చేలా చేసుకున్నాడనే విషయం తెలుస్తోంది. ఆలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఇంటర్మీడియట్‌ అర్హత కలిగిఉన్న హరికిషన్‌ పదోన్నతి పొందే సమయానికి డిగ్రీ పట్టాను సంపా దించాడు. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఒక్క యూనివర్సిటీల్లో కాకుండా తమిళనాడులోని సేలం, బీహార్‌లోని మరో యూనివర్సిటీలో డిగ్రీ చదివినట్టు పట్టాలు సమర్పించాడు. ఇందులో కనీసం ఆయన పూర్తి పేరు, తండ్రిపేరు, పుట్టిన తేదీ వంటి ప్రాథమిక వివరాలు కూడా సరిగ్గా లేకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు సదరు విద్యార్థికి సంబంధించిన అకాడమీ వివరాలు తెలపాలని కోరుతూ యూనివర్శిటీలకు లేఖలు రాశారు. వాటిపై ఇంతవరకు ఎలాంటి జవాబు రాలేదు. దీంతో హరికిషన్‌ సర్టిఫికేట్ల విషయంలో అనుమానాలు రెట్టింపయ్యాయి.
ఇదే వరసలో మరికొందరు..?
మరోవైపు ఈ విషయంలో కేవలం హరికిషనే కాకుండా ఇదే వరసలో మరికొంత మంది ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. హరికిషన్‌ మాదిరే మరికొంత మంది ఉద్యోగులు నకిలీ ధృవపత్రాలు సమర్పించి, అక్రమ మార్గంలో పదోన్నతులు పొందినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న ఆలయంలో ఇలాంటి నకిలీలు ఉంటూ, అందులోనూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ అటు అధికారులను, ఇటు కింది స్థాయి ఉద్యోగులను, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తూ కాలం వెల్లదీస్తున్న నకిలీలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకో కపోవడం గమనార్హం. ఉన్నతాధికారులు స్పందించి నకిలీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలయ ఉద్యోగులు, సిబ్బందితో పాటు భక్తులు కోరుతున్నారు.
రిటైర్డ్‌ ఉద్యోగి ఫిర్యాదుతో వెలుగులోకి…
కొన్నేండ్లుగా నకిలీ ధృవపత్రాలపై ఆలయంలో తీవ్ర చర్చ జరుగుతున్నప్పటికీ సరైన ఆధారాలు లేకపోవడంతో ఎవరూ దీనిపై దృష్టిసారించలేదు. అయితే ఆలయంలో సూపరిండెంటెండ్‌గా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన నామాల రాజేందర్‌ ఈ నకిలీ తంతు విషయమై హరికిషన్‌పై పలుమార్లు ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరికి నవంబర్‌ నెలలో హరికిషన్‌ నకిలీ దృవపత్రాల విషయంలో అన్ని ఆధారాలతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్టయింది.

Spread the love