సీతక్కా..మీరైనా సమస్యల్ని పరిష్కరించండి

సీతక్కా..మీరైనా సమస్యల్ని పరిష్కరించండి– మంత్రికి ఐకేపీ వీఓఏల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘గత ప్రభుత్వం పదేండ్లు వెట్టిచాకిరీ చేయించుకుని సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సీతక్కా..మీరైనా మా సమస్యల్ని పరిష్కరించండి’ అని మంత్రి దనసరి అనుసూయ(సీతక్క)కు ఐకేపీ వీఓఏలు విన్నవించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో సీతక్కకు తెలంగాణ ఐకేపీ వీఓఏ సంఘం(సీఐటీయూ) నేతలు వినతిపత్రం అందజేశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్వీ.రమ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నగేశ్‌, యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ముస్తఫా, లక్ష్మారెడ్డి, సులోచన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మంత్రి సీతక్క దృష్టికి పలు సమస్యల్ని తీసుకెళ్లారు. తాము 20 ఏండ్ల నుంచి సెర్ఫ్‌ సంస్థలో వీఓఏలుగా పనిచేస్తున్నామనీ, గ్రామాల్లో మహిళలు అర్ధికంగా, సామాజికంగా ఎదగడానికి వారికి తోడ్పాటునందిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో తాము కీలకపాత్ర పోషిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్లుగా తమతో వెట్టి చాకిరి చేయించుకుని సమస్యల్ని పరిష్కరించలేదన్నారు. తమ సమస్యల గురించి తెలిసిన మీరు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. వీఓఏలను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించి కనీసవేతనంతో ఉద్యోగ భద్రత కల్పించాలనీ, రూ.10 లక్షల ఆరోగ్యబీమా కల్పించాలని కోరారు.

Spread the love