ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ

SBI-ATMనవతెలంగాణ – మహబూబాబాద్‌
మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. మండల కేంద్రంలోని రామాలయం కూడలిలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంను పగులగొట్టి రూ.29.70లక్షలు అపహరించినట్లు ఏటీఎం నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. శనివారం రాత్రి నల్ల రంగు కారులో వచ్చిన దుండగులు రామాలయం చుట్టూ పక్కల ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు సీసీ పుటేజీలో రికార్డు అయింది. సీసీ కెమెరాలకు నల్ల రంగు స్ప్రే చేసి ఇద్దరు వ్యక్తులు లోనికి ప్రవేశించారు. గ్యాస్‌కట్టర్‌తో ఏటీఎం తలుపును తెరచి అందులో ఉన్న రూ.29.70లక్షల నగదును అపహరించుకెళ్లారు. ఆదివారం ఉదయం నగదు తీసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి ధ్వంసమైన ఏటీఎంను చూసి స్థానికులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలికి వచ్చిన బయ్యారం ఎస్సై ఉపేందర్‌, మహబూబాబాద్‌ ఏఎస్పీ చెన్నయ్య క్లూస్‌టీం సహకారంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఏఎస్పీ మాట్లాడుతూ..మేడారం జాతర నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దుండగులు చోరీలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ చోరీకి సంబంధించి పలు ఆధారాలు లభ్యమయ్యాయని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామన్నారు.

Spread the love