అదనపు టీఎంసీ వరద కాలువ తవ్వకాలకు బ్రేక్‌

అదనపు టీఎంసీ వరద కాలువ తవ్వకాలకు బ్రేక్‌– సర్కారు మార్పుతో స్తంభించిన పనులు
– ఇండ్లకు తరలిన కూలీలు
– షెడ్లకు పరిమితమైన లారీలు, ప్రోక్లైనర్లు
– కొత్త సర్కారు ఆదేశాలిస్తేనే పనులు
– పలు గ్రామాల భూ నిర్వాసితులకు అందని పరిహారం
నవతెలంగాణ – గంగాధర
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన 1.1 అదనపు టీఎంసీ వరద కాలువ తవ్వకం పనులకు బ్రేక్‌ పడింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ పనులు ప్రభుత్వ మార్పుతో స్తంభించాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలం కొదురుపాకలో నిర్మించిన మిడ్‌ మానేరు జలాశయానికి మరింత నీరు చేర్చేలా చేపట్టిన అదనపు టీఎంసీ వరద కాలువ తవ్వకాలు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదేశాలిస్తే తప్పా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు.
ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు జలాశయం వరకు అదనపు టీఎంసీ కాలువ తవ్వకానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో టెండర్‌ ప్రక్రియ పూరై భూసేకరణ పూర్తి కాగా, 80 శాతం మేరకు భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులు జరిగాయి. ఇంకా 20శాతం మేరకు పలు గ్రామాల్లోని భూనిర్వాసితులకు చెల్లించాల్సి ఉంది. కాని భూసేకరణ, పరిహారం చెల్లింపులు పూర్తి కావడానికే సుమారు ఏడాది పట్టగా, తవ్వకాలు కూడా అదే సమయంలో ప్రారంభమయ్యాయి. రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా పట్టించుకోని ప్రభుత్వం.. సంబంధిత రెవెన్యూశాఖ ద్వారా శరవేగంగా భూసేకరణ పూర్తి చేయించి నష్ట పరిహారం చెల్లింపులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. అదే తరహాలో ఎన్నికల్లోపే కాలువ తవ్వకాలు పూర్తి చేసేలా అధికార యంత్రాగం చర్యలు చేపట్టి ఆరు నుంచి పది కిలో మీటర్లకు ఒక బిట్లుగా విభజించి ఒక్కో కాంట్రాక్టర్‌కు ఒక బిట్టు తవ్వకం బాధ్యతలు అప్పగించారు. అయినా కాలువ తవ్వకాల్లో తీవ్ర జాప్యం ఏర్పడగా, ఆలోపే ఎన్నికలు ముంచుకొచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ మార్పుతో సంబంధిత కాంట్రాక్టర్లు తవ్వకాలను నిలిపి వేయగా, పనులు లేక కార్మికులు ఊళ్లకు వెళ్లిపోయారు. దాంతో తవ్వకాలకు ఉపయోగించే ప్రోక్లైనర్లు, లారీలు వరద కాలువ తవ్వకాల సమీపంలో వేసుకున్న షెడ్లకే పరిమితమయ్యాయి.
3 మండలాల రైతాంగానికి తీవ్ర నష్టం
ప్రభుత్వం చేపట్టిన అదనపు టీఎంసీ వరద కాలువ వల్ల చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు, బోయినిపల్లి మండల్లాలోని అనేక గ్రామాల రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో ఇండ్లు కోల్పోతున్నారు. కొండన్నపల్లి, న్యాలకొండపల్లి, కురిక్యాల గ్రామాల పరిధిలో సుమారు వేయి ఎకరాల మేరకు వ్యవసాయ భూములు ఉండగా, ఇప్పటికే తవ్వకం చేపట్టిన వరద కాలువ, నిజామాబాద్‌-కరీంనగర్‌, కొత్తపల్లి -మనోహరాబాద్‌ రైల్వేలైన్లలో సుమారు 400 ఎకరాల మేరకు భూములను కోల్పోయారు. ప్రస్తుతం చేపట్టే 1.1 టీఎంసీ అదనపు వరద కాలువ తవ్వకాల్లో కొండన్నపల్లిలోని సుమారు 50 నివాస గృహాలు, న్యాలకొండపల్లి శివారులో ఉన్న 63.2 ఎకరాలు, కురిక్యాల శివారులో ఉన్న 52.15 ఎకరాలు, నాగిరెడ్డిపూర్‌ శివారులో ఉన్న 33.36 ఎకరాలు మొత్తంగా 149.13 ఎకరాల మేరకు కొండన్నపల్లి పరిసర గ్రామాల రైతులు భూములను కోల్పోయారు. అదనపు టీఎంసీ కాలువ తవ్వకాల వల్ల గంగాధర, రామడుగు, బోయినపల్లి మండలాల్లోని 14 గ్రామాల్లో 639 ఎకరాల భూములు కోల్పోయి చాలా మంది రైతులు సెంట్‌ భూమి లేని రైతులుగా మారగా, రైతులు రైతు కూలీలుగా మారారు.
కొత్త సర్కారు ఆదేశాలిస్తేనే పనులు
అదనపు టీఎంసీ వరద కాలువ తవ్వకం పనులు ప్రస్తుతం నిలిచి పోగా, కొత్త సర్కారు నుండి ఆదేశాలు వెలువడితే తప్పా పనులు ముందుకు సాగే పరిస్థితులు లేవని సంబంధిత కాంట్రాక్టర్లు స్పష్టం చేసినట్టు వర్కర్లు వాపోయారు. వైఎస్‌ఆర్‌ హయాంలో చేపట్టిన వరద కాలువను ఆనుకునే అదనపు టీఎంసీ వరద కాలువ తవ్వకం పనులు సాగుతున్నాయి. దీని ద్వారా రైతాంగానికి, ప్రాజెక్టులకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో లేదో కాని భూములు కోల్పోయిన రైతులు మాత్రం లబోదిబోమని మొత్తుకుంటున్నారు.
వరద కాలువ తవ్వకాలు, కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణలో వేలాది ఎకరాల భూములు కోల్పోయిన రైతులు.. రైతు కూలీలుగా మారారు.
దాంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లి ఆందోళన చెందుతుంటే మరోసారి అదనపు టీఎంసీ వరద కాలువ తవ్వకాల పేరుతో ఉన్న భూములు కోల్పోయి రైతులు కోలుకోలేని స్థితికి చేరారు. అదనపు టీఎంసీ వరద కాలువ తవ్వకాలు వద్దంటూ, ఉన్న భూములు ఊడ్చుకుపోతున్నాయంటూ రైతులు గగ్గోలు పెట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోగా, బలవంతంగా భూసేకరణ పూర్తి చేసి తవ్వకాలు చేపట్టారు.

Spread the love