కాంగ్రెస్‌ తోకలు కట్‌ చేస్తాం

We will cut the tails of Congress– ఆ పార్టీ..అన్నదాతలకు నెంబర్‌వన్‌ విలన్‌…
– ‘హస్తం’పై మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఫైర్‌
– డిపాజిట్లు గల్లంతవుతాయని హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైతు బంధు పథకంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయటాన్నిబట్టి అన్నదాతల పట్ల ఆ పార్టీ వైఖరేంటో తేలిపోయిందని రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. రైతులను ఆగం చేయాలని చూస్తే కాంగ్రెస్‌ తోకలు కట్‌ చేస్తామంటూ వారు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌ లోనూ ఆయన ఇవే అంశాలను ప్రస్తావించారు. మరోవైపు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పటాన్‌చెరుకు చెందిన పలువురు బీజేపీ నేతలు… బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రైతులకు ద్రోహం చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్‌ హెచ్చరిం చారు. ఆ పథకాన్ని ఆపాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసిన ఆ పార్టీ… రైతు విరోధి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇంటింటికి మంచినీళ్లు.. 24 గంటల కరెంటును కూడా కాంగ్రెస్‌ నేతలు ఆపెయ్యమంటారేమో…’ అంటూ ఎద్దేవా చేశారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్‌ పార్టీ కుట్రను అన్నదాతలు సహించరు.. ఆ పార్టీ కుతంత్రాలను భరించబోరని హెచ్చరించారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులు అరిగోస పడుతున్నరు.. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్‌ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో రైతుల పట్ల ఆ పార్టీ వైఖరిని ఎండగడుతూ ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ దిష్టిబొమ్మల ను దహనం చేయాలనీ, ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులందరూ పాల్గొనాలని ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలో పదకొండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌… రైతులకు ఒక్క పైసా సాయం చేయలేదని హరీశ్‌రావు విమర్శించారు. కానీ కేవలం రెండంటే రెండేసార్లు అధికారంలోకి వచ్చిన తమ పార్టీ పదకొండు దఫాలుగా రైతు బంధు సాయాన్ని అందించిందని ఆయన వివరించారు. ఈ పథకం కొత్తది కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.75 వేల కోట్లను ఆ పథకం ద్వారా రైతులకు అందించామని గుర్తు చేశారు. అందువల్లే 69 లక్షల మంది రైతులు కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. అన్నదాతలతో పెట్టుకుంటే ఖబర్దార్‌.. డిపాజిట్లు గల్లంతవు తాయని కాంగ్రెస్‌ నేతలను ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్‌ కుట్రలతో నెల రోజులపాటు పథకాలు ఆగినా మళ్ళీ తాము అధికారంలోకి రాగానే వాటన్నింటినీ పునరుద్ధరిస్తా మని చెప్పారు. రైతు రుణమాఫీ కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశామని ఆయన వివరించారు.
బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీ కూచుకుంట్ల రాజీనామా
ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌కు దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామ లేఖను సీఎం కేసీఆర్‌కు పంపారు. స్థానిక సమస్యలను పట్టించుకోక పోవడంవల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Spread the love