ఢిల్లీ సామ్రాట్టులకు లొంగం

– కేసీఆర్‌ జైలుకు పంపిస్తేనే భయపడనోన్ని.. మోడీ కేసులకు భయపడతానా..?
– బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తరు
– రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందనే.. కులగణన చేయకుండా బీజేపీ కుట్ర
– రాష్ట్రంలో ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశాం
– ఆగస్టు 15న రెండు లక్షల రుణమాఫీ
– ఆ రోజే సిద్దిపేటకు స్వాతంత్య్రం
– ఆదిలాబాద్‌, మెదక్‌, మల్కాజిగిరి నియోజకవర్గాల సభల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ- ఆసిఫాబాద్‌/ సిద్దిపేట/ కుత్బుల్లాపూర్‌
”దేశంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తుంది.. నేను మాట్లాడితే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఢిల్లీ పోలీసులతో నాపై కేసు పెట్టించారు.. కేసీఆర్‌ నన్ను జైలుకు పంపించినా భయపడలేదు. మోడీ పెట్టే కేసులకు భయపడతానా..? ఢిల్లీ సుల్తానులను ఎదిరించే శక్తి నాకు ఉంది” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కుమురంభీం ఆసిఫాబాద్‌, మెదక్‌ జిల్లా సిద్దిపేట, కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన జనజాతర సభల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కలిసి దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. పదేండ్లకోసారి దేశంలో జనాభా లెక్కలు తీయడంతోపాటు బలహీన తరగతుల కుల గణన చేపట్టాల్సి ఉందని తెలిపారు. కానీ, రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందనే ఉద్దేశంతో మోడీ కుట్ర చేసి 2021లో జనాభా లెక్కలు చేపట్టకుండా చేశారని విమర్శించారు. దేశంలో బీజేపీకి 400 సీట్లు ఇస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసుకుంటారా..? బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారో మీరే తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. పదేండ్ల పాటు దేశాన్ని పాలించిన బీజేపీ తెలంగాణకు ఎలాంటి లబ్ది చేకూర్చలేదని చెప్పారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్‌, సీసీఐ, ఐటీడీఏల పూర్వ వైభవం కోసం నిధులు ఇవ్వకుండా.. మోడీ, అమిత్‌షా ఈ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. స్థానిక ఎంపీ సోయం బాపురావు మంత్రుల వద్దకు వెళ్లి ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వాలని అడిగినా పట్టించుకోలేదని చెప్పారు. గోండులకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని, ఈ ఎన్నికల్లో సోయంకు టికెట్‌ ఇవ్వకుండా బీజేపీ అవమానించిందని అన్నారు. అమిత్‌షా, కేసీఆర్‌లాగా గోడం నగేష్‌ కూడా ఓ దొరనేనని అన్నారు. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పెంచుతుందని చెప్పారు.
పదేండ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ చేసిందేమీలేదన్నారు. కుమురంభీం ప్రాజెక్టుకు కాల్వల నిర్మాణం చేపట్టలేదని, పోడు భూములు, సాగునీటి సమస్య, వంతెనల నిర్మాణాలను పట్టించుకోకుండా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఇక్కడ 17సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా ఇతర పార్టీలు మహిళలకు టికెట్‌ కేటాయించలేదని.. కాంగ్రెస్‌ తొలిసారి మహిళకు టికెట్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆదిలాబాద్‌ ప్రాంతంపై సుగుణక్కకు పూర్తిగా అవగాహన ఉందని, సమస్యల పట్ల చిత్తశుద్ధి, పోరాడే తెగింపు ఉందని, లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేశామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో 4.50లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల మీద పోటు పొడిచినట్లేనని చెప్పారు. ఆసిఫాబాద్‌ సభలో మంత్రి సీతక్క, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అభ్యర్థి ఆత్రం సుగుణ, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌ పాల్గొన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ రాత్రిపూట ఒక్కటే..
‘ఆగస్టు 15లోగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా. సిద్దిపేట శనీశ్వరరావు హరీశ్‌రావు రాజీనామా చేస్తే సిద్దిపేట ప్రజలకు కూడా స్వాతంత్య్రం వస్తుంది. అదే రోజు రైతులు రుణాల నుంచి విముక్తి పొందుతారు’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు. మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ప్రచారంలో భాగంగా సిద్దిపేట పట్టణంలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం ప్రసంగించారు. గతంలో ఇందిరా గాంధీని మెదక్‌ నుంచి గెలిపిస్తే ఆమె ప్రధానై.. వందలాది ఫ్యాక్టరీలను ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఢిల్లీ దొర మోడీ, దుబ్బాక దొర రఘునందన్‌రావు ఇక్కడి ప్రజలకు ఇచ్చింది గాడిద గుడ్డేనని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పగటిపూట వేర్వేరు పార్టీలు అని.. రాత్రిపూట రెండూ ఒకటేనని ఆరోపించారు. సొంత భూములు గుంజుకొని, ఏటిగడ్డ కిష్టాపూర్‌ రైతులకు బేడీలు వేయించి, వందల ఎకరాలు ఆక్రమించుకున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని డిపాజిట్‌ రాకుండా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆనాడు కాశీం రజ్వీ ఎలాగో.. మామ అల్లుళ్లకు వెంకట్రామిరెడ్డి కూడా అలాంటి వాడేనని విమర్శించారు. మొదటిసారి గడీలను బద్దలు కొట్టే అవకాశం సిద్దిపేట ప్రజలకు వచ్చిందన్నారు. 45 ఏండ్లు మామా అల్లుళ్ళు సిద్దిపేటకు శనిలా దాపురించారన్నారు. కరీంనగర్‌ నుంచి వచ్చిన వెంకట్రామిరెడ్డికి ఇక్కడ అవకాశం ఎందుకు ఇచ్చారని, పోటీలో ఉండటానికి సిద్దిపేట ప్రాంతంలో ఒక్కరూ లేరా అని ప్రశ్నించారు. నీలం మధును లక్ష మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. మధు గెలిస్తే ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని, బీసీ-డీ నుంచి ఏలో చేరుస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు మంత్రి కొండా సురేఖ, టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరామ్‌, పూజల హరికృష్ణ, నీలం మధు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్‌, నాయకులు నర్సారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, ఎలక్షన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, సురేష్‌, అద్దంకి దయాకర్‌, మదన్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love