నవతెలంగాణ – అశ్వారావుపేట
అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) ప్రథమ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల గ్రామంలో కంగాల కల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు పాల్గొన్నారు.
రైతన్నల సమస్యలపై ప్రభుత్వాల వైఖరిని వారు తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పాలకులు విఫలమవుతున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా, 57 ఏళ్లకే పింఛను, సాగునీరు, వ్యవసాయ పనిముట్ల సరఫరా వంటి అంశాల్లో నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మే 11, 12, 13 తేదీలలో ఇల్లందు పట్టణంలో జరగనున్న ఈ జాతీయ మహాసభలకు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. మే 11న ఫారెస్ట్ గ్రౌండ్ నుండి భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రదర్శనలో వాలంటీర్లు, కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యకర్తలు, రైతులు స్వచ్ఛందంగా పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు గొంది లక్ష్మణరావు, కంగాల భూలక్ష్మి, కంగాల వంశీ కుమార్, కంగాల కన్నయ్య, మేణ్నీ పాండురాజు, ఈధర మోహన్‌రావు, తెల్లం సత్యం, మడివి నాగేశ్వరావు, కంగాల వెంకటేష్, మడకం ముత్యాలరావు, కంగాల సైదమ్మ, మామిళ్లపల్లి చందారావు, కుంజా వెంకటేష్, మడివి గంగారాజు, కుంజా భీమయ్య, రవ్వ సాంబయ్య, మడివి ముత్యాలు, తుమ్మూరి కరుణ, పూసం మంగరాజు, మడకం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.




