17 నుంచి ఐజీబీసీ గ్రీన్‌ ప్రాపర్టీ షో

– హరిత భవనాలపై అవగాహన పెరగాలి : నేషనల్‌ వైస్‌ ఛైర్మన్‌ సి శేఖర్‌ రెడ్డి వెల్లడి
నవ తెలంగాణ – హైదరాబాద్‌
దేశంలో హరిత భవనాలపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఐజీబీసీ నేషనల్‌ వైస్‌ ఛైర్మన్‌ సి శేఖర్‌ రెడ్డి అన్నారు. వీటితో పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఐజిబిసి హైదరాబాద్‌ చాప్టర్‌ కో ఛైర్మన్‌ జి శ్రీనివాస్‌ మూర్తి, ఐజిబిసి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం ఆనంద్‌, సీనియర్‌ కౌన్సెలర్‌ సందీప్‌ వుల్లికంటతో కలిసి శేఖర్‌ రెడ్డి ప్రాపర్టీ షో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా శేఖర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐజిబిసి గ్రీన్‌ ప్రాపర్టీ షో 2వ ఎడిషన్‌ వివరాలను వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలోని హైటెక్స్‌లో మే 17, 18, 19 తేదిల్లో నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో గ్రీన్‌ బిల్డింగ్‌ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. రాష్ట్రంలో గతేడాది 730 గ్రీన్‌ ప్రాజెక్టులుండగా.. ఈ ఏడాది 860కి చేరాయని తెలిపారు. ఇవి రెండు, మూడు రెట్లు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఐజిబిసిలో దేశ వ్యాప్తంగా 13,380 పైగా ప్రాజెక్టులు రిజిస్టర్‌ అయి ఉన్నాయన్నారు. వీటి వైశాల్యం 1167 కోట్లుగా ఉందన్నారు. ఐజిబిసికి ఇదొక్క పెద్ద మైలురాయి అన్నారు. పర్యావరణహిత నిర్మాణాల్లో ప్రపంచంలోనే భారత్‌ రెండో అతిపెద్ద దేశంగా ఉందన్నారు. ప్రధానంగా నీరు, విద్యుత్‌ ఆదాతో పాటు గాలి, పగటి వెలుతురు పడేలా చూడటంతో పాటుగా నిర్మాణ వ్యర్థాల తగ్గింపు ఐజిబిసి ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హరిత కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందుందన్నారు. పర్యావరణ పరిరక్షణ, వనరుల పరిరక్షణ అనే రాష్ట్ర ప్రభుత్వ విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ప్రజల్లో ఈ విషయంపై అవగాహన కల్పించడం, గ్రీన్‌ బిల్డింగ్‌ పద్ధతులను అనుసరించడాన్ని ప్రోత్సహించడం తమ లక్ష్యమన్నారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రాజెక్టుల పరంగా ఎంతగానో మార్పు చెందిందన్నారు.

Spread the love