ఈ రుణం తీర్చుకోలేనిది : మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

– మనసు నిండా ప్రజాసేవ చేస్తున్నా..
– మీ ప్రేమాభిమానాలు ఆత్మసంతృప్తినిచ్చాయి… 
– ఇంకా ఇంకా సేవ చేసి మీవాడిగా ఉంటా…
– బడా భీమ్‌గల్‌ జనం నాకు వెయ్యేనుగుల బలాన్నిచ్చారు
– బంజారాలకు అండగా ఉంటా..
– భీమ్‌గల్‌ మండలంలో  ప్రచారం..
నవతెలంగాణ భీమ్‌గల్: వ్యాపారంలో ఎంతో బిజీగా ఉండి సంపాదించినా దొరకని సంతృప్తి మనసునిండా ప్రజాసేవ చేస్తుంటే లభిస్తున్నదని, ఇందుకు బడా భీమ్‌గల్‌ ప్రజలు తన ప్రచారంలో బ్రహ్మరథం పట్టి చూపించిన అభిమానమే నిదర్శనమని ఆర్‌అండ్‌బీ మంత్రి, బాల్కొండ బీఆరెస్‌ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్‌ మండలం రూప్లాతాండా, ఎంజీ తాండా , బడా భీమ్‌గల్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బడా భీమ్‌గల్‌ ప్రజలు చూపించిన ఆదరణ ఈ ఎన్నికల వేళ తనకు వెయ్యేనుగుల బలాన్నిచ్చిందన్నారు. గ్రామస్తులు చూపించిన ప్రేమతో తన కళ్లు చమర్చాయని భావోద్వేగంతో అన్నారు. తనకెంతో సంతృప్తినిచ్చిన బడా భీమ్‌గల్‌ గ్రామ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, మరింత అభివృద్ది చేసి మీ ప్రేమాభిమానాలు కాపాడుకుంటానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. లింబాద్రి గుట్ట ఆలయ అభివృద్ధి కోసం విన్నవిస్తే సీఎం కేసీఆర్‌ వేల్పూర్ బహిరంగ సభలో ఓకే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. లింబాద్రి గుట్ట ఆలయ అభివృద్ధికి మన ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయనున్నదని చెప్పారు.చెక్‌ డ్యాం నిర్మాణంతో గ్రామంలోని రైతుల ఇబ్బందులు తీరినందుకు తనకెంతో సంతోషం కలిగించిందన్నారు. తండాలను పంచాయతీలను చేసిన కేసీఆర్‌ను గిరిజనులు కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నేను మీతో ఉంటా.. మీరు నాతో ఉంటారు.. అని ఎంజీ తాండా, రూప్లా తాండా గిరిజనులతో ఆత్మీయంగా ప్రసంగించారు. కళ్యాణలక్ష్మీకి నాంది పడిందే గిరిజనులతో అని గుర్తు చేశారు. నియోజకవర్గంలో తీజ్‌ భవనాలు, సేవాలాల్ మహారాజ్‌ గుడుల నిర్మాణాలకు ఎక్కడ లేని విధంగా రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించానని చెప్పారు. ఈ సందర్బంగా మంత్రి వేములకు ఆయా తాండాల గిరిజన మహిళల లంబాడా నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి వారితో కలిసి స్టెప్పులు వేశారు.

Spread the love