సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకునేందుకే..

Supreme Court and Pinarayi Vijayan– రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర జోక్యాన్ని సవాలుచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించటంపై కేరళ సీఎం
తిరువనంతపురం: కేంద్రంపై సుప్రీంకోర్టులో పోరాటాన్ని ‘చారిత్రాత్మక యుద్ధం’గా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అభివర్ణించారు. సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకునేందుకే ఈ చర్య తీసుకున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొట్టాయం జిల్లాలో గురువారం జరిగిన నవకేరళ సదస్సులో పాల్గొన్న విజయన్‌ మీడియాతో మాట్లాడారు. కేరళను ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టేందుకే కేంద్రం ‘వివక్షపూరితమైన, ప్రతీకార చర్యలు’ చేపడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పునరుద్ధరించాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా జోక్యం చేసుకుంటోందని పిటిషన్‌లో పేర్కొన్నామని అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ చర్యలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ ప్రక్రియపై నియంత్రణ తీసుకుందని, రాష్ట్రానికి రుణాలు తీసుకునే సొంత ఆర్థిక వ్యవస్థలను నియంత్రించే అధికారంలో జోక్యం చేసుకుంటోందని అన్నారు. కేంద్రం చర్యల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని తగ్గించడానికి కేరళకు తక్షణమే రూ.26,226 కోట్లు కావాల్సి వుందని అన్నారు. సంక్షోభాన్ని అధిగమించేందుకు ఇది సరిపోదని, కేంద్రం తీసుకున్న చర్యల వల్ల వచ్చే ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్ల నుండి రూ. 3 లక్షల కోట్ల రవకు నష్టం వాటిల్లుతుందని అంచనా. ఇది ఐదేళ్ల కాలంలో రాష్ట్ర జిడిపిలో 20 శాతం నుండి 30 శాతం వరకు ఉంటుంది. దీని నుండి బయటపడకపోతే.. పరిమిత వనరులతో అభివద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని దశాబ్దాల తర్వాత కూడా కోలుకోలేని సంక్షోభంలోకి నెట్టివేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాత్మక యుద్ధంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలు, కేరళ సొసైటీ మద్దతుగా నిలవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి కోతలు ఉండవని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

Spread the love