వలస శవం

ఊహించని కష్టమేదో…
ఊరు దాటేలా ఉసిగొల్పిందో…
భరించలేని బాధేదో, బతుకును ముల్లెగట్టి,
బంధాలకు దూరంగా విసిరేసిందో…

ఏం జరిగిందో కానీ అతడు,
మట్టి దోసిట్లో కంటి ముత్యాల్ని రాల్చి,
కన్న నేలను కన్నార్పకుండా చూస్తూ వెళ్ళిపోయాడు…

గుండెను ఇంటికి ఝూమర్‌ లా వేలాడదీసి,
ఆత్మను ఊరి పొలిమేరల్లో ప్రతిష్టించి,
దేహమై దేశ సరిహద్దుతో పాటు,
అశ్రువై కంటి కంచెల్నీ ఒకేసారి దాటేశాడు…

సహ కార్మికులతో బాధల్ని పంచుకుంటూ…
గతాన్ని కన్నీళ్లలో నంజుకుంటూ…
పగటి కత్తికి తెగిపడ్డ కలల్ని పోగేసి…
రాత్రి రంగునద్ది అతికిస్తుండేవాడు….
యజమానుల తిట్లు తిని,
కన్నీళ్ళు తాగి కడుపు నింపుకునేవాడు…
అందుకేనేమో ఎప్పుడడిగినా ఆకలి లేదనేవాడు…

ఆడి, ఆడి అలసిపోయాడో,
ఓడే ఆటను ఆడననుకున్నాడో,
ఆటనాపేశాడు….

చివరికి… లోహ విహంగమై ఎగిరినవాడు,
ఇనుప పెట్టెలో ఇంటిముందు వాలాడు…

పార్థీవ దేహాన్ని తప్ప,
వలస శవాన్ని ఏనాడూ దర్శించని
పగటి వేషగాళ్ళు హఠాత్తుగా ప్రత్యక్షమై
కపట నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు…

”జాతరొస్తున్నట్లుంది”
విన్యాసాలెన్నో చేస్తున్నారు కానీ,
అదేంటో మరి..?!
”వాళ్ళ చొక్కాకున్న తెలుపులో,
కొంచెమైనా మనసుకంటడం లేదు.”
– జాబేర్‌ పాషా
00968 78531638

Spread the love