కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు

విద్యుత్‌రంగంలో 1990వ దశకంలో సంస్కరణలు చేసినవారు ఏమి చెప్పినా, ఎన్ని చెప్పినా ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారాలు వివిధ రూపాలలో పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ రంగ విద్యుత్‌ సంస్థలు, ముఖ్యంగా విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కాములు), నష్టాల పాలవుతునేవున్నాయి. విద్యుత్‌ రంగంలోకి ప్రయివేట్‌ పెట్టుబడిదారులు పెద్దఎత్తున చొరబడటానికి, క్రమేణా విద్యుత్‌ రంగ ప్రయివేటీకరణకు ఈ విధానాలు దారి తీస్తున్నాయి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రధాన కారణం. ప్రభుత్వ రంగ విద్యుత్‌ సంస్థల నిర్వ హణలో లోపాలు, లోటుపాట్లును కాదనలేం. కానీ విద్యుత్‌ రంగ వ్యవహారాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన నియంత్రణ కమిషన్లు ప్రభుత్వాల విధానాల పరిధికి లోబడే పనిచేస్తున్నాయి. అధికారంలో ఉన్నవారికి తోడు, నయా ఉదారవాద విధానాలకు, కార్పొరేట్‌ రంగ ప్రయోజనాలకు మద్దతుదారులుగా వ్యవహరిస్తున్న మేధావులు, నిపుణులు, పాలకవర్గ మీడియా ఏకపక్ష ప్రచారం చేస్తున్నది. కానీ విద్యుత్‌ చార్జీలను పెంచక తప్పదనేవారు, సామాన్య ప్రజానీకానికి ఇస్తున్న కొద్దిపాటి సబ్సిడీలను వ్యతిరేకించే వారు కొందరున్నారు. మరికొందరు ఈ చట్టాలను, నిర్ణయాలను, ఆచరణను ప్రశ్నిస్తున్నారు. వాటికి ప్రజానుకూల ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు.
కాకులను కొట్టి గద్దలకు వేస్తున్న మోడీ సర్కార్‌!
మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ, రాష్ట్రాలపై రుద్దుతున్న విధానాల సారాంశం ‘కాకులను కొట్టి గద్దలకు’ వేయడమే. ప్రజలపై విపరీత భారాలు మోపుతూ, కార్పొరేట్‌ సంస్థల పబ్బం గడపటం, తమ పబ్బం గడుపు కోవటం పాలకులకు నిత్యకృత్యంగా మారింది. ఫెడరల్‌ వ్యవస్థ స్ఫూర్తిని హరిస్తూ, రాష్ట్రాల హక్కులను, అధికారాలను కబళిస్తూ, మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. ఇతర రంగాల్లోలాగే, విద్యుత్‌ రంగంలో కూడా రాష్ట్రాలపై రుద్దుతున్న సంస్కరణల అమలువల్ల తలెత్తుతున్న దుష్ఫలితాలకు, వాటిపై ప్రజల నుండి వచ్చే వ్యతిరేకతకు తనకేమీ బాధ్యత లేనట్టు మోడీ ప్రభుత్వం మోర పైకెత్తి చూస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ విధానాలు, చట్టాలు, ఆదేశాల ప్రకారం ప్రయివేటు విద్యుత్‌ ప్రాజెక్టులకు అనుమతులనిచ్చి, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) చేసుకొంటున్న తీరు, అధిక పెట్టుబడి వ్యయం మోసాలు, లోపభూయిష్ట నిబంధనలు వినియోగదారులపై వేల కోట్ల రూపాయల భారాలను దీర్ఘకాలికంగా మోపుతున్నాయి. దేశంలోనూ, ఆ తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాలలోను ఈ చేదు అనుభవాల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా, ఈ నష్టదాయక విధానాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెగ్యులేటరీ కమిషన్ల ఉత్తర్వులు కూడా అనేక సందర్భాలలో అందుకు వీలు కల్పించేవిగా ఉంటున్నాయి. పార్టీలు, ప్రభుత్వాలు వేరైనా, కొనసాగుతున్న ఈ ధోరణి పాలక వర్గాల స్వభావం కొంత హెచ్చుతగ్గులతో ఒకటేనని నిర్ధారిస్తుంది. పాలకవర్గ పార్టీలు పరస్పరం తీవ్ర విమర్శలు, నిందారోపణలు చేసుకొంటున్నా, ప్రజానుకూల ప్రత్యామ్నాయాలు సూచించలేని వాటి దౌర్బల్యం వాటి వర్గ స్వభావం, స్వార్ధ ప్రయోజనాల సారూప్యతను నిర్ధారిస్తుంది.
తడిసి మోపెడవుతున్న విద్యుత్‌ కొనుగోలు వ్యయం
డిస్కములు వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు అయ్యే మొత్తం ఖర్చులో దాదాపు 75 నుండి 80శాతం వరకు విద్యుత్‌ కొనుగోలు వ్యయమే. ఈ వ్యయం చార్జీల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రధానంగా కారణమవుతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగించే ఇంధనాలకయ్యే వ్యయం గణనీయంగా ఉంటున్నది. ఈ వ్యయం పెరుగుదలని బట్టి అస్థిర చార్జీలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. బొగ్గు, సహజ వాయువు వంటి ఇంధనాల ధరలను వాటి ఉత్పత్తి వ్యయం, న్యాయమైన లాభం ఆధారంగా నిర్ణయించాలి. కానీ కేంద్ర అర్థంలేని విధానాల వల్ల వాటి ధరలు చాలా అధికంగా ఉంటున్నాయి. ఈ ఇంధనాలను ఉత్పత్తి చేసి, విక్రయిస్తున్న సంస్థలకు వస్తున్న అధిక లాభాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్రానికి చెల్లిస్తున్న డివిడెండ్ల భారీ మొత్తాలు దీనిని నిర్థారిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పిన నాలుగు గ్యాస్‌ ఆధారిత ప్రయివేట్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు రిలయన్స్‌ సంస్థ కేజీ బేసిన్‌ నుండి సహజ వాయువు సరఫరా నిలిపివేసింది. దీంతో అవి 2013 మార్చి నుండి మూతపడ్డాయి. విద్యుత్‌ ఉత్పత్తి చేయకపోయినా డిస్కాములు ఈ ప్రాజెక్టులకు స్థిర చార్జీలను చెల్లించాలన్న వివాదాలు అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ చివరకు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులలో ఉభయ తెలుగు రాష్ట్రాల డిస్కాములకు పీపీఎల ప్రకారం వాటాలున్నాయి. రిలయన్స్‌ సంస్థ కెేజీ బేసిన్‌లో సహజ వాయువు ఉత్పత్తిని ప్రారంభించిన, కేంద్రం చేసిన కేటాయింపుల మేరకు ఈ ప్రాజెక్టులకు దానిని సరఫరా చేయాలని రిలయన్స్‌ను ఆదేశించకుండా, స్వేచ్ఛా మార్కెట్‌లో వేలం ద్వారా విక్రయించు కొనేందుకు మోడీ ప్రభుత్వం రిలయన్స్‌ సంస్థకు వీలు కల్పించింది. అంటే చట్టబద్ధ్దమైన నల్ల బజారు వ్యాపారానికి, విపరీత లాభార్జనకు ద్వారాలు తీసింది. ఆ పద్ధతిలో సహజ వాయువును కొని విద్యుత్‌ ఉత్పత్తి చేస్తాయి, విద్యుత్‌ కొనుగోలుకు విపరీతమైన అధిక ధరలను చెల్లించాల్సి వస్తున్నది. కేజీ బేసిన్లో ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ గ్యాస్‌ ఉత్పత్తి పెంచడానికి కేంద్రం అనుమతించని పరిస్థితి ఒక పక్క కొనసాగుతుండగా, ఓఎన్‌జీసీ బావుల నుండి రిలయన్స్‌ దాదాపు రూ.30వేల కోట్ల విలువైన గ్యాస్‌ను అక్రమంగా తీసుకొన్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ అఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డీజీహెచ్‌) నిర్ధారించింది. బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ వ్యయం విపరీతంగా పెరగడానికి కేంద్రం విధిస్తున్న రకరకాల పన్నులు మరో కారణం. బొగ్గు మూల ధరపై రాయల్టీ, జీఎస్టీ, గ్రీన్‌ ఎనర్జీ సెస్స్‌ జాతీయ మైనింగ్‌ ఎక్సప్లోరేషన్‌ పన్ను రాయల్టీ, జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ ఛార్జ్‌ రాయల్టీపై పర్యావరణ, వికాస్‌ ఉపకార లెవీ వంటివి ఉన్నాయి. బొగ్గు రవాణాకు రైల్వేలు వసూలు చేస్తున్న మొత్తం కూడా బొగ్గు ధరలో 25శాతంగా ఉంది. రోడ్డు రవాణా చార్జీలు 11శాతంగా ఉన్నాయి. డివిడెండ్లు, పన్నులు, సుంకాల రూపంలో కేంద్రం విపరీతంగా ఆదాయం పొందుతున్నా, వినియోగదారులకు విద్యుత్‌ చార్జీల భారాలను తగ్గించేందుకు ఎటువంటి సబ్సిడీని ఇవ్వటం లేదు.
వినియోగదారులపై అనవసర భారాలు
ఆశ్రిత పెట్టుబడిదారుల, ప్రయివేటు వ్యాపారుల పబ్బం గడిపేందుకు కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, విద్యుత్‌ వినియోగదారులపై అన్యాయంగా విపరీత భారాలను మోపుతున్నాయి. దేశంలో బొగ్గుగనుల సంస్థలకు సమృద్ధిగా నిధులు, యంత్రాలు, కార్మిక శక్తి, బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ, దేశంలో బొగ్గుకు కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారు. దీనితో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు కేంద్రం చేసిన కేటాయింపుల మేరకు బొగ్గు సరఫరా జరగక, విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయి, విద్యుత్‌ కొరత ఏర్పడుతున్నది. విద్యుత్‌ ఉత్పత్తికి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని దేశంలో బొగ్గు కొరతను కృత్రిమంగా సృష్టించిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల, ప్రయివేటు థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులపై ఒత్తిడి తెస్తూ ఆదేశాలను జారీ చేస్తున్నది. ఇక్కడ అదానీ, టాటాల వంటి గుత్తపెట్టుబడిదారీ సంస్థల థర్మల్‌ ప్రాజెక్టులకు ఈ ఆదేశాలను వర్తింపచేయటం లేదు. మోడీ ప్రభుత్వం కోల్‌ ఇండియా లిమిటెడ్‌ ద్వారా ఆస్ట్రేలియాలోని బొగ్గు గనుల నుండి స్వదేశీ బొగ్గు ధరల కన్నా అనేక రెట్లు అధిక ధరలకు బొగ్గును దిగుమతి చేయించి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు అంటగట్టింది. దీంతో, విదేశీ బొగ్గుతో ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల విద్యుత్‌ వ్యయం విపరీతంగా పెరిగింది. మరోపక్క, విద్యుత్‌ కొరతతో, డిస్కాములు డిమాండ్‌ తీర్చేందుకు విద్యుత్‌ ఎక్సేంజీల ద్వారా చాలా అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ఆ విధంగా ఒక పక్క ఆశ్రిత పెట్టుబడిదారుల, ప్రయివేటు విద్యుత్‌ వ్యాపారుల పబ్బంగడుపుతూ, వినియోగదారులపై విపరీత భారాలు మోపడానికి మోడీ ప్రభుత్వ విధానాలు దారితీస్తున్నాయి. ఉదాహరణకు, తెలంగాణ డిస్కములు ఎస్‌ఈఎంబీ కార్ప్‌ రెండవ యూనిట్‌ నుండి కొంటున్న విద్యుత్‌కు అస్థిర చార్జీలు 2021-22 నుండి 2023-24కు 49.03శాతానికి పెరుగుతున్నట్లు, 2023-24లో ఆ ప్రాజెక్ట్‌ నుండి కొనే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.8.33 చొప్పున చెల్లించాలని వెల్లడించాయి. డిస్కములు 2020-21 సంవత్సరానికి రూ.8790 కోట్ల మేరకు ట్రూ అప్‌ కింద వినియోగదారుల నుండి వసూలు చేసుకునేందుకు అనుమతించాలని కోరాయి. 2022-23లో రూ.6078.73 కోట్ల మేరకు విద్యుత్‌ ఛార్జీలను పెంచాక కూడా ఆ సంవత్సరానికి రూ.901 కోట్ల ట్రూ అప్‌ను అనుమతిచ్చాలని టీఎస్‌ఈఆర్‌సీని కోరాయి. సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ నుండి కొనుగోలు చేసే విద్యుత్‌ కు 2023-24లో యూనిట్‌కు రూ.6.92 చొప్పున చెల్లించాలని డిస్కాములు చూపాయి. ఈ ప్రాజెక్ట్‌కు సింగరేణి బొగ్గుగనుల నుండి బొగ్గును కేటాయించాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్నా మోడీ ప్రభుత్వం ఇంతవరకు సానుకూలంగా ప్రతిస్పందించలేదు. ఇతరులకు కేటాయించిన బొగ్గు సరఫరా చేసాక కూడా తమ బొగ్గు గనులనుండి తమ విద్యుత్‌ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు సరఫరా చేయగలమని సింగరేణి కేంద్రానికి తెలిపినా కూడా స్పందన లేదు. ఒడిశాలోని నాయిని బొగ్గు బ్లాక్‌ నుండి కేంద్రం ఈ ప్రాజెక్టుకు బొగ్గు కేటాయించింది. మోడీ ప్రభుత్వ మొండివైఖరి వల్ల, బ్రిడ్జి లింకేజీ కింద బొగ్గు సరఫరాకు సింగరేణి మార్కెట్‌ ధరల ప్రకారం చాలా అధిక ధరలను ఆ సంస్థ థర్మల్‌ ప్రాజెక్ట్‌ చెల్లిస్తున్న పరిస్థితి కొనసాగుతున్నది. దీనివల్ల సింగరేణి టి.టి.సి. అధికంగా అస్థిర ఛార్జీలను చెల్లించాల్సి వస్తున్నది. పోటీ ఉంటుందని, విద్యుత్‌ ఛార్జీలు తగ్గుతాయని సంస్కరణల మద్దతుదారులు చేసిన వాదనలు డొల్ల అని కూడా రుజువయింది. విద్యుత్‌ ఎక్సేంజీలు ద్వారా వివిధ విద్యుత్‌ వ్యాపారులు పోటీపడి తక్కువ ధరకు విద్యుత్‌ను విక్రయించే పరిస్థితి లేకుండా పోయింది. విద్యుత్‌ వ్యాపారులంతా రింగ్‌గా ఏర్పడి, కొనుగోలు దారులైన డిస్కాములు ఎంత ఎక్కువ రేట్‌ ఇవ్వడానికి అంగీకరిస్తాయో వాటికి విద్యుత్‌ సరఫరా చేసే విధానం అమలు జరుగుతున్నది. ఆ విధంగా విద్యుత్‌ ఎక్సేంజీలు చట్టబద్ధ నల్ల బజారు వ్యాపారానికి అడ్డాలుగా మారడానికి, కొరత పరిస్థితుల సాకుతో ధరలను విపరీతంగా పెంచడానికి మోడీ ప్రభుత్వం వీలుకల్పిస్తున్నది.
ఎం. వేణుగోపాలరావు
(మిగతా రేపటి సంచికలో)

Spread the love