ఇంటింటా ఇన్నోవేటర్‌ విలేజ్‌ ఇన్నోవేషన్‌కు అవార్డుకు ఎంపికైన మండల రైతు

– రైతు ముల్లపూడి సత్యనారాయణను సన్మానించిన ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ-పినపాక
ఇంటింటా ఇన్నోవేటర్‌ విలేజ్‌ ఇన్నోవేషన్‌ అవార్డ్‌ – 2024ను పినపాక మండలం జానంపేటకు చెందిన ముళ్ళపూడి సత్యనారాయణ అనే రైతు అందుకున్నారు. ఈ అవార్డు తెలంగాణలోని 20 జిల్లాల్లోని 41 గ్రామాలలో ఇన్నోవేషన్‌ స్ఫూర్తితో గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ (టీఎస్‌ఐసీ) ఆధ్వర్యంలో అందిస్తూ ఉండగా మన మండలానికి ఈ అవార్డు వరించింది. జనంపేట గ్రామ పంచాయితీ పరిధిలో రైతుకు ఉపయోగపడే నూతన ఆవిష్కర్తకు గుర్తింపు దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనంపేట పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సెక్రెటరీ నాగిని ప్రభుత్వం అందించిన ఈ అవార్డును రైతుకు ప్రదానోత్సవం చేశారు. గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో రైతును సన్మానించారు. రైతులకు ఉపయోగపడే విధంగా సులభంగా కలుపు తీసే యంత్రాన్ని కనిపెట్టినందుకు గాను రైతుకు అవార్డు లభించింది. అనంతరం రైతు సత్యనారాయణ మాట్లాడుతూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని సైతం కొనసాగించి అనేక పంటలు సాగు చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్‌ కామేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది నరసింహారావు, జానంపేట ఉప సర్పంచ్‌ రాయల సత్యనారాయణ, రామచందర్‌ రాజు, మురళి, పేరం వెంకటే శ్వర్లు , రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love