వర్గ పోరాటాలు నిర్వహించడం ద్వారానే మార్క్సిస్టు ఉద్యమాన్ని నిర్మించాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని
– భద్రాచలంలో విజయవంతమైన రాజకీయ శిక్షణా తరగతులు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
ఆదివాసీ గిరిజన బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తమ ప్రాణాలను తునప్రాయంగా విడిచిపెట్టిన నాయకులను తయారు చేసిన ఘనత ఒక సీపీఐ(ఎం) పార్టీకే దక్కుతుందని, ఈ గడ్డపై పోరాటాల త్యాగాల చరిత్ర ఎర్రజెండాకే చెందుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు స్పష్టం చేశారు. భద్రాచలం పట్టణంలోని పద్మశ్రీ గార్డెన్లో నిర్వహించిన ఒక్కరోజు రాజకీయ శిక్షణా తరగతులకు పోతినేని సుదర్శన్‌ రావు హాజరై కార్యకర్తలకు రాజకీయ క్లాసును బోధించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌ రావు మాట్లాడుతూ… భద్రాచలం నియోజకవర్గంలో కూలి పోరాటాలు, భూ పోరాటాలు చేసి ఫారెస్ట్‌ అధికారులను ఎదిరించి నిలిచింది ఒక్క సీపీఐ(ఎం) కార్యకర్తలకు సాధ్యమని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎందరో మహానీయులు తమ ప్రాణాలను తునప్రాయంగా విడిచి పెట్టారని అటువంటి నాయకుల త్యాగాలతో ఈ నేల పునితమైనదని సుదర్శన్‌ రావు అభిప్రాయపడ్డారు.
మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన కుంజా బొజ్జి, సున్నం రాజయ్యలు ఈ నియోజకవర్గ అభివృద్ధి తప్ప సొంత అభివృద్ధి కోసం ఏనాడు ఆలోచించలేదని, రాజకీయ చరిత్రలోనే ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని స్వచ్ఛమైన నీతివంతమైన పాలన అందించిన కుంజా బొజ్జి, సున్నం రాజయ్యలు ఈ ప్రాంత ప్రజల మదిలో ఎప్పుడూ నిలిచి ఉంటారని అన్నారు.
రాజశేఖర్‌ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న కాలంలో పోలవరం శంకుస్థాపన నుండి సుదీర్ఘకాలం పోరా టాలు నిర్వహించి జైలుకు వెళ్లి లాఠీ దెబ్బలను ఓర్చుకొని తూటాలకు సైతం ఎదురు నిలిచిన పార్టీ కార్యకర్తల త్యాగం ఊరికే పోదని సుదర్శన్‌ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమాజంలో పేదరికం, ఆకలి వేధింపులు ఉన్నంతకాలం ఎర్రజెండాలు ఉంటాయని, బడుగు బలహీన వర్గ ప్రజల పక్షాన చిట్టచివరి వరకు నిలిచేది ఎర్రజెండేనని అన్నారు. ఎంతోమంది నాయకుల బలిదానాలు, ఎన్నో త్యాగాలతో నిర్మితమైన మార్క్సిస్టు పార్టీలో కొంతమంది నాయకులు బూర్జవ రాజకీయ పార్టీలలోకి వలస వెళ్లినంత మాత్రాన ఎర్రజెండాకు వచ్చిన నష్టమేమీ లేదని, నిజాయితీ నిస్వార్థం కలిగిన ఎంతోమంది కార్యకర్తలు జెండా మో యటం సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులకు పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, ప్రిన్సిపాల్‌గా వ్యవ హరించగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్‌, ప్రసంగించారు. ఈ శిక్షణా తరగతులలో పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బం డారు శరత్‌ బాబు, ఎర్రంశెట్టి వెంకట రామా రావు, పారెల్లి సంతోష్‌ కుమార్‌, నాదెండ్ల లీలా వతి, పట్టణ కమిటీ సభ్యులు టి.సీతాలక్ష్మి, చుక్క మాధవరావు, ఎం.వి.ప్రసాద్‌ రావు, కోరాడ శ్రీనివాస్‌, వస్తేల జ్యోతి, కుంజ శ్రీను, జీవనజ్యోతి, ఫిరోజ్‌, పట్టణ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love