Monday, August 10, 2026
E-PAPER
Homeఖమ్మంబీఆర్ఎస్‌లో పలువురి చేరిక

బీఆర్ఎస్‌లో పలువురి చేరిక

- Advertisement -

– సాదరంగా ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల, కాలనీకి చెందిన పలువురు సోమవారం బీఆర్ఎస్‌లో చేరారు. వారిని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మెచ్చా నాగేశ్వరరావు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు మెరుగైన పాలన, అభివృద్ధి లభించిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా, మెచ్చా నాగేశ్వరరావును ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పల్లెలు అభివృద్ధి చెందాలంటే గులాబీ జెండా మళ్లీ ఎగరాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టుకుని కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు.

రెండేళ్లు గడుస్తున్నా నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరు చేయించిన పనులను సైతం పూర్తి చేయలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. పట్టణాల నుంచి పల్లెల వరకు మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, మారుమూల ప్రాంతానికి చెందిన వారు సైతం అధికార పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరడం ఇందుకు నిదర్శనమని అన్నారు.

బీఆర్ఎస్‌ను బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. మిగిలిన రెండేళ్లలో ప్రతి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడికి అండగా ఉంటానన్నారు. ఎవరైనా పార్టీ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తే భవిష్యత్తులో తగిన విధంగా సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్‌లో చేరిన వారిలో కొమరం రవి, కణితి వెంకటేష్, బాలు, కొమరం హిమచందు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు జూపల్లి కోదండ వెంకట రమణారావు, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు జల్లిపల్లి శ్రీరామమూర్తి, మందపాటి రాజమోహన్‌రెడ్డి, యుఎస్ ప్రకాశ్‌రావు, సంక ప్రసాద్, కలపాల బాబురావు, అచ్యుతాపురం ఉప సర్పంచ్ పాకనాటి నాగేశ్వరరావు, మల్లాయిగూడెం మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్, చిప్పనపల్లి శ్రీను, లింగంకుంట కృష్ణ, బుజ్జిబాబు, ఆకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -