నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లోనే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అన్నారు. ఇప్పటికే ప్రచారం కోసం అన్ని హెలికాప్టర్లను బీజేపీ ముందస్తుగా బుక్ చేసుకుందని ఆరోపించారు. బీజేపీ మూడోసారి కూడా అధికారంలోకి వస్తే.. దేశంలో నిరంకుశ పాలనే ఉంటుందని మమత అన్నారు. మరో పార్టీకి అవకాశం ఇవ్వొద్దనేది బీజేపీ ఆలోచన అని, అందుకే ముందస్తుకు వెళ్లాలని భావిస్తోందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం పాలనకు ముగింపు పలికామని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని తప్పకుండా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఇప్పటికే అన్ని వర్గాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తోందని, మరోసారి అధికారం చేపడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని చెప్పారు. మరోవైపు గవర్నర్ తీరుపై మండిపడ్డ మమత.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో సవాలుకు దిగొద్దంటూ హెచ్చరించారు.