మన కోర్టులలో మనువుముద్ర!

నేడు ఏపీ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న అబ్దుల్‌ నజీర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు మనువు,కౌటిల్యుడి బోధనలను నేటి భారత న్యాయ వ్యవస్థ అనుసరించాలని, పాశ్చాత్య దేశాల నుండి స్వీకరించిన న్యాయవ్యవస్థ మనకు పనికిరాదని ఉద్బోధించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ప్రతిభా సింగ్‌ గత సంవత్సరం ఆగస్టులో ఢిల్లీలో జరిగిన ఫిక్కీ సమావేశంలో ప్రసంగిస్తూ… మనుస్మతితో సహా భారతీయ స్మృతులన్నీ మహిళలకు గొప్ప గౌరవాన్ని ఆపాదించాయంటూ పొగిడేశారు. ‘స్త్రీలు ఎదుర్కొంటున్న అవాంతరాలు’ అనే అంశంపై ప్రసంగించిన ఆమె భారతదేశంలోని స్త్రీలు మిగతా దేశాల స్త్రీల కంటే అదృష్టవంతులని, మనువు స్త్రీలకు ఉన్నత స్థానాన్ని ఇచ్చాడని పేర్కొన్నారు.
ఈ దేశపు న్యాయస్థానాలను నడిపించే చోదక శక్తి తానే అని చాటింపు వేస్తున్నట్టుగా రాజస్థాన్‌ హైకోర్టు ఆవరణలో మనువు విగ్రహం నేటికీ ఉన్నది. సమాజంలోని మెజారిటీ వర్గాలను, స్త్రీలను బానిసలుగా భావించిన మనువుకు ఆధునిక వ్యవస్థలో స్థానం లేదని… ఆ విగ్రహాన్ని తొలగించాలంటూ బహుజన వర్గాలవారు, ప్రజాస్వామికవాదులు, మహిళా సంఘాలూ ఉద్యమాలు చేసినా పాలకులు పట్టించుకోవడం లేదు. మనువు విగ్రహం బయట తిష్ట వేసుకోవడంతో పాటు… మను భావజాలం న్యాయస్థానాలలోనూ నిండుకొని ఉన్నదని నేటికి ఎన్నోమార్లు నిరూపితమైంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య న్యాయస్థానమైన అలహాబాద్‌ హైకోర్టు సైతం మనుస్మృతిని నిలబెట్టే దిశలో ఒక ఉత్తర్వును విడుదల చేసింది. పెళ్లి పేరుతో మోసగించి, లైంగికదాడి చేసిన ఒక వ్యక్తిపై బాధిత మహిళ ఫిర్యాదు చేయగా… పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సదరు కేసు హైకోర్టుకు చేరగా… అమ్మాయి ‘మాంగళిక్‌’ (మంగళ (కుజ) దోషం ఉన్నది) కాబట్టి… పెళ్లి చేసుకోవడం కుదరదంటూ ఆ నిందితుడు ఉల్టా దబాయించాడు. ఆ నిందితుడి వాదనలను పరిగణనలోకి తీసుకున్న అలహాబాద్‌ హైకోర్టు… నిందితుడు, బాధితురాలి జాతకాలను అలహాబాద్‌ జ్యోతిష్య విద్యాలయం ప్రొఫెసర్‌కు పంపించాలని జ్యోతిష్య ప్రొఫెసర్‌ తేల్చిన విషయాల ఆధారంగా నిర్ణయం వెలువరిస్తామని ఉత్తర్వులు జారీచేసింది. మే 23న ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బాధితురాలిని లైంగికంగా లోబరుచుకున్నప్పుడు అడ్డురాని కుజదోషము పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం ఎలా అడ్డు వచ్చిందనే కనీస ప్రశ్న గౌరవ న్యాయమూర్తులకు తోచలేదు!
అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వుల వార్త పేపర్లలో ప్రముఖం గా రావడంతో సామాన్య ప్రజలతో పాటు న్యాయ నిపుణులూ విస్తుపోయారు. జాతకాల ఆధారంగా న్యాయస్థానాలు నిర్ణయం తీసుకోవడమేమిటని సందేహం వెలిబుచ్చారు. చివరికి సుమోటోగా రంగప్రవేశం చేసిన సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ సదరు హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ… జాతకాలతో సంబంధం లేకుండా హైకోర్టు నిర్ణయం తీసుకోవాలంటూ జూన్‌ 3న ఆదేశాలిచ్చింది. గమ్మత్తైన విషయం ఏమిటంటే… సుప్రీంకోర్టు ముందు హాజరైన బాధితురాలి లాయర్‌ సైతం జ్యోతిష్య ప్రొఫెసరు తేల్చిన దానికి తామూ కట్టబడి ఉంటామని, సదరు ఉత్తర్వుల పట్ల తమకు అభ్యంతరమేదీ లేదనీ తెలిపారు. అమ్మాయి ఒకవేళ ‘మాంగళిక్‌’గా తేలిన పక్షంలో వివాహం జరిగే అవకాశమే లేదని ఆయన సైతం వాదించేవాడు. అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వులో ఎలాంటి అసమంజసత్వం లేదని, ఇరువైపుల వారూ అందుకు సమ్మతించారని సదరు లాయర్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. జ్యోతిష్యం కూడా సైన్స్‌లో ఒక భాగమే. నేడు యూనివర్సిటీలు సైతం జ్యోతిష్యంలో డిగ్రీలు ప్రధానం చేస్తున్నవి అనే విలువైన అంశాన్ని సైతం ఆ లాయరు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు వారు కూడా ”ఆ అంశంలోకి మేము వెళ్లడం లేదు, జ్యోతిష్యమూ సైన్సేనని మేమూ ఒప్పుకుంటాం. అయితే, సదరు ఉత్తర్వులు మాత్రం అసంబద్ధమైనవి” అంటూ తీర్పునిచ్చారు.
మన న్యాయస్థానాల నుండి వెలువడే తీర్పులలో మనువుముద్ర ఎన్నోమార్లు నిరూపితమైంది. 40ఏండ్ల క్రితం సంచలనం సృష్టించిన భన్వారీదేవి సామూహిక లైంగికదాడి కేసు తీర్పులో సైతం గౌరవ న్యాయమూర్తులు మనువు మార్గానే నడిచారు. దళితురాలైన భన్వారీదేవి రాజస్థాన్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న మహిళా అభివృద్ధి కార్యక్రమంలో సాథిన్‌గా పనిచేసేది. ఆమె విధులు నిర్వహిస్తున్న భటేరీ గ్రామంలో ఒక తొమ్మిది నెలల పసికందుకు పెళ్లి చేయాలని ఊరిపెద్దలు ప్రయత్నించినపుడు… ఆ దారుణానికి మౌనసాక్షిగా నిలబడలేని భన్వారీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ పెళ్ళిని అడ్డుకున్నది. తమ దురహంకారంపై దెబ్బ పడటంతో గ్రామ పెద్దలు సహించలేకపోయారు. అందులోనూ ఒక దళితురాలు తమని ఎదిరించడాన్ని పెద్దకులపు గుజ్జర్లు జీర్ణించుకోలేకపోయారు. మన దేశంలో నిమ్నవర్గాల స్త్రీలపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఉన్నది ఒకటే తోవ. దాని ప్రకారమే వారు 22 సెప్టెంబర్‌ 1992న ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. 1995 నవంబర్‌ 15 జైపూర్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి తీర్పునిస్తూ… భన్వారీదేవిపై మానభంగమే జరగలేదని తేల్చేశారు. గౌరవనీయ న్యాయమూర్తి అందుకు గమ్మత్తైన కారణాలు చూపారు. తమ కుల పవిత్రతకు ప్రాధాన్యతనిచ్చే పెద్దకులపు వ్యక్తులు దళితురాలిపై లైంగికదాడి చేయలేరని ఆయన తేల్చేశాడు. వైద్యపరీక్షలో నిందితుల వీర్య అవశేషాలు బాధితురాలి శరీరంపై లభించినా న్యాయమూర్తి ఆ సాక్ష్యానికి విలువ లేదన్నాడు. ఒక వ్యక్తి తన మేనల్లుడి సమక్షంలో సామూహిక లైంగికదాడిలో పాల్గొనలేడు. గ్రామ పెద్ద మానభంగం చేయలేడు. వేరువేరు కులాలకు చెందినవారు సామూహిక మానభంగంలో కలిసి పాల్గొనలేరు అనే కారణాలను సైతం న్యాయమూర్తి జోడించాడు. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే కన్నయ్యలాల్‌ మీనా, రాష్ట్ర రాజధాని జైపూర్‌లో నిందితుల విడుదలను స్వాగతిస్తూ పెద్ద ర్యాలీ నిర్వహించాడు. బీజేపీ మహిళా విభాగం సైతం భన్వారీదేవినే నిందిస్తూ ప్రచారం చేపట్టింది. మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంతో తప్పనిసరి పరిస్థితు లలో రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అప్పీలు చేసింది. సదరు అప్పీలు నేటికీ రాజస్థాన్‌ హైకోర్టు విచారణలో ఉన్నది. బాధితురాలు భన్వారీదేవికి న్యాయం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలి ఉన్నది.
మన న్యాయాధిపతుల్లో కొందరికి మనుస్మృతి పట్ల విపరీతమైన గౌరవం ఉందన్న సంగతి బహిర్గతమే. నేడు ఏపీ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న అబ్దుల్‌ నజీర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు మనువు, కౌటిల్యుడి బోధనలను నేటి భారత న్యాయ వ్యవస్థ అనుసరించాలని, పాశ్చాత్య దేశాల నుండి స్వీకరించిన న్యాయవ్యవస్థ మనకు పనికిరాదని ఉద్బోధించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ప్రతిభా సింగ్‌ గత సంవత్సరం ఆగస్టులో ఢిల్లీలో జరిగిన ఫిక్కీ సమావేశంలో ప్రసంగిస్తూ… మనుస్మృతితో సహా భారతీయ స్మృతులన్నీ మహిళలకు గొప్ప గౌరవాన్ని ఆపాదించాయంటూ పొగిడేశారు. ‘స్త్రీలు ఎదుర్కొంటున్న అవాంతరాలు’ అనే అంశంపై ప్రసంగించిన ఆమె భారతదేశంలోని స్త్రీలు మిగతా దేశాల స్త్రీల కంటే అదృష్టవంతులని, మనువు స్త్రీలకు ఉన్నత స్థానాన్ని ఇచ్చాడని పేర్కొన్నారు. ‘స్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అని ఘోషించిన మనువు పట్ల ఆమె మనోగతమది. భారత రాజ్యాంగం ప్రవచించిన సమానత్వ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న గ్రంథాలను గౌరవ న్యాయమూర్తి పొగడటం పట్ల మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరిచాయి. మొన్నటి సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత నెలకొన్న పరిస్థితి ఏమిటంటే… ‘కుజ దోష ప్రమాదం’ తాత్కాలికంగా వెనక్కు నెట్టి వేయబడినా ‘జ్యోతిష్య శాస్త్ర ప్రమాదం’ మాత్రం ఇంకా పొంచి ఉన్నది. ప్రజల్లో హేతుబద్ధ ఆలోచనా ధోరణిని పెంపొందించే దిశలో ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని నిర్దేశిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఏ పై నీలినీడలు ఆవరించి ఉన్నాయి. సామాజిక ప్రగతికి ఆటంకంగా నిలిచిన మనువాదం అంతరించా లని.. రాజ్యాంగం దృఢతరం కావాలని ఆకాంక్షించే వారందరికీ ఆందోళన కలిగించే అంశాలివి.
సెల్‌: 9440443183
ఆర్‌. రాజేశమ్‌

Spread the love