రెండు రాష్ట్రాల్లో జనసేనతో కలిసేపోటీ

– పొత్తులు ఖరారయ్యాయి : డాక్టర్‌ కె.లక్ష్మణ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో జనసేన పార్టీతో తాము కలిసే పోటీ చేస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ప్రకటించారు. జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అనీ, తెలంగాణలో ఆ పార్టీతో పొత్తులు ఖరారయ్యాయని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
వేలం పాట మాదిరిగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయని విమర్శించారు. కర్నాటకలో సంక్షేమ పథకాల అమలులో ఆంక్షలు పెడుతున్నారని తెలిపారు. ఉచిత హామీలతో మోసపోయామని కర్నాటక ప్రజలు గుర్తించారన్నారు. కర్నాటకలో కరెంటు సరిగా ఇవ్వడంలేదనీ, వెయ్యి రూపాయలు వచ్చే కరెంట్‌ బిల్లు ఇప్పుడు మూడు వేలకు పెంచారని విమర్శించారు. కర్నాటకలో 65 ఏండ్లు దాటిన వారికే వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. ఈ నెల ఏడో తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగే మోడీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Spread the love