జూకంటి పౌల్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికులకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కమిటీ ఆధ్వర్యంలో పని ప్రదేశాన్ని సందర్శించిన ఆయన, కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పౌల్ మాట్లాడుతూ తీవ్ర ఎండలో పని చేస్తున్న కార్మికులకు నీడ కోసం టెంట్లు, త్రాగునీటి సదుపాయం, ప్రమాదాల సమయంలో తక్షణ చికిత్స అందించేందుకు మెడికల్ కిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరారు.కనీస సౌకర్యాలు కూడా లేకుండా కార్మికులు అగ్నిగుండంలా మండుతున్న ఎండలో పనిచేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేకపోవడంతో గ్రామీణ పేదలు వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారని, అయితే వ్యవసాయ రంగం కూడా దెబ్బతినడంతో ఉపాధి హామీ పథకమే వారికి ప్రధాన ఆదారంగా మారిందన్నారు.అలాంటి పథకాన్ని కూడా బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు.
కూలీలకు సరైన వేతనాలు చెల్లించకపోవడం, కేవైసీ వంటి నిర్బంధాలు పెరగడం, జాబ్ కార్డులు సకాలంలో ఇవ్వకపోవడం వంటి సమస్యలను ఆయన ప్రస్తావించారు. వారం వారం చేసిన పనికి వేతనాలు చెల్లించకపోతే కార్మికులు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి సంవత్సరానికి 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ.800 కూలీ చెల్లించాలని, కేవైసీ విధానాన్ని రద్దు చేసి, 2005లో అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని కార్మిక హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కమిటీ సభ్యులు గంధ ఐలయ్య,పైసా సంతోష్,అనూషతో పాటు ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.



