భూముల అమ్మకం పతనానికి నాంది

The country to corporates Modi is building– సంపద లేకుంటే భవిష్యత్తులో అనేక ఉపద్రవాలు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘సంపద సృష్టించాలి తప్ప కొల్లగొట్టకూడదు.సంపద సృష్టి మెరుగైన పాలనకు గీటురాయి. సంపద ఉంటేనే ప్రభుత్వ నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు సాధ్యం. సంపద లేకుండా పోతే వ్యవస్థ కుంటుపడుతుంది. భవిష్యత్‌లో అనేక ఉపద్రవాలొస్తాయి..భూముల అమ్మకం వ్యవస్థ పతనానికి నాంది’ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ నిర్వహణ, ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికి కావాల్సిన నిధుల సమీకరణకు భూములను అమ్మడం ప్రజావ్యతిరేక చర్య అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూముల్నే కాకుండా రైతుల పట్టా, అసైన్డ్‌ భూములను బలవంతంగా లాక్కొని పెద్దపెద్ద వ్యాపారస్తులకు కట్టబెట్టడం దారుణమని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ 80 వేల పుస్తకాలు చదివింది దీని కోసమేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పంచాయతీల నిర్వహణకు కూడా నిధులు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. రెవెన్యూ మిగులున్న రాష్ట్రాన్ని నేడు రూ.6 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి, పలు సంస్థలు, సైన్స్‌సిటీ, ఆర్కియాలజీ మ్యూజియం, సంగీత నాట్య అకాడమీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం స్థలం అడిగితే రాష్ట్ర సర్కారు ఇవ్వట్లేదన్నారు. ట్రైబల్‌ మ్యూజియానికి 25 ఎకరాలడిగితే అరెకరం ఇచ్చిందని విమర్శించారు. ఫార్మాసిటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ దందా చేస్తున్నదని ఆరోపించారు. హైదరాబాద్‌ చుట్టూతా ఉన్న భూములను వేలం పాటల ద్వారా పెద్దపెద్ద వ్యాపారులకు కట్టబెడుతున్నదన్నారు. వేలం పాటల ద్వారా బీఆర్‌ఎస్‌ నేతలు తమ అనుచరులు, బినామీల పేరిట వందల ఎకరాలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి పదెకరాలు, బీఆర్‌ఎస్‌ పార్టీకి 11 ఎకరాలు కేటాయించడం దారుణమన్నారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన జయసుధ, ఆకుల రాజేందర్‌, లక్ష్మారెడ్డిని కిషన్‌రెడ్డి సన్మానించారు.

Spread the love