పోలీసు రిక్రూట్‌మెంట్‌ను పారదర్శకంగా పూర్తి చేయండి

– డీఎస్పీ నళినికి ఉద్యోగమివ్వండి
– ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం ఆదేశం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో పోలీసు రిక్రూట్‌మెంట్‌ను ఎలాంటి ఆరోపణలకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో ముఖ్యమంత్రి పోలీసు, వైద్య శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ఆ శాఖల్లో నియామకాలకు సంబంధించి సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు డీజీపీ రవిగుప్తా, వైద్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఎ.ఎం.రిజ్వి, ఆరోగ్య శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్‌, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మెన్‌ వి.వి శ్రీనివాస్‌రావు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌లో ఏవైనా అవరోధాలు ఏర్పడితే దానిపై తనకు నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా ఆయన కోరారు. గత 9 ఏండ్లలో రాష్ట్రంలో జరిగిన పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి నివేదికను కూడా తనకు సమర్పించాలని ఆయన ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖలో సైతం అవసరమైన నియామకాలను చేపట్టాలని ఆయన ఆ శాఖాధికారులను ఆదేశించారు.
నళిని ఉద్యోగంలోకి ఎందుకు తీసుకోరాదు? : అధికారులతో సీఎం ఆరా
తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం సమయంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి సంబంధించి ఆయన అధికారులతో ఆరా తీశారు. ఆమెను తిరిగి ఉద్యోగంలోకి ఎందుకు తీసుకోరాదని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో అనేక మంది అధికారులు రాజీనామా చేసి తర్వాత ఉద్యోగాల్లో చేరారని రేవంత్‌ అన్నారు. అదే సమయంలో నళినిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలనీ, ఒకవేళ పోలీసు ఉద్యోగంలో చేర్చుకోవటానికి ఏవైనా అడ్డంకులు ఏర్పడితే ఇతర ప్రభుత్వ ఉద్యోగంలో అదే హౌదాలో చేర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో ఆమె అభిప్రాయం కూడా తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. కాగా, పోలీసు, ఆర్టీసీ ఉద్యోగస్తుల పిల్లల కోసం కోరుకొండ సైనిక పాఠశాల స్థాయిలో రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఉత్తర, దక్షిణ తెలంగాణలో తెరవటానికి ప్రణాళికలను రూపొందించాలని ఆయన అధికారులను కోరారు.

Spread the love