పాలు పిరం

milk milk– లీటర్‌కు రూ.2 పెంపు ..
– నిన్న అమూల్‌, నేడు మదర్‌ డెయిరీ
– పోలింగ్‌ ముగిసిన వెంటనే భారాలు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : పాల ధరలను లీటరుకు రెండు రూపాయిలు పెంచినట్లు అమూల్‌, మదర్‌ డెయిరీ సంస్థలు ప్రకటించాయి. గత 15మాసాలుగా ఉపకరణాల వ్యయం పెరిగినందున ఈ ధరలను పెంచాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. అన్ని రకాల పాలకు ఈ ధరల పెంపు వర్తిస్తుందని, పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ మార్కెట్‌లోనే కాకుండా ఈ పాలు దొరికే ఇతర మార్కెట్లలో కూడా ధరలు పెరుగుతాయని ఆ సంస్థలు పేర్కొన్నాయి. ఆదివారమే అమూల్‌ తన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించినా సోమవారం నుండే ఇవి అమల్లోకి వచ్చాయి. మదర్‌ డెయిరీ సోమవారం ధరల పెంపును ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే అమూల్‌, మదర్‌ డెయిరీ సంస్థల నుండి ఈ ప్రకటన వెలువడింది. ఏటికేడాది ఉత్పత్తి వ్యయం పెరిగిపోతున్నందున పాల ధరలను పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆ సంస్థలు వెల్లడించాయి.
తాజా ధరల పెంపు నేపథ్యంలో మదర్‌ డెయిరీ పాలకు సంబంధించి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఫుల్‌ క్రీమ్‌ మిల్క్‌ లీటరు రూ.68కాగా, వైట్‌ టోన్డ్‌, డబుల్‌ టోన్డ్‌్‌ పాలు రూ.56, 50గా వున్నాయి. గేదె పాలు, ఆవు పాలు వరుసగా లీటరు రూ.72, రు.58గా వున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ మార్కెట్లో మదర్‌ డెయిరీ రోజుకు 35లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది. సమర్ధవంతమైన 3-4 శాతం సవరణతో క్షేత్ర స్థాయిలో ధరల పెంపు కేవలం పాక్షికంగా మాత్రమే వినియోగదారులకు బదిలీ అవుతుందని తద్వారా పాల ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాలకు భద్రత కల్పిస్తామని మదర్‌ డెయిరీ పేర్కొంది.
కాగా, అమూల్‌ గేదె పాలు, గోల్డ్‌ మిల్క్‌, శక్తి మిల్క్‌ పాలు వరుసగా అరలీటరు రూ.36, 33, 30గా వున్నాయి. లీటరుకు రూ.2 పెంపుతో ఎంఆర్‌పిలో మూడు నుండి నాలుగు శాతం పెంపు కనిపిస్తుందని, ఇది, సగటు ద్రవ్యోల్బణం కన్నా చాలా తక్కువగానే వుంటుందని గుజరాత్‌ పాల సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (జీసీఎంఎంఎఫ్‌) ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయిలో దాదాపు 80పైసల వరకు పాల ఉత్పత్తిదారులకు చేరుతుందని పేర్కొంది.
సీపీఐ(ఎం) ఖండన
అమూల్‌, మదర్‌డెయిరీ సంస్థలు లీటరు పాల ధరను రూ.2 పెంచడాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఎన్నికలు ముగిసేవరకు ప్రభుత్వం వేచి చూసిందని, ఆ వెంటనే ప్రజలపై భారం మోపిందని దీంతో స్పష్టమైందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఇంతకుముందే, పోలింగ్‌ ముగిసిన వెంటనే, రోడ్‌ టోల్‌ పన్ను ఐదు శాతం పెంచారని, దీనివల్ల అన్ని సరుకుల ధరలు పెరుగుతాయని, ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయని, మరోవైపు ప్రజల రవాణా వ్యయం కూడా పెరుగుతుందని సీపీఐ(ఎం) పేర్కొంది.
కుటుంబాల బడ్జెట్‌పై భారం : ఐద్వా
పాల ధరలు పెంచడాన్ని ఐద్వా ఒక ప్రకటనలో ఖండించింది. అలాగే రహదారుల టోల్‌ ట్యాక్స్‌ను ఐదు శాతం పెంచడాన్ని కూడా ఖండించింది. దీనివల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతాయని, అంతిమంగా కుటుంబాల బడ్జెట్‌ దారుణంగా దెబ్బతింటుందని విమర్శించింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇటువంటి చర్యలు తీసుకోవడమంటే ప్రజలను మోసం చేయడమేనని విమర్శించింది. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్న మహిళలపై ఈ చర్యలు అదనపు భారాన్ని మోపుతాయని పేర్కొంది. పిల్లలను, మహిళలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ పాల ధరలను ఉపసంహరించాలని ఐద్వా డిమాండ్‌ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని పేర్కొంది.

Spread the love