బాధ్యులెవరు..?

– భద్రతావైఫల్యంపై చర్చించాలన్నందుకే 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై వేటు
– లోక్‌సభలో 13 మంది, రాజ్యసభలో ఒకరు
– హౌంమంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలని కోరటం నేరమా..?
– ప్రతిపక్షాల ఆగ్రహం.. ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌లో జరిగిన పొగబాంబుల దాడి ఘటనపై కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలని డిమాండ్‌ చేసినందుకు14 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. లోక్‌సభలో 13మంది, రాజ్యసభలో ఒకరు సస్పెన్షన్‌కు గురయ్యారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ ఈ వేటు వర్తిస్తుంది. లోక్‌సభలో బుధవారం చోటుచేసుకున్న ఘటనపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు గురువారం ఆందోళన చేపట్టాయి. భద్రతా వైఫల్యంపై చర్చ చేపట్టాలని, కేంద్ర హౌం మంత్రి సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. వారి ఆందోళనల మధ్యే కొంతసేపు సభ సాగింది. అయితే, ప్రతిపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు హౌరెత్తించారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. అంతకు ముందు లోక్‌సభలో రక్షణమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ మాట్లా డుతూ.. ”ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. దీనిపై స్పీకర్‌ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. పాస్‌లు ఇచ్చే విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం” అని వెల్లడించారు.
తొలుత 14 మంది..తేరుకుని 13 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. పార్లమెంట్‌లో జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలనే డిమాండ్‌ హౌరెత్తింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే లోక్‌సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ విధిస్తూ పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని మూజువాణి ఓటుతో ఆమోదించి, వారిపై వేటు వేశారు. సస్పెండ్‌ అయిన వారిలో కాంగ్రెస్‌ ఎంపీలు టిఎన్‌ ప్రతాపన్‌, హిబీ ఈడెన్‌, ఎస్‌ జ్యోతిమణి, రమ్య హరిదాస్‌, డిన్‌ కురియకోస్‌ ఉన్నారు. సభా నియమాలను ఉల్లంఘించినందుకు, సభా కార్యకలాపాలకు అడ్డుపడినందుకు ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. అప్పుడు మరో తొమ్మిది మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేశారు. వీరిలో కాంగ్రెస్‌ ఎంపీలు బెన్నీ బెహనన్‌, వికె శ్రీకందన్‌, మహ్మద్‌ జావేద్‌, మాణికం ఠాగూర్‌, సీపీఐ(ఎం) ఎంపీలు పిఆర్‌ నటరాజన్‌, ఎస్‌. వెంకటేశన్‌, డీఎంకే ఎంపీలు కనిమొళి కరుణానిధి, ఎస్‌ఆర్‌ పార్థిబన్‌, సీపీఐ ఎంపీ కె. సుబ్బరాయన్‌లు ఉన్నారు. ఆ తరువాత సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే నేటికీ (శుక్రవారం) వాయిదా వేశారు.
నేను లేకపోయినా.. సస్పెండ్‌ చేశారు: డీఎంకే ఎంపీ ఎస్‌ఆర్‌ పార్థిబన్‌
డీఎంకే ఎంపీ ఎస్‌ఆర్‌ పార్థిబన్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌ జాబితాలో తన పేరు నమోదు కావడం ”జోక్‌” అని అన్నారు. ”నేను అనారోగ్యంతో ఉన్నందున సభలో లేను” అని అన్నారు. సభలో లేని సభ్యుడ్ని చేర్చారన్న విమర్శలు రావటంతో..డీఎంకే ఎంపీ పార్థిబన్‌ పేరును తొలగిస్తున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు.
రాజ్యసభలోనూ…
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భద్రతా వైఫల్యంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో చైర్మెన్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో కూడా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగింది. దీనిపై చర్చ జరగాలని టీఎంసీ పక్షనేత డెరిక్‌ ఒబ్రెయిన్‌ డిమాండ్‌ చేశారు. వెల్‌ లోకి దూసుకెళ్లి నినాదాలు ఇచ్చారు. దానిపై రాజ్యసభ చైర్మెన్‌ జగదీప్‌ ధన్కర్‌ ఆగ్రహానికి గురయ్యారు. ‘డెరెక్‌ వెంటనే సభ నుంచి బయటకు వెళ్లిపోవాలి. సభ నిబంధనలను గౌరవించనని ఆయన చెప్పారు. ఇది తీవ్రమైన ఉల్లంఘన. ఇది సిగ్గుచేటు’ అని ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ చైర్మెన్‌ ప్రకటించారు. ఈ సెషన్‌ మొత్తం ఆయనపై వేటు కొనసాగనున్నట్టు తెలిపారు. రూల్‌ 256 (2) ప్రకారం కౌన్సిల్‌ సర్వీస్‌ నుంచి సస్పెండ్‌ చేసిన డెరెక్‌ ఓబ్రెయిన్‌ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించాలని, ఆయన ”క్రమశిక్షణా రాహిత్యాన్ని” హౌస్‌ ప్రివిలేజెస్‌ కమిటీకి సూచించాలని, మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని కేంద్ర మంత్రి, రాజ్యసభా నేత పీయూశ్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించింది. ఈ ప్రకటనను ప్రతిపక్షాలు వ్యతిరేకిం చాయి. దీని తరువాత కూడా ఎంపీ ఇతర సభ్యులతో కలిసి సభలో తన ఆందోళన కొనసాగించారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా రాజ్యసభకు వచ్చి, పొగబాంబుదాడి ఘటనపై సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సభను మధ్యాహ్నం 2:30 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఈ ఆందోళనల మధ్య మరో రెండు సార్లు సభ వాయిదాపడింది. ఆ తరువాత కూడా సద్దుమణగకపోగా ప్రతిపక్షాల ఎడతెగని నిరసనలతో నేటి (శుక్రవారం)కి వాయిదా పడింది.
ప్రజాస్వామ్య హత్య
ప్రతిపక్ష ఎంపీలపై వేటు వేయటం ”ప్రజాస్వామ్య హత్య”. ”భద్రత కోసం హౌస్‌ కమిటీని ఎందుకని పునర్నిర్మించలేదు. జాయింట్‌ సెక్రెటరీ, సెక్యూరిటీ హెడ్‌లను నియమించలేదు. చొరబాటుకు స్పాన్సర్‌ చేసిన బీజేపీ ఎంపీని ఎందుకు ప్రశ్నించలేదు. ప్రధాని, కేంద్ర హౌం మంత్రి జవాబుదారీతనం కోసం డిమాండ్‌ చేసిన ఆ 14 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్‌ చేస్తారా…! ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్య హత్యే”.
– సీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

అప్రజాస్వామిక చర్య
” ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయటం ”అప్రజాస్వామిక చర్య”. బీజేపీ ప్రభుత్వం పార్లమెంటును ”రబ్బర్‌ స్టాంప్‌”గా కుదించేసింది. లోక్‌సభ భద్రతా ఉల్లంఘన అంశంపై చర్చకు డిమాండ్‌ చేస్తే 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై వేటు వేయటం సరైంది కాదు…. అక్రమార్కుల ప్రవేశానికి సహకరించిన బీజేపీ ఎంపీపై ఎందుకని చర్యలు తీసుకోవడం లేదు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.”
– కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌

Spread the love