హయ్యర్‌ పెన్షన్‌పై సుప్రీం తీర్పును అమలు చేస్తారా?

ఈపీఎస్‌-95పై నవంబర్‌ 4, 2022న సుప్రీం కోర్టు తీర్పుతో దేశవ్యాపితంగా కార్మికులు, ఉద్యోగులలో (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వేతర ఉద్యోగులు) పెన్షన్‌ పెరుగుదలపై కోలాహాలం ప్రారంభమైంది. అనేక సంవత్సరాలుగా సుప్రీం కోర్టు తీర్పుకోసం ఎంతో అశతో ఎదురు చూస్తున్నారు. కార్మికులు, ఉద్యోగులు ఉద్యోగ విరమణానంతరం అసరాగా పెన్షన్‌ ఇవ్వాలని గత 3 దశాబ్దాలుగా అనేక ఆందోళనలు, పోరాటాలు జరిగాయి. 1995లో ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీం ఈపీఎస్‌-95ను కేంద్రంలోని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన నాడే కార్మికలోకం సంఘటిత – అసంఘటిత రంగంలోని కార్మికులు, ఉద్యోగులకు కనీస పెన్షన్‌ గ్యారంటీ ఉండేలా, ధరల పెరుగుద లకు అనుగుణంగా పెన్షన్‌లో పెంపు దల ఉండాలని కోరారు. దానిపై కాలానుగుణంగా సమీక్ష చేస్తామని, కార్మికులకు ప్రయోజనకరంగా నిర్ణయాలు తీసుకుంటామన్న హమీతో ప్రభుత్వం ఈపీఎస్‌-95 చట్టాన్ని తీసుకొచ్చింది. 2022 నవంబరు 4న సుప్రీం కోర్టు తీర్పుతో కార్మికులు, ఉద్యోగులలో కొంతమందికి ఉపశమనంగా నిజవేతనంపై మేనేజ్‌ మెంట్‌ కాంట్రిబ్యూషన్‌లో 8.33శాతం రికవరీతో హయ్యర్‌ పెన్షన్‌ వస్తుందన్న ఆశతో ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది కనుక ఇక వచ్చేసినట్టేనని రిటైర్డ్‌, సర్వీసులో ఉన్నవారు అనందం వ్యక్తం చేశారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు వెలువడినప్పటి నుండి అమలు చేయాల్సిన ఈపీఎఫ్‌ఓ, స్పందించని కేంద్రప్రభుత్వ కార్మికశాఖల చర్యలు అందుకు అనుగుణంగా లేవన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. కారణమేమంటే సుప్రీం తీర్పులో స్పష్టంగా రెండు విషయాలు పేర్కొన్నారు. నిజవేతనంపై 8.33శాతం ఈపీఎస్‌ రికవరీ దానికనుగుణంగా హయ్యర్‌ పెన్షన్‌ కోసం ఈపీఎఫ్‌ఓ తగిన ప్రొసీజర్‌ రూపొందించి రిటైర్డ్‌, సర్వీసులోని ఉద్యోగుల నుండి ఆప్షన్‌ తీసుకోవాలి. అంతేగాదు ఈ తీర్పు అమలు నాలుగు నెలల్లో అనగా మార్చి 3వ తేదీ కల్లా పూర్తి చేయాలని చెప్పింది. కాని సుప్రీం తీర్పుపై గడువు ముగిసే దశలో ఈపీఎఫ్‌ఓ స్పందించింది. నిజవేతనంపై రికవరీతో హయ్యర్‌ పెన్షన్‌ కోరుకునే వారు దరఖాస్తులు ఇవ్వాలన్న సర్క్యులర్‌ 2023 ఫిబ్రవరి 20న జారీ చేశారు. అదీ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని, అందుకై పోర్టల్‌ను 27 ఫిబ్రవరి 2023 తేదీ నుండి మాత్రమే అందుబాటులో ఉంచారు. సుప్రీం కోర్టు తీర్పు ముగిసే గడువు మార్చి 3వ తేదీకి కేవలం 4 రోజుల ముందు మాత్రమే ఈ సౌకర్యం కల్పించారు. ఆ 4 రోజుల్లోనూ పోర్టల్‌ ఓపెన్‌ కాక, స్తంభించడం వలన దరఖాస్తుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఐటీయూ ఆలిండియా నాయకత్వం ఈపీఎఫ్‌ఓకు, కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖకు సమయం పెంపుదలకై రిప్రజెంటేషన్‌ ఇచ్చి ఒత్తిడి చేసింది. ఆ తరువాత రోజు మే 3 వరకు గడువు పొడిగించినట్లు పోర్టల్లో పెట్టారు. దేశవ్యాపితంగా హయ్యర్‌ పెన్షన్‌ కోసం 8 వేలు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని మార్చి మొదటి వారంలో ఈపీఎఫ్‌ఓ ప్రకటించింది. ఇదీ సుప్రీం కోర్టు తీర్పును ఈపీఎఫ్‌ఓ అమలు చేస్తున్నతీరు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఈపీఎస్‌ ప్రారంభ మైన 1995 నుండి ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు వెలువడేవరకు ఈపీఎస్‌-95 స్కీం అమలు కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్‌ఓ పారదర్శకంగా, చిత్తశుద్ధితో అమలుకు ప్రయత్నించిన దాఖాలాలు కనిపించవు. ఉదాహరణకు నేడు ఆప్షన్‌ ఇవ్వాల్సిన దరఖాస్తుదారులు, రిటైర్‌ అయిన వారు ఎన్ని లక్షలు జమ చేయాలో తెలియదు. సర్వీసులో ఉన్నవారు, ఎంత ఎమౌంట్‌ పీఎఫ్‌ అకౌంటు నుండి ఈపీఎస్‌కు బదలాయించాలో తెలియదు. డిపాజిట్‌ చేసిన అమౌంట్‌కు అనుగుణంగా తిరిగి పెన్షన్‌, బకాయిలు ఎంత వస్తాయో తెలియని స్థితిలో దరఖాస్తు దారులున్నారు. ఈ రకమైన సందేహాలు, అవేదనతో ఆప్షన్‌ ఇవ్వటానికై ఊగిసలాటలో దరఖాస్తుదారులు కొంద రున్నారు. 1995 నుండి 2001 జూన్‌ వరకు ఈపిఎఫ్‌ గరిష్ట వేతన పరిమితి రూ.5వేలు, 2001 జూన్‌ నుండి ఆగస్టు 2014 వరకు రూ.6500లు, 2014 సెప్టెంబరు తర్వాత నుండి రూ.15వేలు, గరిష్ట వేతన పరిమితిగా ఈపీఎస్‌-95 చట్టానికి సవరణలు చేశారు. ఈపీఎఫ్‌ గరిష్ట వేతన పరిమితిని మించి నిజవేతనం పొందుతున్న వారు, తమ నిజవేతనంపై రికవరీ చేయించుకుని తగిన హయ్యర్‌ పెన్షన్‌ పొందటానికి 1996 మార్చిలో ఈపీఎస్‌-95 చట్టానికి చేసిన సవరణతో, నిజవేతనంపై రికవరీకి అను గుణంగా హయ్యర్‌ పెన్షన్‌కు ఆప్షన్‌ ఇవ్వవచ్చని ఈపీఎఫ్‌ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. 2004 ఏడాది చివరివరకు ఆప్షన్‌ క్లోజ్‌ చేశారు. 2014 సెప్టెంబరులో ఈపీఎస్‌ గరిష్ట పరిమితి రూ.6500లు నుండి రూ.15వేలు వరకు పెంచినప్పుడు, 2004లో నిజవేతనంపై రికవరీకై అప్షన్‌ ఇచ్చినవారు కూడా రూ.15వేలు గరిష్ట పరిమితికి మించి ఉన్న నిజవేతనంపై రికవరీకి మరల ఆప్షన్‌ ఇవ్వాలని సర్క్యులర్‌ ఇచ్చారు. నిజవేతనంపై ఈపీఎస్‌ రికవరీకి, దానిపై హయ్యర్‌ పెన్షన్‌కు ఆప్షన్‌కు అవకాశం ఇచ్చారన్న విషయం, అందుకు 2004 చివర వరకే కటాఫ్‌ తేదీ అన్నది తమకు తెలియదని ఈపీఎస్‌లో సభ్యులు అనేక మంది అందోళన చెందారు. ఆప్షన్‌కు కొందరు కోర్టులను ఆశ్రయించారు. అంతేగాదు ఈపీఎఫ్‌ గరిష్ట వేతన పరిమితి రూ.15వేలకు పెంచిన దానిపై ఆప్షన్‌ గురించి వివరాలు అడిగిన ప్రభుత్వ రంగ సంస్థలకు ఈపీఎఫ్‌ఓ నుండి క్లారిఫికేషన్‌ ఇవ్వలేదంటే ఈపీఎఫ్‌ఓ కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఎంత లోపభుయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్షన్‌కై సుప్రీం కోర్టుకు వెళ్ళిన ఆర్‌సీ గుప్తా కేసులో ఈపీఎస్‌ గరిష్ట పరిమితికి మించి ఉన్న నిజవేతనంపై రికవరి అయిన పీఎఫ్‌ను ఈపీఎఫ్‌లో జమచేసినపుడు, ఈపీఎస్‌కు బదలాయిం చటంలో అకౌంట్స్‌ అడ్జస్ట్‌ మెంటే గాని అదనంగా ఈపీఎఫ్‌ఓపై భారమేం ఉండదన్న వాస్తవాన్ని తెలుపుతూ, ఈపీఎఫ్‌ఓ ఆప్షన్‌ అవకాశం ఇవ్వాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అమలులోనూ ఈపీఎఫ్‌ఓ మరొక మెలికను పెట్టింది. ఆర్‌సీ గుప్తా దరఖాస్తు దారుడు నాన్‌ ఎగ్జంప్టెడ్‌ ఎస్టబ్లిష్‌ మెంట్స్‌ సభ్యుడు కనుక ప్రభుత్వ రంగ సంస్థల ఎగ్జంప్టెడ్‌ ట్రస్ట్‌ సభ్యులకు ఆప్షన్‌ ఇచ్చే అవకాశం లేదు అని మరొక సవరణతో ఈపీఎఫ్‌ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. 2016లో ఆర్‌సీ గుప్తా కేసు తీర్పులో నాటి నేపధ్యం, పూర్వాపరాలు పరిశీలించి, 2014 ముందు రిటైరైన ఉద్యోగులకు హయ్యర్‌ రికవరీ, హయ్యర్‌ పెన్షన్‌ పొందే అవకాశం కల్పించారు. తాజా సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పులో 2014 ముందు రిటైరైన వారిలో, మిగిలిపోయిన వారికి ఇప్పుడు ఆప్షన్‌ ఇచ్చే అవకాశం ఉండదని చెప్పింది. ఈ తీర్పును ఈపీఎఫ్‌ఓ తనకనుగుణం గా అన్వయించుకొని 2014 ముందు రిటైరై, హయ్యర్‌ పెన్షన్‌ పొందుతున్న వారికి, తీసుకున్న పెన్షన్‌ వాపసు చేయమని మన రాష్ట్రంలోనే 53వేల మందికి నోటీసులిచ్చినట్లు పత్రికల్లో చూశాం.ఇస్తున్న హయ్యర్‌ పెన్షన్‌ను తగ్గించి పాతపద్ధతిలో తక్కువ పెన్షన్‌నే ఇస్తున్నారు. ఇది ఎంత అనైతికమో, అమానవీయమో ఆలోచించండి. అంతేగాదు 2014లో పెంచిన ఈపీఎస్‌ వేతన గరిష్ట పరిమితి రూ15వేలు మించి ఆదాయం వచ్చినవారు 2014 తర్వాత ఈపీఎఫ్‌లో సభ్యులైన ఉద్యోగులకు పెన్షన్‌కి అర్హత లేదని ఈపీఎఫ్‌ఓ వారు మరొక సర్క్యులర్‌ జారీ చేశారు. హయ్యర్‌ పెన్షన్‌ ఆప్షన్‌ కోసం ఈపీఎఫ్‌ఓ పెట్టిన నిబంధనలు చూస్తుంటే, పామునిచ్చెన ఆట కళ్ళముందు కదలాడుతున్నది. అన్ని ఆటంకాలను ఎదుర్కొని ఎవరైనా ఆప్షన్‌ కోసం వస్తే బ్రహ్మాస్త్రం లాంటి పీఎఫ్‌ యాక్ట్‌లోని 26(6) క్లాజును చూపుతున్నది. హయ్యర్‌ పెన్షన్‌కై ఆప్షన్‌ కోరుకునేవారు, హయ్యర్‌ పిఎఫ్‌ రికవరీ కోసం ఎంప్లాయి ఫ్లస్‌ ఎంప్లాయర్‌ జాయింట్‌ ఆప్షన్‌ గతంలోనే తీసుకుని ఉండాలని చెపుతున్నది. ప్రస్తుతం గరిష్ట పరిమితి కంటే మించి ఉన్న ఎంప్లాయీస్‌ నిజవేతనాలపై పీఎఫ్‌ రికవరి చేసి ఎగ్జామ్‌టెడ్‌ ట్రస్ట్‌లోను, నాన్‌ ఎగ్జంటెడ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లోనూ జమచేస్తూనే ఉన్నారు. దానిపై ఈపీఎఫ్‌ఓ నిరంతరం తనిఖీ చేస్తున్నా ఎన్నడూ అభ్యంతరాలు పెట్టిన సందర్భాలు లేవు. నేడు హయ్యర్‌ రికవరీతో హయ్యర్‌ పెన్షన్‌కై ఆప్షన్‌ అడిగే వారిని, హయ్యర్‌ పీఎఫ్‌ రికవరీకై గతంలో నే జాయింట్‌ ఆప్షన్‌ ఇచ్చివుండాలని చెప్పడమంటే, ఇంతకాలం నిజవేతనంపై పీఎఫ్‌ రికవరీ అవుతుంటే ఈపీఎఫ్‌ఓ ఏం చేస్తున్నట్టు? కళ్లు మూసు కున్నదా? దీన్ని బట్టి హయ్యర్‌ పీఎఫ్‌ రికవరీ తో హయ్యర్‌ పెన్షన్‌ ఆప్షన్‌ ఎవ్వరికీ అవకాశం లేకుండా చేసే అస్త్రాలుగా, కుట్రపూరిత నిబంధనలను ఈపీఎఫ్‌ఓ అమ్ముల పొదిలో పెట్టుకున్నట్లుగా స్పష్ట మవుతున్నది. అంతేకాదు, ఈ సుప్రీం కోర్టు తీర్పుతోనూ 2014కు ముందు సర్వీస్‌లో ఉండి 2014 తర్వాత రిటైరైన, లేదా సర్వీసులో కొనసాగుతున్న వారు మాత్రమే హయ్యర్‌ పెన్షన్‌కు ఆప్షన్‌ పొందటానికి అర్హులు. 2014 ముందు రిటైరైన వారు, అప్పుడు ఆప్షన్‌ అడగనివారు నిజవేతనం పై ఈపీఎస్‌ రికవరీతో హయ్యర్‌ పెన్షన్‌ పొందలేరు. అంతే గాదు 2014 తర్వాత ఉద్యోగా ల్లో చేరిన వారిలో రూ.15వేలు మించి ఆదాయం ఉన్నవారికి ఈపీఎస్‌-95 పెన్షన్‌ వర్తిం చదు. ఈవిధంగా ఏక పక్షంగా చట్టసవరణలతో హయ్య ర్‌ పెన్షన్‌కు అవకాశం లేకుండా నిబంధనలను పెట్టి ఈపీఎఫ్‌ సభ్యుల హక్కులను కాల రాస్తున్నది. విశ్వగురువుగా ప్రకటించుకుంటున్న కేంద్ర ప్రభుత్వ పాలకులకు కార్పొరేట్ల సంక్షేమమేగాని, వారికి సంపద కూడబెడుతున్న కార్మికులు, ఉద్యోగులకు తమ నిజవేతనాలపై ఈపీఎస్‌ రికవరీని- దానిపై పెన్షన్‌కు తగిన చర్యలు తీసుకోకపోవటం ఏమిటన్నది అనేక మందిలో మెదలవుతున్న ప్రశ్న. కోట్ల రూపాయల ఖర్చుతో ఐదేండ్ల కోసం పార్లమెంటుకు ఎన్నికైన పాలకులు, తమకు కనీస పెన్షన్‌ 50వేల రూపాయలు వచ్చేలా బిల్లు పాసు చేసుకున్నారు. 35సంవత్సరాల సర్వీసుతో రిటైరైన శ్రామికులకు పిఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌తో వచ్చే పెన్షన్‌కై తగిన చర్యలు తీసుకోకపోవటమంటే ప్రజాపాలనకు వీరికి ఏం అర్హత ఉన్నట్టు? అంతేగాదు ఇటీవల పార్లమెంటు సెషన్‌ సందర్భంగా రాజ్యసభలో పెన్షన్‌పై ప్రధాని పలుకులు వింటే కార్మికుల, ఉద్యోగుల సంక్షేమం పట్ల వారి చిత్తశుద్ది ప్రశ్నార్థకంగా కన్పిస్తున్నది. కేంద్ర ప్రభుత్యోద్యోగులకు రిటైర్మెంట్‌ సమయంలో వచ్చే జీతంలో సగం పెన్షన్‌ పొందే పాతపెన్షన్‌ సౌకర్యాన్ని 2004 తర్వాత జాయినయిన వారికి వాజ్‌పేయి ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాన్ననుసరించి పాత పెన్షన్‌ విధానాన్ని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తొలగించినా కేరళ, రాజస్తాన్‌ లాంటి కొన్ని ప్రభుత్వాలు కొనసాగించటం సరియైంది కాదని ప్రధాని హెచ్చరించటం గమనార్హం. అలాంటి వారి సారధ్యంలో కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఈపీఎఫ్‌ఓ ద్వారా సుప్రీం తీర్పును సక్రమంగా అమలు జరుపుతారా అన్న అనుమానాలు కలుగు తున్నాయి. అందుకే కార్మికోద్యంతో సాధించు కున్న ఈపీఎస్‌ -95 చట్టాన్ని, అందు కనుగుణంగా ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పు అమలు జరగాలన్నా అంశంపై కార్మికులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. దీని అమలు కోసం పోరాటాలు చేస్తూనే ఉండాలి.
– సిహెచ్‌. కృష్ణారావు, 9490098586
జె. రాఘవరావు, 9989830251

Spread the love