మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌కు పనిభద్రత కల్పించాలి

మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌కు పనిభద్రత కల్పించాలి– సేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయీస్‌ ప్రొటెక్ట్‌ యాక్టు-1976ను పునరుద్ధరించాలి
– మందులు, మెడికల్‌ పరికరాలపై జీఎస్టీ ఎత్తేయాలి
– టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ ధర్నాలో వక్తలు
– లేబర్‌ కమిషనర్‌ ఎమ్‌ నదీమ్‌కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయీస్‌ ప్రొటెక్ట్‌ యాక్టు -1976ను పునరుద్ధరించి మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్‌లకు పనిభద్రత కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని అంజయ్యభవన్‌ (రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం) ఎదుట తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌(టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌ ఎమ్‌డీ నదీమ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ధర్నానుద్దేశించి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భానుకిరణ్‌, రాజ్‌భట్‌ మాట్లాడారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ రిప్రజెంటేటీవ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఏఐ) ఆధ్వర్యంలో ఈ నెల 20న దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో మెడికల్‌ రిప్రజెంటేటీవ్స్‌ను అనుమతించకపోవడం సరిగాదన్నారు. రాష్ట్రంలో ఈ నిబంధనను ఎత్తేయాలని కోరారు. మందులు, మెడికల్‌ పరికరాలపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. మందుల ధరలను తగ్గించాలని కోరారు. ఫార్మా కంపెనీల నుంచి దక్కాల్సిన సౌకర్యాలను మెడికల్‌ రిప్స్‌కు కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. కేంద్రం ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డాక్టర్ల సలహాలు, సూచనలతో వాడాల్సిన మెడిసిన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి వాడటం రోగుల ప్రాణాలకే ప్రమాదకరమని హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో అమ్మకాలకు అనుమతులివ్వడం వల్ల రాష్ట్రంలో వేలాది మంది మెడికల్‌ షాపుల నిర్వాహకులు, మెడికల్‌ రిప్రజెంటేటీవ్స్‌ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముందని వాపోయారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు సుధాకర్‌, టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ రాష్ట్ర నాయకులు అప్రోజ్‌, జగదీశ్వరాచారి, టీవీ సతీశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love