కలుపుగోలుతనం లేకనే బండిని తప్పించి ఉండొచ్చు

– సంక్షేమంలో ముందున్నది సీఎం కేసీఆరే
– ఇచ్చిన హామీలతోనే కేసీఆర్‌ను దెబ్బకొట్టొచ్చు : మురళీధర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నేతలను కలుపుకుని పోవడంలో ఇబ్బంది ఉందనే దృష్టితోనే అధిష్టానం బండి సంజరుని పదవి నుంచి తప్పించి ఉండొచ్చని బీజేపీ జాతీయ నేత, మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు తక్కువ టైమున్న నేపథ్యంలో పార్టీలోకి పెద్ద తలలు వచ్చే అవకాశముందనీ, అలాంటి సమయంలో సీనియర్‌, జూనియర్‌ అని భేదాభిప్రాయాలు రావచ్చనే ఉద్దేశంతోనే బండిని మార్చి ఉండొచ్చని ఆయన చెప్పారు. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడి మార్పు కారణంగా పార్టీ డ్యామేజీ అయింది అనడం కరెక్ట్‌ కాదన్నారు. ఎందుకు మార్చారు అనేది మార్చిన వాళ్లకు బాగా తెలుసునన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మధ్యప్రదేశ్‌ లో బీజేపీ, కాంగ్రెస్‌ తప్పితే మరో పార్టీ లేదన్నారు. కాంగ్రెస్‌ అసంతృప్తి నేతలు బీజేపీలో, బీజేపీ అసంతృప్తి నేతలు కాంగ్రెస్‌లో చేరుతారని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ కర్నాటకలో మాదిరిగా ఉండకపోవచ్చునన్నారు. చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌కు వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పారు. పాలిటిక్స్‌ ఒక బ్యూటీ అనీ, ఒకరి గురించి మరొకరు చెప్పటంతో అవతలి వారిని ఈజీగా స్టడీ చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ఇక్కడ కేసీఆర్‌ లాగా.. అక్కడ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఉన్నారన్నారు. సంక్షేమంలో కేసీఆర్‌ ముందున్నారనీ, శివరాజ్‌ సింగ్‌ కూడా తమకు అలాగే అని చెప్పారు. కర్ణాటకలో లాగా మధ్యప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ హామీలిచ్చినా అక్కడి ప్రజలు వారిని నమ్మరనీ, శివరాజ్‌ వాళ్ళకంటే ఒకడుగు ముందే ఉండటమే దానికి కారణమని చెప్పారు. కమల్‌నాథ్‌ మంచి లీడరే అయినా సిద్ధరామయ్యలాగా మాస్‌ ఇమేజ్‌ లేదన్నారు. ఆయన మధ్యప్రదేశ్‌ వ్యక్తి కాదనీ, ఆయన పంజాబీ వ్యక్తి కావడం ప్రతికూలం చూపే అవకాశముందని చెప్పారు. కేసీఆర్‌ను వెల్ఫేర్‌ విషయంలో కొట్టలేమన్నారు. అలాగని ఆయన వెల్ఫేర్‌ పేరుతో ఎప్పుడూ గెలవలేరని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే అంశంతోనే ఆయన్ను దెబ్బ కొట్టగలగమన్నారు. హామీలు-అమలు మధ్య ఉన్న తేడాను హైలెట్‌ చేసి ఆయన్ను దెబ్బతీయొచ్చన్నారు. అలా చేయకుంటే ఓడించలేమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందనీ, రాష్ట్రంలోని 65 శాతమున్న యూత్‌ అండతో కేసీఆర్‌ను ఈజీగా కొట్టొచ్చన్నారు. యూత్‌ పొలిటికల్‌ గేమ్‌ చేంజర్లు అని నొక్కి చెప్పారు. యువత ఓటు ఎటు మొగ్గుచూపితే వారిదే విజయమన్నారు. అవినీతి చేసినోళ్లంతా జైలుకు పోవాల్సిందేననీ, అందుకే జైళ్లు కడుతున్నామని అన్నామని తెలిపారు. కేసీఆర్‌ ఇక్కడ ఫెయిల్‌ అవుతున్నాడు కాబట్టే దాన్ని కప్పిపుచ్చేందుకు జాతీయ పార్టీ అని కబుర్లు చెబుతున్నాడని విమర్శించారు.

Spread the love