మిషన్‌ భగీరథ నీరు.. తాగితే బేజారు..!

– దుర్వాసన వెదజల్లుతున్న నీరు
– విద్యుత్‌ బిల్లుల మోతతో బోర్ల నీటి సరఫరాకు మంగళం
– హ్యాండిల్‌ బోరు నీళ్లతో దాహార్తి తీర్చుకుంటున్న జనం
– అందని ద్రాక్షలా పశు వైద్యం
– కానరాని సర్కారు వైద్యం..
– చిన్న ఆచంపల్లిలో సమస్యలన్ని పెద్దవే..
– ‘విలేజ్‌ విజిట్‌’లో వెలుగు చూసిన నిజం
నవతెలంగాణ – గంగాధర
మిషన్‌ భగీరథ నీరు తాగితే బేజారేనంటూ జనం భయాందోళన చెందుతున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఊల్లోని ఏ నోట విన్నా అదే మాట వినిపిస్తోంది. శుద్ధ జలం సరఫరా చేస్తున్నామంటూ డాంబీకాలు చెప్పుకునే పాలకులు, అధికారుల మాట ఎలా ఉన్నా ఆ గ్రామంలో నల్లాల ద్వారా ఇంటింటికి చేరే భగీరథ నీరు కాలకృత్యాలకు వినియోగిస్తుండడం గమనార్హం. దుర్వాసన వెదజల్లుతున్న నీరు సేవిస్తే అనారోగ్యం బారిన పడతామనే భయంతో జనం వణికిపోతున్నా ఊల్లో ఉన్న బోర్ల నీరు ట్యాంకుకు చేర్చి నల్లాలకు సరఫరా చేయకుండా జీపీ సిబ్బంది వింత వైఖరిని అనుసరిస్తున్న తీరు నవతెలంగాణ ‘విలేజ్‌ విజిట్‌’తో వెలుగులోకి వచ్చింది.
గంగాధర మండలం ఆచంపల్లి గ్రామం నుండి 2018లో విడిపోయి చిన్న ఆచంపల్లి గ్రామం ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. వ్యవసాయంపై ఆదారపడి జీవించే కుటుంబలే అధికం కాగా, ఇక్కడి జీపీకి పన్నుల రూపేనా వచ్చే ఆదాయం రూ.లక్షా 50వేల లోపే కావడంతో ట్రాక్టర్‌ ఈఎంఐ, విద్యుత్‌ బిల్లులు, జీపీ సిబ్బంది వేతనాలు గుదిబండగా మారాయి. దీంతో చేసేది లేక బిల్లుల మోతను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా పైసా ఖర్చు లేకుండా ట్యాంకుకు చేరుతున్న మిషన్‌ భగీరథ నీటిని జీపీ సిబ్బంది నల్లాలకు వదిలి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లుతున్న మిషన్‌ భగీరథ నీరు సేవించలేక, హ్యాండిల్‌ బోర్ల నీటితో ప్రజలు దాహార్తిని తీర్చుకుంటున్నారు. గ్రామంలో 3 బోర్లు, ఓ రక్షిత మంచినీటి బావి ఉన్నా, ఈ బోర్లు, బావి నుండి ట్యాంకుకు నీరు చేర్చి నల్లాలకు నీటి సరఫరా చేయకుండా భగీరథ నీటి సరఫరాతో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్‌ బిల్లుల ఖర్చు తప్పుతుందనే సాకుతో గ్రామంలోని ఓ బోరు నీరు అప్పుడప్పుడు ట్యాంకుకు ఎక్కిస్తూ మిషన్‌ భగీరథ నీటితో మిక్స్‌ చేసి నల్లాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో నల్లాల ద్వారా ఇంటింటికి చేరే నీరు కాలకృత్యాలకు వినియోగిస్తూ హ్యాండిల్‌ బోరు నీళ్లు తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటున్నామని గ్రామస్తులు వాపోయారు.
పత్తా లేని ప్రత్యేకాధికారి
గ్రామంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నా ఇక్కడి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన రాజు గ్రామానికి వచ్చిన దాఖలాలే లేవనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కో ఆపరేటివ్‌ సొసైటీ అధికారిగా కొనసాగుతున్న రాజును ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా వేసింది. బాధ్యతలు తీసుకున్న రోజే జీపీకి వచ్చి వెళ్లాడే తప్ప నాటి నుండి నేటి వరకు గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఎందుకు జీపీకి రావడంలేదని మండలాధికారులు ప్రశ్నిస్తే ఏదో కారణం చెపుతూ గ్రామం వైపు కన్నెత్తి చూడకుండా పోవడం వల్ల గ్రామంలోని సమస్యలు పట్టించుకునే వారే లేకుండా పోతోందని గ్రామస్తులు వాపోతున్నారు.
పశు సంపద అధికం.. కానరాని వైద్యం
వ్యవసాయమే జీవనాధారంగా జీవించే ఇక్కడి వ్యవసాయ కుటుంబాలు పశువుల పెంపకంతో మమేకమై ఉన్నారు. పశు సంపద అధికంగా ఉన్నా జీవాలకు వైద్యం అందని ద్రాక్షలాగే మారింది. వ్యవసాయ రంగానికి మూలమైన పశువులు అనారోగ్యం బారిన పడితే అందుబాటులో ఉన్న పశు వైద్య సిబ్బంది గ్రామానికి వచ్చి వైద్యం చేసే పరిస్థితి లేదని స్థానిక రైతులు వాపోయారు. పశువులకు ఏ చికిత్స చేయించాలన్నా కొత్తపల్లి మండలం నాగులమల్యాలకుగాని, గంగాధర మండలం గర్శకుర్తికిగాని తీసుకెళ్లాల్సిందేనని రైతులు ఆవేదన చెందారు. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తే తప్ప గ్రామానికి పశు వైద్యులు, వైద్య సిబ్బంది వచ్చిన దాఖలాలే లేవని రైతులు ఆరోపించారు.
దరి చేరని సర్కారు వైద్యం..
సర్కారు వైద్యం గ్రామం దరిచేరకపోగా ఏ చికిత్సకైన ఆర్‌ఎంపీ, పీఎంపీలే దిక్కయ్యారని గ్రామస్తులు ఆవేదన చెందారు. గ్రామ గ్రామాన ప్రభుత్వం పల్లె దావఖానాలు ఏర్పాటు చేసిన మా పల్లెలో ఎటువంటి ఆస్పత్రి లేక వైద్యం అందక పట్టణాలకు పరుగులు తీస్తున్నామంటూ ప్రజలు వాపోయారు. గ్రామంలో 125 ఇండ్లు ఉండగా, గ్రామ జనాభా 564 కాగా, ఓటర్లు 497 మంది ఉన్నారు. వ్యవసాయమే జీవనోపాధిగా బతుకుతున్న ఇక్కడి వ్యవసాయదారులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం పల్లె దావఖానాను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది.
రోడ్లపైనే మురుగు నీరు
గ్రామంలోని ప్రతి వీధిలో సీసీ రోడ్లే దర్శనమిస్తుండగా, పలు వీధుల్లో డ్రెయినేజీలు లేక మురుగు నీరు రోడ్లపైకి చేరుతోంది. గ్రామంలోని ప్రధాన కూడలిలో సీసీ రోడ్డుతోపాటు డ్రెయినేజీ ఉన్నా పలు చోట్ల కాలువల నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఇండ్లలో వినియోగించిన నీరు పరిసరాల్లోనే ఇంకుతుంటే, వర్షపు నీరు రోడ్లపైనే ప్రవహిస్తూ చేరుతుందని గ్రామస్తులు వాపోయారు.
బోరు నీళ్లే తాగుతున్నం – రేకుల విజయ
నల్లాల ద్వారా ఇండ్లకు చేరుతున్న మిషన్‌ భగీరథ నీళ్లు దుర్వాసన వస్తుంది. కాలకృత్యాలకు తప్ప తాగడానికి వాడుతలేము. బోర్ల నీళ్లు ఇడ్తలేరు. పది రూపాయలు పెట్టి ఫిల్టర్‌ నీళ్లు తెచ్చుకుని తాగే స్థోమతలేక హ్యాండిల్‌ బోరు నీళ్లు కొట్టి తెచ్చుకుని తాగుతున్నం. ఊల్లో ఉన్న బోర్ల నీళ్లు నల్లాలకు వదిలితే తాగేటోళ్లమే. భగీరథ నీళ్లు బంజేసి ఊల్లోని బోర్ల నీళ్లు నల్లాలకు వదలాలి.
ఏ నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నం : కూతూరు లక్ష్మి
నల్లాల ద్వారా వదిలే ఏ నీళ్లు రాక తాగునీటికి ఇబ్బంది పడుతున్నం. గ్రామంలోని బోర్లు, బావి నీరు సరఫరా చేయడానికి ఉన్న పైపులు తీసేసి మిషన్‌ భగీరథ పైపులకు నల్లాలు కలిపారు. ఇటు ఊల్లే నీళ్లు లేవు, అటు భగీరథ నీళ్లు రాకుండా పోయాయి. నీళ్లు లేక బోర్లకు కొట్టుకొచ్చుకుని తాగుతున్నం. ఎండకాలంలో నీళ్ల గోస పట్టించుకునేటోళ్లే లేకుండా పోయిర్రు.
వైద్యం అందడం లేదు – ఆముదాల మల్లారెడ్డి
తెల్లారి లేస్తే పశువులతోనే పని. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నం. పశువులకు ఏ చిన్న వైద్యం చేయించాలన్నా నాగులమల్యాలకో, గర్శకుర్తికో పోవల్సిందే. మా ఊరికి పశు వైద్యులు, సిబ్బంది వచ్చిన దాఖలాలు లేదు. అన్ని ఊళ్లలో పల్లె దావఖానా ఉన్న మా ఊల్లో లేదు. ఏ రోగం వచ్చి ఆర్‌ఎంపీ, పీఎంపీలే దిక్కవుతున్నరు తప్ప సర్కారు వైద్యం అందడం లేదు. ఏ చికిత్స చేసుకోవలన్నా కరీంనగర్‌కు పరుగులు తీస్తున్నం.

Spread the love