– సంయుక్త కిసాన్ మోర్చా నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశ స్వాతంత్రాన్ని కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం అప్పగిస్తున్నదని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) రాష్ట్ర కన్వీనర్లు టి సాగర్,పశ్యపద్మ,కోటేశ్వరరావు, బిక్షపతి విమర్శించారు. కిసాన్ మోర్చా కేంద్ర కమిటి పిలుపులో భాగంగా ‘వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం-రాజ్యాంగ విలువలను రక్షించుకుందాం’ నినాదంతో సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల రెండో దశ పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు పెట్టిన పెట్టుబడికి 50శాతం కలిపి కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని చెప్పి ఇప్పుడు రైతాంగాన్ని మోసం చేస్తున్నదన్నారు. కనీసం మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల రుణాలను మాఫీ చేస్తూ చట్టం చేయాలని కోరారు. లకీంపూర్‌కేరిలో నలుగురు రైతులు, విలేకరి మరణానికి కారణమైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రైతు పోరాటంలో మరణించిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రెషియా చెల్లించాలన్నారు. కేంద్రం తన విధానాలను మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా మరో స్వాతంత్య్ర పోరాటానికి రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు ప్రజలందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు మూడ్ శోభన్, ప్రభులింగం, అంజయ్య నాయక్, జెట్టి లక్ష్మణ్, శ్రీకాంత్, గణేష్, సృజన, నారాయణ, శ్రీను, శ్యాం తదితరులు పాల్గొన్నారు.