కేసీఆర్‌కేనా నోటీసులు మోడీకి ఎందుకివ్వరు..?

why-not-give-kcr-notices-to-modi– రేవంత్‌రెడ్డి బూతులేమో ప్రవచనాలు, సుభాషితాలా?
– ఈసీ ఇలాగే ఉంటే సజావుగా, స్వేచ్ఛగా ఎన్నికలు కష్టమే…
– అది ఎలక్షన్‌ కమిషన్‌ కాదు..బీజేపీ కమిషన్‌
– న్యాయవ్యవస్థపై మాకు నమ్మకముంది…బడా భారుకు, చోటా భారుకు ఓటుతో బుద్ధి చెప్పాలి : కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైతులు, నేత కార్మికుల దీన స్థితి గురించి తెలుసుకుని ఆవేదనతో కొంత పరుషంగా మాట్లాడిన కేసీఆర్‌కు నోటీసులిచ్చిన ఎన్నికల కమిషన్‌….మత వైషమ్యాలు రెచ్చగొడుతూ, పదే పదే ఎన్నికల ప్రవర్తనా నియామవాళిని ఉల్లంఘిస్తున్న ప్రధాని మోడీకి నోటీసులెందకు ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఎనిమిది ఫిర్యాదులతో కలుపుకుని కాంగ్రెస్‌పై మొత్తం 27 ఫిర్యాదులను బీఆర్‌ఎస్‌ చేసినా చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కనుసన్నల్లో ఎన్నికల సంఘం పని చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ఎలక్షన్‌ కమిషన్‌ కాస్తా… బీజేపీ కమిషన్‌గా మారిపోయిన నేపథ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా ఎలా జరుగుతాయని అనుమానం వ్యక్తం చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ నిజంగా స్వయం ప్రతిపత్తి గల సంస్థే అయితే, మత వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న బీజేపీ నాయకులు, పదే పదే బూతు పురాణం ఎత్తుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకముందనీ, సత్యమే జయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అరాచకంగా మాట్లాడిన బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులను వదిలేసీ, రైతులు, నేతన్నల బాధలు చూసి ఆవేదనతో మాట్లాడిన కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటల నిషేధం విధించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుకున్నట్టు నియామకాలు జరపుకోవడంతో ఎన్నికల కమిషన్‌ కాస్తా బీజేపీ కమిషన్‌గా వ్యవహరిస్తున్నదని కేటీఆర్‌ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంతో పాటు కేంద్ర హౌంశాఖ మంత్రి, బీజేపీకి చెందిన పలువురు నేతలు, అభ్యర్థులు పదే పదే మతాన్ని ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఆ పార్టీ సోషల్‌ మీడియాలో ముస్లీంలపై విషం చిమ్ముతున్నా ఒక్క చర్యా లేదని గుర్తుచేశారు. ఏప్రిల్‌ 10న తుక్కుగూడ సభతో పాటు అనేక సందర్భాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడిన మాటలు ఎలక్షన్‌ కమిషన్‌కు ప్రవచనాలు, సుభాషితాలు, నీతి సూక్తులుగా వినిపించాయా? అని ఎద్దేవా చేశారు. పండబెట్టి తొక్కుతం…లాగులూడదీసీ తొండలొదులుతం, కేసీఆర్‌ తల నరకండి, తల తెగ్గోయండి వంటి అనేక మాటలను రేవంత్‌ రెడ్డి మాట్లాడారంటూ స్క్రీన్‌పై ప్రదర్శించి చూపించారు.
కేసీఆర్‌ బస్సు యాత్రకు వస్తున్న అనూహ్య ప్రజా స్పందన, పలు సర్వేల్లో బీఆర్‌ఎస్‌కు 10 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తాయనే రిపోర్టులు, నిఘా సంస్థలు కూడా బీఆర్‌ఎస్‌కు వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పడంతోనే కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాల్లో వ్యక్తిగత హననం చేస్తున్నా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా పోస్టులు పెడుతున్నా ఈసీకి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అది ఫేక్‌ సర్టిఫికెట్‌…
సీఎం రేవంత్‌ను అరెస్టు చేయాలి
ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి గతేడాది బీఆర్‌ఎస్‌ విడుదల చేసిన సర్క్యులర్‌ అంటూ ఒక దాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్టర్‌ హ్యాండిల్‌లో ప్రచారం చేశారని కేటీఆర్‌ తెలిపారు. అది ఫేక్‌దని విమర్శించారు. ఇలాంటి నకిలీ సర్క్యులర్‌ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదే విషయంపై ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. రేవంత్‌ రెడ్డి సీఎం హౌదాలో ఉండి ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భయపడం…
ఓయూ సర్క్యులర్‌కు సంబంధించి ఫోర్టరీ కేసులో రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయకపోగా, అది ఫోర్జరీదని చెప్పినందుకు బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా నాయకులు మన్నె క్రిశాంక్‌ను అరెస్టు చేశారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు ఉద్యమ కాలంలో 14 ఏండ్ల పాటు అక్రమ కేసులను ఎదుర్కొన్న చరిత్ర ఉందని ఆయన గుర్తుచేశారు. అందువల్ల కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఒక వైపు రాహుల్‌ గాంధీ నఫ్రత్‌ కీ బాజార్‌ మే… మొహబ్బత్‌ కీ దుకాన్‌ (ద్వేషం నిండిన మార్కెట్లో ప్రేమ దుకాణం) అంటూ మాట్లాడుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అక్రమ కేసులను బనాయిస్తున్నదని విమర్శించారు. ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఫోర్జరీ, ప్రజలను తప్పుదోవ పట్టించడం అనేవి తీవ్రమైన నేరాలని కేటీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నారనీ, నిజంగా ఈసీ స్వయం ప్రతిపత్తి గల సంస్థే అయితే ఫోర్జరీపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఒక్కటేననీ, ఆ రెండు పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
కేసీఆర్‌ గొంతు నొక్కారు..
”మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ ఆగమేఘాల మీద నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందిన తర్వాత మా లాయర్లు, నాయకుల స్పందించి లీగల్‌ సెల్‌ ద్వారా జవాబు ఇచ్చారు. ఈ మద్యకాలంలో ఎండిన పంటల పరిశీలనకు కరీంనగర్‌లో పర్యటించిన సందర్భంగా సిరిసిల్లలో మీడియా సమావేశం నిర్వహించారు కేసీఆర్‌. ఎండిన పంటలు చూసి, రైతుల ఆర్తనాదాలు విన్న తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి లేదు.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు.. నీళ్లు ఉండి ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అంటూ కొంత పరుషంగా మాట్లాడారు. బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇవ్వండి.. మా బతుకులను కాపాడండి, మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని మొర పెట్టుకున్నారు. వారి ఆవేదన, బాధ చూసిన తర్వాత భావోద్వేగంతో కేసీఆర్‌ ఒక మాట అన్నారు. ఆ ఒక్క మాట మాట్లాడేసరికి కేసీఆర్‌ గొంతు నొక్కారు. 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం విధించారు…
” అని కేటీఆర్‌ వాపోయారు.

Spread the love