మనిషి – పులి

జనవరి మొదటి వారంలో కొమురంభీమ్‌ అసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం దారిగాం అటవీ ప్రాంతంలో రెండు పెద్దపులులు మరణించాయి. పులుల మరణవార్త తెలిసింది మొదలు ఈ రోజుకీ స్ధానిక ఆదివాసులపై అటవీ శాఖ వాళ్లు విచక్షణా రహితంగా కేసులు బనాయిస్తూ, జైళ్లకు పంపుతు న్నారు. ఈ కేసుల వలలో చిక్కుకున్న వారంతా అంతరించి పోగల కొలాం జాతికి చెందిన పేద ఆదివాసులు.
పులుల మరణానికి కొద్దిరోజుల ముందు ఆసిఫాబాద్‌ జిల్లా వాంఖిడి మండలంలోని రింగారిట్‌ గ్రామానికి చెందిన ఒక ఆవుమందతో పాటు దరిగాం అడవిలోకి మేతకు వెళ్లి, ఇంటికి తిరిగి రాలేదు. అనంతరం, జనవరి ఆరున ఒక పులి పిల్ల అడ విలో చచ్చిపడి ఉన్న విషయం అటవీ శాఖ అధికారులకు తెలి సింది. దానిపై బలమైన గాయలున్నాయని, ఒక ఎముక కూడా విరిగి ఉందని, రక్తస్రావమైన ఆనవాల్లున్నాయని, అందువల్ల అది మరో పెద్దపులితో జరిగిన ఘర్షణలో చనిపోయి ఉంటుం దని వారు ప్రకటించారు. ఎనిమిదో తేదీ మరో పెద్దపులి శవం దొరికింది. ఆవు కళేబరం కూడా వారికి కనిపించింది. దీంతో ఆవు, పులుల మరణానికి సంబంధం ఉంటుందని అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో శాస్త్రీయత, వాస్తవికత ఏ మేరకు ఉన్నాయోగానీ, ఆవు సొంతదారు అయిన ఆదివాసీ రైతు కోవ జంగునూ, మరి కొంతమంది ఆదివాసులపై జనవరి 12న కేసులు మోపి, ఇద్దరిని జైలుకు పంపించారు. విచారణలో ఫారెస్ట్‌ పొలీసులు నిందితులను విపరీతంగా చిత్రహింసలు పెట్టారని వారి బంధువులు రోదించారు. ఇంకా అనేక మందిపై కేసులు నమోదవుతున్నాయి.
ఆసిఫాబాద్‌ అడవిలో జరిగిన ఈ పరిణామం చిన్న పిల్లలు చదువుకునే ఆవు-పులి కథ లాంటిది కాదు. ఈ యధార్థ కథలో ఆవు చనిపోయింది. పులీ చనిపోయింది. ఆవు నిజాయితీ గల దో, లేదో ఎవరూ పట్టించుకోలేదు. ఆవుపోతే పోయింది, పులి చనిపోకూడదు కదా! అదీ మనమూ, పాలకులూ పాటించే విలువ. కాబట్టి, పులులు చనిపోవటం చాలా పెద్ద విషయ మైంది. ఈ అడవిలో పులులు పశువులపైననే కాదు, మనుషులపైనా దాడిచేశాయి. గతేడాది, ఇప్పుడు పులులు చనిపోయిన అడవికి సమీపంలో, చేలో పనిచేసుకుంటున్న వాంఖిడి మండలానికి చెందిన సిడాం భీంరావ్‌ అనే ఆదివాసీ రైతును పులినోట కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. పరిసరాల్లో ఉన్న రైతులు కేకలు వేస్తూ, కర్రలు పట్టు కొని పరుగెత్తేసరికి అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. గ్రామస్తులు భీంరావు దగ్గరికి చేరుకునేసరికే అతను చనిపోయాడు. ఈ జనవరిలోనే మనకు పొరుగున ఉన్న గడ్చిరోలి జిల్లాలో దాదాపు వారం రోజుల వ్యవ ధిలో పత్తి చేలో పనిచేసుకుంటున్న ఇద్దరు మహిళా రైతులను పులి చంపి తినేసింది.
నగర, మైదాన ప్రాంతాల మనుషులకు పులి ఒక వినోద జంతువు. కానీ పులి సంచరించే అటవీ ప్రాంత ప్రజలకది దిన దిన గండం. వారి జీవనోపాధిని దెబ్బతీసే సమస్య. వారి ప్రాణా లకు ముప్పు. దేశంలో ఎలాగైనా పులులను సంరక్షించాలనే పాలకుల విధానాలు ఆదివాసీల, ఇతర పేద ప్రజల జీవించే హక్కుకు తీవ్ర భంగకరంగా మారుతున్నాయి.గత ఇరవై ఏండ్లుగా ప్రభుత్వాల పట్టుదలతో కూడిన పులుల సంరక్షణా చర్యల ఫలితంగా 2006లో 1411 మాత్రమే ఉన్న వాటి సంఖ్య వేగంగా పెరిగి 2022 జూలై నాటికి 3682కి చేరింది. ఇప్పుడు ప్రపంచంలోని డెబ్బై శాతం పులులు భారత్‌లోనే ఉన్నా యి. మధ్య భారతం, కర్నాటకలో పులుల సంఖ్య పెరిగే కొద్దీ అవి క్రమంగా, తమవైన కొత్త ప్రదేశాలను వెతుక్కుంటూ పరి సర అడవుల్లోకి విస్తరిస్తున్నాయి. అలా మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుండి కొంత కాలంగా ఆసిఫాబాద్‌ అడవులకు పెద్ద సంఖ్యలో పులులు చేరుతున్నాయి.
పులి సాధారణంగా ఒంటరిగా జీవిస్తుంది. పులులను సహ జసిద్ధంగా సంరక్షించాలంటే ఒక్కొక్క పులికి అరవై నుండి వంద చదరపు కిలోమీటర్ల దట్టమైన, సహజ వాతావరణం ఉన్న అడ వి కావాలి. పాలకుల అటవీ విధ్వంసపు అభివృద్ధి విధానాలూ, మైదాన ప్రాంత మనుషుల కలప దాహంవల్లా అడవి విస్తీర్ణం, నాణ్యతా బాగా తగ్గిపోయి పులికి సహజ ఆహరం దొరికే పరిస్థితి గతంలో ఉన్నట్లు ఈ రోజు లేదు. పులులకు అడవి అనబడే ప్రదేశంలో ఆహారం దొరకనప్పుడూ, వాటి వేటాడే సామర్థ్యం తగ్గినప్పుడూ అడవి అంచున ఉన్న గ్రామాలపై పడి రైతుల పశువులనూ, తరచుగా మనుషు లనూ చంపి తింటాయి. గతేడాదిలో తెలంగాణా రాష్ట్రంలో మూడు వందల ఆవులు లేదా ఎద్దు లను పులులు చంపి తిన్నాయి. నెల క్రితం పార్ల మెంటులో కేంద్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారమే గత ఐదేండ్లలో దేశంలో 302 మంది పులుల బారిన పడి చనిపోయారు. 2018లో 18 మంది చనిపోతే ఆ సంఖ్య 2022 నాటికి 112కు చేరింది. పులుల సంఖ్యకూ వాటి భారిన పడి చనిపోయే మనుషులకూ స్పష్టమైన సంబంధం గతంలోనూ ఉంది. వందేండ్ల కిందట దేశంలో నలభై వేల పులులు ఉన్నప్పుడు 1876 నుండి 1912 సంవత్సరాల మధ్యన బ్రిటిష్‌ ఇండియాలో పులుల భారిన పడి అక్షరాల 33వేల 247 మంది చనిపోయారట. కాబట్టి పులుల సంఖ్య ఎంత పెరిగితే మనుషుల ప్రాణాలకు, ముఖ్యంగా అటవీ పరిసర గ్రామాల ప్రజలకు, అంత ముప్పు అనేది పాలకులూ, మైదాన ప్రాంత మనుషులూ తక్షణం గ్రహించాలి. కొత్తగా, పులుల ఆకలిని తీర్చటానికని హైదరాబాద్‌, కరీంనగర్‌ లలోని మూడు డీర్‌ పార్కుల నుండి 550 జింకలను ఉమ్మడి మహ బూబ్‌నగర్‌ జిల్లాలోని ఆమ్రాబాద్‌, కవ్వాల్‌ అభయారణ్యాల్లోని పులులకు ఆహారంగా వదిలివేస్తున్నారట. పాపం జూలలో ఇంత కాలం మనకు సంతోషాన్ని పంచిన, తప్పించుకోవటం కూడా మర్చిపోయిన వందలాది జింకల బలిని మాత్రం మనం ఎం దుకు అంగీకరించాలి. పులుల జనాభా అనియంత్రంగా పెంచు కుంటూపోతే వాటికి ఆహారంగా ఏడాదికి ఎన్ని పశువులూ, ఎన్ని పెంపకపు జింకలూ, ఎంతమంది మనుషులూ బలికావాలి?
నిజానికి, మనుషులు పులులకు ఆహారం అవటం అనేది కూడా పాలకులను బాధించటం లేదు. మానవ సంచారం ఉంటే పులుల స్వేచ్ఛకు అడ్డం అవుతుందని భారత ప్రభుత్వాలు 2008 నుండే వివిధ పులి అభయారణ్యాల నుండి 250 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించి, అందులో నివసించే 2 లక్షల మంది ఆదివాసీ ప్రజలను అభయారణ్యాల వెలుపలికి తరలించాలని లక్ష్యంగా చేసుకుని, ఆ పనిని నిరాఘాటంగా చేస్తున్నాయి. అలా 2010లో కర్నాటకలోని నాగర్‌ హౌళే అభ యారణ్యం నుండి కుర్భా జాతి ఆదివాసీ తెగ ప్రజలు నివసించే అనేక గ్రామాలను ఖాళీ చేయించి, బయటకు పంపారు. మైదాన ప్రాంతంలో దినసరి కూలీలుగా మారిన ఆదివాసీలు అక్కడ బతకలేక, ఇక్కడే ఉంటే తాము అంతరించటం ఖాయమని, తిరిగి తాము పూర్వం జీవించిన గ్రామాలకే వెళతామని, నాగర్‌ హౌళే అభయారణ్యం గేట్ల వద్ద నెలల తరబడి ఆందోళన చేస్తున్నారు. పులులతో బతికినా, చనిపోయినా పరవాలేదుకానీ, మాకు స్వేచ్ఛ లేని ఈ పరాయి ప్రాంతంలో మేము ఎందుకు బాధలు పడాలనేది వారి వాదన. ఇంకా ఖాళీ చేయని నాగర్‌ హౌళే ఆదివాసీ గ్రామాల ప్రజలు అటవీ శాఖ నుండి అక్రమ కేసులనూ, వేధింపులనూ ఎదుర్కొంటూ, జైళ్ల పాలు కూడా అవుతున్నారు. తెలంగాణాలో కవ్వాల్‌ పులుల అభయారణ్యం నుండి ఆదివాసుల తరలింపు పర్వం ఇటీవలే ప్రారంభమైంది. పర్యవసానాలు మనం ఊహించుకోవాల్సిందే.
పులి గొర్రెలను, మేకలను చంపితే ప్రభుత్వం పరిహారేమీ ఇవ్వదు. పశువులను చంపితే ఎంతో కొంత పరిహారం ఇస్తుంది. మనిషిని చంపితే రూ.5లక్షలిస్తారు. ఇది కూడా మనిషి జీవించే హక్కు పట్ల గౌరవంతో కాదు. మనుషులు కోపంతో తిరిగి పులికి హాని చేయకూడదని. పులి అడపాదడపా ఒకరినో, ఇద్దరినో చంపినా దానికి అడ్డు రావద్దట. పరిహారం మాత్రం తీసుకుని గమ్మున ఉండాలి. పులి అనేక మందిని అలా చంపుతూ ఉంటే మాత్రం, అటవీశాఖ దాన్ని మాన్‌ ఈటర్‌గా పరిగణించి, కట్టడి చేస్తారు. అప్పటివరకు అప్పుడప్పుడూ కొంత మంది చనిపో యినా పరవాలేదనేది వారి విధానం. మనుషులు తమ బతుకు దెరువు కాపాడుకోవటానికి ఒక్కపులిని చంపితే మాత్రం మూడు నుండి ఆరేండ్ల కారాగార శిక్ష, ఆర్థిక జరిమానా ఉంటాయి.
పులినైనా మరే ఇతర అరుదైన, వన్య ప్రాణినైనా అంత రించిపోకుండా సంరక్షించాలనే లక్ష్యంతో మౌలికంగా విభేదం లేదు. కానీ, అందుకు లక్షలాది ఆదివాసీ ప్రజల జీవనాలనూ, వేలాది పేదల ప్రాణాలనూ బలిచేస్తామంటే మాత్రం అంగీకరిం చలేం. ఈ స్పృహా లేకపోతే అది నాగరిక విలువ అనిపిం చుకోదు. పులుల స్వేచ్ఛ తప్ప మానవ హక్కుల దృక్పథం పాల కులకే కాదు, సభ్యసమాజానికీ లేకపోవటం ఆదివాసీ, ఇతర పేద ప్రజల జీవితాల పట్ల గౌరవం లేనితనాన్ని తెలియ జేస్తుంది. పులుల సంఖ్య వేగంగా పెరుగుతున్న ఈ సమ యంలోనైనా ఈ ధోరణిని సమీక్షించుకోవాలి. తక్షణంగా పులుల సంచారాన్ని మనుషులకు హానికరం కానీ, కనిష్ట ప్రాంతానికి పరిమితం చేయాలి. ‘సంరక్షింపబడే’ ఏ ఒక్క పులివల్లా, ఏ సాధారణ మనిషికీ హాని జరగని విధంగా మాత్రమే పులుల సంరక్షణా విధానం ఉండాలి. ఆ అవకాశం లేకపోతే పులుల జనాభాను నియంత్రించాలి. తమ స్థూల ఆత్మరక్షణలో భాగంగా పులులకు హాని చేసే ఆదివాసీలను వేటగాళ్లను శిక్షించినట్టు శిక్షించవద్దు. పులులను నియమిత ప్రాంతంలోనైనా, సహజ వాతావరణంలో పెరగనీయాలంటే అడవిబిడ్డలను అడవి నుండి బయటికి పంపటం కాకుండా, అడవిలోకి కార్పొరేట్లనూ, పెట్టుబడులనూ ప్రవేశించకుండా చూడాలి.
డా. ఎస్‌ తిరుపతయ్య 9849228212

Spread the love