
ఈనెల 10న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో “గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు – సవాళ్లు ” అనే అంశంపై నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సులో ఉపాధి హామీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కూకుట్ల చొక్కాకుమారి పిలుపునిచ్చారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డి గూడెం గ్రామంలో ఉపాధి హామీ కార్మికుల పని ప్రదేశాన్ని సందర్శించి కార్మికుల సమస్యలను తెలుసుకున్న అనంతరం కార్మికులతో కలిసి సదస్సు ను జయప్రదం చేయాలని కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చొక్కాకుమారి మాట్లాడుతూ.. కొలతలు లేని పనికి కొలతలు పెట్టి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం కోతలను రద్దు చేసి రోజుకు ఆరు గంటల పనికి 600 రూపాయల కూలీ ఇవ్వాలని డిమాండ్ చేసినారు. సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని గతంలో అమలు చేసిన విధంగా పని ప్రదేశంలో మౌలిక వసతలు కల్పించాలని కోరారు.
బిజెపి ప్రభుత్వ పది సంవత్సరాల పాలనలో ఉపాధి హామీ పథకంలో అనేక జీవోలు తీసుకొచ్చి చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రలు చేస్తున్నదని బిజెపి పాలనలో కార్మికుల సమస్యలు రెట్టింపు అయ్యాయని ఆవేదన వెలిబుచ్చారు. ఉపాధి హామీ చట్ట చట్ట పరిరక్షణ కోసం, మున్సిపల్ పట్టణాల్లో కూడా ఉపాధిహామీని అమలు చేయాలని, కనీస కూలీ 600 లు, సంవత్సరానికి 200 పని దినాలు, చట్టంలో ఉన్న అన్ని అంశాలను అమలు చేయాలని కోరుతూ ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సు ముఖ్య అతిధులుగా గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు శ్రీమతి సీతక్క, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రాజ్యసభ సభ్యులు శివ దాసన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి. నాగయ్య, ఆర్. వెంకట్రాములు పాల్గొంటున్నారని వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో డి కళమ్మ, ఎం సుజాత, ఎం పోచమ్మ , ఎం రాములమ్మ , డి ధనలక్ష్మి , ఎ సత్తమ్మ , ఎం స్వరూప, కే మంగమ్మ, ఎన్ పద్మ, ఎన్ సుజాత, బి రేణుక, ఆర్. చంద్రకళ, ఆర్ కలమ్మ, ఏ పద్మ లు పాల్గొన్నారు.