మేనకా గాంధీ ఆస్తులు రూ.97.17 కోట్లు

– ఇందులో 3.5 కిలోల బంగారం
– 85 కిలోల వెండి..రూ.40 వేల రైఫిల్‌
– ఐదేండ్లలో 43 శాతం పెరిగిన ఆస్తులు
న్యూఢిల్లీ: ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికైన మేనకా సంజరు గాంధీ గత ఐదేండ్లలో తన ఆస్తులు గణనీయం పెంచుకున్నారు. ఈ పెరుగుదల 43 శాతంగా ఉన్నది. సుల్తాన్‌పూర్‌ స్థానానికి బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్న ఆమె.. నామినేషన్‌ దాఖలు చేసేటప్పుడు ఆమె దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఇది వెల్లడైంది. దీని ప్రకారం.. ఆమె మొత్తం ఆస్తులు ఇప్పుడు రూ.97.17 కోట్లుగా ఉన్నాయి. 2019లో మేనకా గాంధీ ఆస్తి రూ. 55.69 కోట్లుగా ఉన్నది.
ఆస్తి వివరాలు ఇలా
ఆమెకున్న మొత్తం ఆస్తుల్లో రూ.45.97 కోట్లు చరాస్తులు కాగా.. రూ.51.20 కోట్లు స్థిరాస్తులు. ఆమె బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ. 17.83 కోట్లుగా ఉన్నది. 2019లో ఇది రూ. 18.47 కోట్లుగా ఉన్నది. డిబెంచర్లు, షేర్లు, బాండ్ల ద్వారా ఆమె సంపాదన 2019లో రూ. 5.55 కోట్ల నుంచి ప్రస్తుతం రూ. 24.30 కోట్లకు గణనీయంగా పెరిగింది. ఆమె పోస్టాఫీసు పొదుపులు కూడా 2019లో రూ. 43.32 లక్షలతో పోలిస్తే ఇప్పుడు రూ. 81.01 లక్షలతో వృద్ధిని కనబరిచింది. బంగారం, వెండి, ఇతర ఆస్తులు కూడా మేనకాకు భారీగానే ఉన్నాయి. ఆమె రూ. 40,000 విలువైన రైఫిల్‌తో పాటు రూ. 2.82 కోట్ల విలువైన 3.415 కిలోల బంగారం, 85 కిలోల వెండిని కలిగి ఉన్నది. కాగా, నిషాద్‌ పార్టీ అధ్యక్షుడు, యూపీ మంత్రి డాక్టర్‌ సంజరు నిషాద్‌, అప్నా దళ్‌ నాయ కుడు, క్యాబినెట్‌ మంత్రి ఆశిష్‌ పటేల్‌తో కలిసి సుల్తాన్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి మేనకా గాంధీ తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.

Spread the love