అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, మిషన్ భగీరధ ఇంటింటి సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు కలెక్టరేటులోని సమావేశ మందిరంలో మండల స్పెషల్ ఆఫీసర్లు, మండల అభివృద్ది అధికారులు, మండల పంచాయితీ అధికారులతో ఆయన సమీక్షిస్తూ… అమ్మ ఆదర్శ పాఠశాలలకు సంబంధించి కనీస వసతులైన త్రాగునీరు, మైనర్ రిపేర్లు, కిటికీలు, తలుపుల రిపేర్లు, విద్యుత్ పనులు, ఫాన్స్, లైట్స్ పనులు, ఉపాధి హామీ పనుల క్రింద టాయ్లెట్స్, బాలికల కోసం ప్రత్యేక టాయ్లెట్స్ పనులు సత్వరమే పూర్తి చేసుకోవాలని, ప్రతి పాఠశాలకు పనుల వారిగా ఫైల్స్ ఏర్పాటు చేసుకోవాలని, పనులు పూర్తయిన చోట ఎంపిడిఓలు పరిశీలించి సంబంధిత బడ్జెట్ రిలీజ్ చేయాలని, పనులు పూర్తయిన పాఠశాలల్లో పెయింటింగ్ పనుల కోసం వివరాలు పంపాలని తెలిపారు. మిషన్ భగీరథ ఇంటింటి సర్వే పకడ్బందీతో వేగంగా జరగాలని, మండల అభివృద్ది అధికారులు, మండల పంచాయితీ అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు పూర్తి సమన్వయంతో క్షేత్రస్థాయిలో సర్వేను పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాలోని గ్రామ పంచాయితీలు, హ్యబిటేషన్లలో ఇంటింటి సర్వే వివరాలను పంచాయితీ సెక్రటరీల ద్వారా యాప్ లో అప్లోడ్ వేగంగా నిర్వహించాలని, సర్వే ప్రాముఖ్యతను అందరూ గమనించాలని, ప్రతి ఒక్క ఇంటికి త్రాగునీరు అందించడమే లక్ష్యంగా సర్వే నిర్వహించాలని, ప్రతి ఇంటి నల్లా కనెక్షన్ వివరాలను నమోదు చేయాలని, లింక్ హౌజెస్ మిస్ అయితే వారిని కొత్తగా నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె గంగాధర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి ఎంఎ కృష్ణన్, జిల్లా పంచాయితీ అధికారి సునంద, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పాపారావు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపిడిఓలు, ఎంపిఓలు పాల్గొన్నారు.