అద్దె కట్టలేదని ఈఎస్‌ఐ ఆస్పత్రికి తాళం

అద్దె కట్టలేదని ఈఎస్‌ఐ ఆస్పత్రికి తాళం– బయటే విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌
–  8 నెలలుగా వేతనాలు లేవని ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆవేదన
నవతెలంగాణ-తూప్రాన్‌ రూరల్‌/మనోహరాబాద్‌
ఈఎస్‌ఐ డిస్పెన్సరీ భవనానికి అద్దె ఇవ్వడం లేదంటూ యజమాని తాళం వేశారు. అయినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో నాలుగు రోజులుగా డాక్టర్‌ బయటే విధులు నిర్వహిస్తున్నారు. చీటీ రాసివ్వడం తప్ప మందులు ఇవ్వలేకపోతున్నారు. దాంతోపాటు తమకు 8 నెలలుగా వేతనాలు రావడం లేదని ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి..
మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపల్‌ పరిధిలోని పోతురాజుపల్లిలో ఉన్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీ భవనానికి 19 నెలలుగా యజమానికి అద్దె ఇవ్వడం లేదు. దాంతో యజమాని డిస్పెన్సరీకి తాళం వేశారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో డాక్టర్‌ భరత్‌ నాలుగు రోజులుగా సిబ్బందితో కలిసి బయటే కూర్చొని రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. మందుల చీటీని రాసి ఇవ్వడం తప్ప మందులు ఇవ్వలేకపోతున్నారు. దాంతో మందులు బయట కొనుక్కోవడానికి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. యజమానికి ఇచ్చే అద్దె గురించి పై అధికారులకు నివేదికలు పంపామని, అక్కడి నుంచి సమాధానం రాలేదని డాక్టర్‌ భరత్‌ తెలిపారు. కాగా పోతురాజుపల్లిలో మినహా ఎక్కడా ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు అందుబాటులో లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డిస్పెన్సరీని తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అలాగే డిస్పెన్సరీలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగాలు చేస్తున్న ఏడుగురు తమకు ఎనిమిది నెలలుగా వేతనాలు కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love