సబ్‌ కా వికాస్‌ కాదు..దోస్తోంకా వికాస్‌

– బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు
– ఆ పార్టీని నిలువరించాలి
– ఇదే మోడీ ప్రభుత్వ విధానం
– రాజ్యాంగాన్ని తొలగించే ప్రమాదం
– కార్పొరేట్లకు పన్నులు వేసి ప్రజలకు పంచాలి
– అసమానతలు సామాజిక అశాంతికి దారితీస్తాయి
– మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మోడీ ప్రసంగాలు
– ప్రధాని బీసీ అయితే కులగణన ఎందుకు చేయడం లేదు : నవతెలంగాణతో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
‘సబ్‌ కా వికాస్‌ కాదు… దోస్తోంకా వికాస్‌. ఇదే మోడీ ప్రభుత్వ విధానం. కార్పొరేట్‌ శక్తులు, సంపన్నులపై పన్నులు వేసి సంపదను సామాన్యులకు పంచాలని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులపై పన్నులు వేసి కార్పొరేట్లకు దేశ సంపదను కట్టబెడుతున్నది. 400కుపైగా సీట్లు వస్తాయంటూ బీజేపీ నాయకుల ప్రచారం ఉత్తిదే. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తొలగిస్తుంది. రిజర్వేషన్లు రద్దవుతాయి. ప్రభుత్వరంగం ధ్వంసమవుతుంది. అందుకే బీజేపీని గద్దెదించడమే దేశ ప్రజల కర్తవ్యంగా ఉండాలి. తెలంగాణలోనూ ఆ పార్టీని నిలువరించాలి.’అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆయన నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
‘దేశంలో రెండు దశల్లో పోలింగ్‌ జరిగింది. ఓటింగ్‌ శాతం తగ్గింది. తగ్గిన ఓటింగ్‌ శాతాన్ని గమనిస్తే మోడీ పాలనపై ప్రజలకు ఆసక్తి లేదని స్పష్టమవుతున్నది. బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400కుపైగా సీట్లు వస్తాయని ఎన్నికలకు ముందు చెప్పారు. మొదటిదశ పోలింగ్‌ తర్వాత ఆ ఊకదంపుడు ఉపన్యాసాలు ఆగిపోయాయి. ఆ మాటలను ప్రజలు నమ్మడం లేదు. దీంతో కొత్తరకమైన ప్రచారాన్ని ముందుకు తెస్తున్నారు. మతోన్మాద ఆయుధాన్ని వాడుతున్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు. మతప్రాతిపదికన విడదీసి ఓట్లు పొందాలని చూస్తున్నారు. రెండు దశల్లో పోలింగ్‌ను గమనిస్తే బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలే ఎక్కువ. అందువల్ల రాబోయే ఐదు దశల్లో ప్రజల మధ్య విభజన సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందాలని బీజేపీ చూస్తున్నది. ప్రధాని స్థాయికి తగని పద్ధతిలో మాట్లాడుతూ మోడీ దిగజారుడు ప్రచారానికి ఒడిగడుతున్నారు. ఆయన తీవ్రమైన అభద్రతా భావంలో ఉన్నట్టు కనిపిస్తున్నది.’అని రాఘవులు అన్నారు.
‘ఈ ఎన్నికల్లో వామపక్షాల బలం తప్పకుండా పెరుగుతుంది. కేరళలో సీట్లు పెరుగుతాయి. ఇండియా కూటమి మద్దతుతో తమిళనాడు, బీహార్‌, రాజస్థాన్‌, అస్సాంలలో సీట్లు గెలుస్తాం. బెంగాల్‌లో ఈసారి ప్రాతినిధ్యం వచ్చే అవకాశముంది. సీపీఐ కూడా గతంకన్నా మెరుగవుతుంది. సీపీఐ(ఎంఎల్‌)కు బీహార్‌లో సీట్లు వస్తాయి. ఈ ఎన్నికల్లో వామపక్షాల ప్రాతినిధ్యం పెరగడం ఖాయం. ఇండియా కూటమి మెరుగైన సీట్లు సాధిస్తుంది. అందులో భాగంగా వామపక్షాల సీట్లు కూడా పెరుగుతాయి.’అని రాఘవులు చెప్పారు.
‘మత ప్రాతిపదికన కాకుండా వెనుకబాటుతనం ఆధారంగా అన్ని మతాల్లోని వారికి రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇది న్యాయమైంది, శాస్త్రీయమైంది. దీన్ని బీజేపీ వక్రీకరించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్టు చెప్తున్నది. ఈ పేరుతో రిజర్వేషన్లపై దాడి చేస్తున్నది. మతాల మధ్య విభజన సృష్టిస్తున్నది. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పోతాయన్న భయందోళనను సృష్టించి ఓట్లు పొందాలని చూస్తున్నది. ఇది సంకుచిత స్వభావం తప్ప మరొకటి కాదు. సామాజిక అసమానతలుంటే రిజర్వేషన్లుండాలి. గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ రిజర్వేషన్లను సమీక్షించాలన్నారు. ఇప్పుడు రిజర్వేషన్లకు అనుకూలమని అంటున్నారు. రిజర్వేషన్లకు ఎసరు పెట్టడమే వారి విధానం. సామాజిక న్యాయానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ హాని చేస్తాయి.’అని రాఘవులు విమర్శించారు.
‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లే కాదు ప్రభుత్వ రంగమూ ఉండకూడదంటూ ప్రణాళిక ప్రకటించింది. నాలుగేండ్లలో 250కిపైగా ప్రభుత్వరంగ సంస్థలను మూసేయడం లేదంటే ప్రయివేటుపరం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వరంగం లేకుంటే రిజర్వేషన్లు ఎక్కడుంటాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రభుత్వరంగంలో ఉండడం వల్ల వేలాది మందికి ఉపాధి లభించింది, రిజర్వేషన్ల ఫలాలు దక్కాయి. అది ప్రయివేటుపరం అయితే రిజర్వేషన్లుండవు. దానిపట్ల అప్రమత్తంగా ఉండాలి.’అని రాఘవులు చెప్పారు.
‘రాజ్యాంగం పట్ల, అంబేద్కర్‌ పట్ల గౌరవం ఉన్నట్టు మోడీ చెప్తున్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మారుస్తారనే భయం ప్రజల్లో ఉన్నది. రాజ్యాంగ మార్పు కోసమే మెజార్టీ సీట్లు అడుగుతున్నామని బీజేపీ నాయకులు అంటున్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్ర చూస్తే ఈ రాజ్యాంగం పనికిరాదు, మనుస్మృతే రాజ్యాంగంగా ఉండాలని స్పష్టమవుతుంది. కానీ ఇప్పుడు ఓట్ల కోసం రాజ్యాంగమంటే గౌరవం అంటున్నారు. కానీ ఆచరణలో రాజ్యాంగం జపం చేస్తూనే దాన్ని ధ్వంసం చేస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగిస్తారు. ఇప్పటికే రాజ్యాంగ పీఠికను తొలగించాలని చెప్తున్నారు.’అని రాఘవులు అన్నారు.
‘ఈడీ, ఐటీ, ఎన్‌ఐఏ, సీబీఐ వంటి సంస్థలను బీజేపీ రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నది. ప్రతిపక్షాలను, విమర్శించే వారిని భయపెట్టే సంస్థలుగా మార్చింది. వాటికి లొంగకుంటే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నది. అందులో భాగంగానే కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌, సిసోడియా, కవిత అరెస్టు. వారికంటే ముందు మేధావులు ప్రబీర్‌ పుర్కాయస్థ, నవలఖా, సాయిబాబాను జైల్లో పెట్టారు. అవినీతిని సహించం, అందుకే అరెస్టు చేస్తున్నామని మోడీ అంటున్నారు. ఇది మోసపూరితం. అవినీతి ఆరోపణలున్న వారు బీజేపీలో చేరితే పునీతులవుతున్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అవినీతిపరులున్నట్టు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతిపరులే లేనట్టు ఆ పార్టీ వ్యవహరిస్తున్నది. ఎలక్టోరల్‌ బాండ్లలో అధిక శాతం రూ.ఎనిమిది వేల కోట్లకుపైగా బీజేపీకి వెళ్లాయి. ఈడీ, ఐటీ కేసులు ఎదుర్కొన్న వారు ఎలక్టోరల్‌ బాండ్లు కొనేలా భయపెట్టారు. కాంట్రాక్టులు ఇచ్చిన వారికి బీజేపీకి మధ్య క్విడ్‌ప్రోకో జరిగింది. వారికి కాంట్రాక్టులు, బీజేపీకి ఎలక్టోరల్‌ బాండ్లు వచ్చాయి.’అని రాఘవులు చెప్పారు.
‘ఎన్నికల సమయంలో కేరళ సీఎం విజయన్‌ మీద అవినీతి ఆరోపణలు చేశారు. వామపక్షాలను అప్రతిష్ట పాలు చేశారు. ఫేక్‌ వీడియోల వెనుక ఉన్నారంటూ రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇది దుర్మార్గం. సీఎంను అవమానించడమే. ఎన్నికల సమయంలో లబ్ది పొందడానికి ఇవి బీజేపీ చేస్తున్న విన్యాసాలు.’అని రాఘవులు విమర్శించారు
‘కేరళలో రెండోదశలో ఎన్నికలు జరిగాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలు సాధారణం. పరిధిదాటి రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శల స్థాయికి కాంగ్రెస్‌ నాయకులు దిగజారారు. స్థానిక నాయకులు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. పక్క రాష్ట్రం నుంచి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయాలు మాట్లాడొచ్చు, తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుండేది. కానీ కేరళ సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇంత స్థాయి కలిగిన నాయకుడు ఎవరో రాసి ఇచ్చిన సమాచారాన్ని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడ్డం సరైంది కాదు. అది ఆయన స్థాయికి తగదు. ఆ వ్యాఖ్యలు బీజేపీని ఓడించాలన్న రాజకీయ కర్తవ్యానికి తోడ్పడవు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరాలున్నా రాజకీయంగానే వ్యవహరిస్తాం. అందుకే బీజేపీని ఓడించడం కోసం 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చాం.’అని రాఘవులు అన్నారు.
‘తెలంగాణలో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) బీజేపీని ఓడించాలన్న రాజకీయ విధానాన్ని ప్రచారం చేస్తున్నాయి. కవిత అరెస్టు తర్వాత బీఆర్‌ఎస్‌ కూడా బీజేపీ మీద గత్యంతరం లేని పరిస్థితుల్లో మాట్లాడుతున్నది. ఇండియా కూటమి ఏర్పడినపుడు బీఆర్‌ఎస్‌ను కూడా ఆహ్వానించాం. కేరళలో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), బెంగాల్‌లో తృణమూల్‌, సీపీఐ(ఎం) ప్రత్యర్థులుగా ఉన్నాయి. అయినా ఇండియా కూటమిలోనే ఆ పార్టీలున్నాయి. బీజేపీ వ్యతిరేక పోరాటం అంత చిత్తశుద్ధితో బీఆర్‌ఎస్‌ చేస్తుందా?అనేది ప్రశ్న. అలా కాకుండా పైపైన ప్రచారం చేస్తే బీజేపీకి సహాయపడుతుందనే అపప్రద బీఆర్‌ఎస్‌ మూటగట్టుకోవాల్సి వస్తుంది.’అని రాఘవులు హెచ్చరించారు.
‘భువనగిరిలో సీపీఐ(ఎం) పోటీ చేయడం వల్ల బీజేపీకి లాభం కలుగుతుందన్న వాదన అర్థం లేనిది. ఇండియా కూటమి ఏర్పడినపుడు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంటే కూటమిలోని భాగస్వామ్య పార్టీలను సంప్రదించాలి. తెలంగాణలో కాంగ్రెస్‌ ఆ బాధ్యతను నిర్వహించాలి. సీపీఐ, సీపీఐ(ఎం)ను సంప్రదించలేదు. సుదీర్ఘ పోరాట చరిత్ర ఉన్న పార్టీ పోటీ చేయకుండా ఉండడం సరైంది కాదు. మేం భువనగిరి సీటు ప్రకటించాక కాంగ్రెస్‌ పిలిచి మాట్లాడుతుందని ఆశించాం. నామినేషన్‌ వేశాం. అప్పుడు సంప్రదించారు. నామినేషన్‌ వేశాక ఉపసంహరించుకోవడం రాజకీయ పార్టీకి గౌరవం కాదు. విరమించుకుంటే ఎమ్మెల్సీ లేదా ఇతర పదవులు ఇస్తారంటూ మీడియాలో వచ్చింది. ఆ పదవులే మా లక్ష్యమైతే భువనగిరిలో పోటీ నుంచి తప్పుకునే వాళ్లం. మా లక్ష్యం ప్రజలు. మా పోటీ భువనగిరిలో బీజేపీని ఓడించడానికే పనికొస్తుంది. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా మా ప్రచారం ప్రజల్లో అవసరమైన చైతన్యాన్ని పెంచుతున్నది. మేం పోటీలో లేకుంటే బీజేపీ వ్యతిరేక క్యాంపెయిన్‌కు గొంతు లేకుండా పోతుంది. మా పోటీ బీజేపీ ఓటమికి తోడ్పడుతుంది. నామినేటెడ్‌ పదవి తీసుకోవడం వల్ల మా రాజకీయ ప్రయోజనం నెరవేరదు. బీజేపీని ఎండగట్టే కృషిలో నిమగమయ్యాం.’అని రాఘవులు అన్నారు.
‘రాష్ట్రంలో మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చాం. బీజేపీ వ్యతిరేక క్యాంపెయిన్‌ను చిత్తశుద్ధితో నిర్వహిస్తాం. ఇది కాంగ్రెస్‌ గెలుపు కోసమే కాకుండా బీజేపీకి దూరంగా ప్రజలను ఉంచేందుకు కృషి చేస్తాం. మేం పోటీ చేస్తే ఎలా ప్రచారం నిర్వహిస్తామో కాంగ్రెస్‌ నిల్చున్న చోట కూడా అలా చేస్తాం. తెలంగాణలో బీజేపీని బలహీనం చేయడం మా లక్ష్యం. పోరాట చరిత్ర ఉండి లౌకిక శక్తులు బలంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ బలపడటాన్ని అడ్డుకుంటాం. బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే పనిచేస్తున్నాం. అది సహజంగా కాంగ్రెస్‌కు తోడ్పడుతుంది.’అని రాఘవులు వివరించారు.
‘దేశం ముందున్న ఒకే ఒక కర్తవ్యం బీజేపీ పీడను వదిలించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం, లౌకిక వ్యవస్థను కాపాడుకోవడం, సామాజిక న్యాయాన్ని నిలబెట్టుకోవడం, రాష్ట్రాల హక్కులను కాపాడుకోవడం సులువవుతుంది. దానికి ప్రజలు ముందుకు రావాలి. తెలంగాణ, ఏపీలో ఈ దృష్టితో వామపక్షాలు, కాంగ్రెస్‌ ఉమ్మడిగా ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ ప్రగల్భాలు పలికినట్టుగా 400కుపైగా సీట్లు రావడం సాధ్యం కాదు. ఉత్తరాదిన బీజేపీ పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నది. సీట్లు తగ్గుతాయి. దక్షిణాదిలోనూ సీట్లు పెరగవు. తెలంగాణలో బీజేపీని నిలువరిస్తాం. మళ్లీ గెలుస్తామనే ప్రగల్భాలు ఉత్తమాటలే.’అని రాఘవులు అన్నారు.
‘ప్రతిపక్షాలు అధికారంలో వస్తే ఆస్తులను ముస్లింలకు పంచుతారంటూ ప్రధాని మోడీ ప్రచారం చేస్తున్నారు. ఇంకా దిగజారి మంగళసూత్రాలు మిగలనీయరంటున్నారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్లకు మోడీ కట్టబెడుతున్నారు. సబ్‌కా వికాస్‌ అనేది ఉట్టి మాటలు. సబ్‌ కా వికాస్‌ కాదు…దోస్తాన్‌ కా వికాస్‌. స్నేహితుల వికాసం కోసం మోడీ పనిచేస్తున్నారు. మోడీ అధికారంలోకి వచ్చినపుడు వెయ్యి కోట్ల ఆస్తి ఉన్న వారు 200 మంది ఉండేవారు. ఇప్పుడు రెండు వేలకుపైగా దాటారు. బిలియనీర్లు 59 మంది ఉంటే 229 మందికి పెరిగారు. వారి నుంచి అదనపు పన్ను వసూలు చేయాలి. లూటీ చేసిన సంపద మీద పన్నులు వేసి ప్రజలకు పంచడం న్యాయమైంది. కానీ సంపన్నులను కాపాడే పనిలో మోడీ ఉన్నారు. దాన్ని వక్రీకరించి సామాన్యుల ఆస్తులను కొల్లగొడతారంటూ ప్రధాని ప్రచారం చేస్తున్నారు. ఇది దిగజారుడు తప్ప మరొకటి కాదు. దేశంలో అసమానతలు తీవ్రమైతే సమాజానికి మంచిది కాదు. సామాజిక అశాంతికి దారితీస్తుంది. అసమానతలు తగ్గించకుండా వాటిని పెంచి ప్రజలను అణచివేసే విధానాన్ని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. అసమానతలు తగ్గించడానికి అవసరమైన పన్నుల విధానాన్ని రూపొందించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.’అని రాఘవులు చెప్పారు.
‘దేశంలో కులవ్యవస్థ ఉన్నది. సామాజిక తరగతులకు రాజ్యాంగం రిజర్వేషన్లను కల్పించింది. కులగణన చేయాలని ప్రతిపక్షాలు, సీపీఐ(ఎం) కోరుతున్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం అది చేయడం లేదు. 2021లో జనగణనతోపాటు కులగణన చేయాలని కేంద్రాన్ని ప్రతిపక్షాలు అడిగాయి. కులగణనకు వ్యతిరేకమంటూ సుప్రీంలో కేంద్రం అఫిడవిట్‌ ఇచ్చింది. పార్లమెంటులోనూ చెప్పింది. కులగణన చేయకుండా ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నది. ప్రధాని బీసీ అని బీజేపీ నాయకులు చెప్పే స్థాయికి దిగజారారు. కులగణనను ఎందుకు చేయడం లేదు. ఓట్ల కోసం గందరగోళంగా మాట్లాడి ప్రజలను మభ్యపెడుతున్నారు.’అని రాఘవులు అన్నారు.

Spread the love