కుమురంభీం వర్ధంతి వేడుకలో విషాదం

– ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు
నవతెలంగాణ-కడెం
నిర్మల్‌ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్‌లో ఆదివారం నిర్వహించిన కుమురంభీం వర్ధంతి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఏర్పాటు చేసిన కుమురంభీం వర్ధంతి కార్యక్రమంలో భాగంగా జెండాను ఏర్పాటు చేశారు. జెండా ఎత్తే క్రమంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్‌ వైర్లకు జెండా ఇనుప పైపు తగలడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా క్షతగాత్రులను వెంటనే ఖానాపూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో పెంద్రం మోహన్‌(26) మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆత్రం భీంరావు(25) మృతి చెందారు. వెంకుపటేల్‌ చికిత్స పొందుతున్నాడు. దాంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్‌ నాయక్‌ స్థానిక ఆస్పత్రికి వెళ్లి వారి మృతదేహలను పరిశీలించారు. పేదరికంలో ఉన్న ఆ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. వారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో బాధితుడు వెంకుపటేల్‌ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటానని తెలిపారు.

Spread the love